'ఆర్య' సినిమాతో ప్రభాస్ కనెక్షన్ ఏంటో తెలుసా?
సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాల కథల వెనుక ప్రత్యేకమైన కథలు ఉంటాయి. సూపర్ హిట్ అయిన సినిమాల కథల గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం.
By: Tupaki Desk | 12 March 2025 11:46 AM ISTసినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాల కథల వెనుక ప్రత్యేకమైన కథలు ఉంటాయి. సూపర్ హిట్ అయిన సినిమాల కథల గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. స్టార్ హీరోలు వదిలేసిన కథను మరో హీరో కమిట్ కావడం, ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ నో చెప్పిన మూడు నాలుగు కథలు రవితేజ వద్దకు వెళ్లాయని, వాటికి ఓకే చెప్పిన రవితేజ సూపర్ హిట్ అందుకున్నాడని రెగ్యులర్‌గా మనం వింటూనే ఉంటాం. ఇంకా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు సైతం ఏదో ఒక సమయంలో మంచి కథలను మిస్ అయ్యారు, భవిష్యత్తులోనూ ఏదో కారణం వల్ల మిస్ అవుతారు.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే... అల్లు అర్జున్ కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీస్ కొన్ని ఉంటాయి. ఆ కొన్నింటిలో ఆర్య సినిమా ఒకటి అనడంలో సందేహం లేదు. సుకుమార్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన ఆర్య సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్య సినిమా వల్లే బన్నీ ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడని అంటారు. ఆ విషయాన్ని అల్లు అర్జున్ సైతం పలు సందర్భాల్లో అన్నారు. సుకుమార్‌తో బన్నీ చేయడం వల్లే తన కెరీర్ నిలదొక్కుకుందని అంటాడు. అలాంటి ఆర్య కథ మొదట అల్లు అర్జున్ వద్దకు కాకుండా ప్రభాస్ వద్దకు వెళ్లిందట. ప్రభాస్ కి ఆర్య కథ నచ్చిందట, కానీ వన్ సైడ్ లవ్ స్టోరీ కావడంతో ఆలోచనలో పడ్డాడట.
యూత్‌కి వన్ సైడ్ లవ్ ఎంత వరకు ఎక్కుతుందో అనే అనుమానంతో ప్రభాస్ ఆ రోజు ఆర్య కథను సున్నితంగా తిరస్కరించాడట. దిల్ రాజు స్వయంగా సుకుమార్‌ను తీసుకు వెళ్లి ప్రభాస్‌కి ఆర్య కథ వినిపించారని, కొన్ని రోజుల చర్చల తర్వాత ప్రభాస్ నో చెప్పారని సమాచారం. అల్లు అర్జున్ ఆ సమయంలో సినిమా కథ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడట. అల్లు అర్జున్ కి ఆర్య కథ సెట్ అయ్యేనా అని అల్లు అరవింద్ అనుమానం వ్యక్తం చేశారని, చివరకు ఓకే చెప్పడంతో సుకుమార్ ఆర్య సినిమాను మొదలు పెట్టారట. ఆర్యను ప్రభాస్ చేసి ఉంటే ఎలా ఉండేది అంటూ అప్పట్లో కొందరు మాట్లాడుకుంటూ ఉండే వారు. ఏ కథ ఎవరికి రాసి పెట్టి ఉంటే వారి వద్దకు చేరుతుందని అంటారు. ఆర్య కథ బన్నీ వద్దకు చేరింది.
ఆర్య సూపర్ హిట్ కావడంతో సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లోనే ఆర్య 2 సైతం వచ్చిన విషయం తెల్సిందే. భవిష్యత్తులో ఆర్య 3 సైతం తీసుకు వస్తానని సుకుమార్ ఒకటి రెండు సార్లు చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆర్య సినిమాను కాదన్న ప్రభాస్ మరో సినిమాని కమిట్ అయి తాను మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కనుక ఆర్య సినిమా వదిలేశాను అనే అసంతృప్తి ఎప్పుడూ ప్రభాస్‌కి ఉండదు. ప్రభాస్, అల్లు అర్జున్ ఇప్పుడు ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్ అనే విషయం తెల్సిందే. ఇద్దరి సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ పోటీ పడుతున్నాయి. ఆర్య చేతులు మారినప్పటికీ వీరిద్దరు మంచి స్నేహితులు.. ఇప్పటికీ వీరి స్నేహం కొనసాగుతూ ఉంటుంది.