డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?.. ప్రభాస్ వీడియో వైరల్!
ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు.
By: Tupaki Desk | 31 Dec 2024 3:03 PM GMTతెలంగాణాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డ్రగ్స్ వినియోగంపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. 'డ్రగ్స్ రహిత తెలంగాణ సమాజమే మా ప్రభుత్వ లక్ష్యం.. మాతో చేతులు కలపండి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో భాగంగా టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. మనల్ని ప్రేమించే వాళ్ళు ఉండగా ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్? అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్ మానివేయాలని, ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే 871 267 1111 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేశారు.
''లైఫ్ లో మనకి బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి.. కావాల్సినంత ఎంటెర్టైనెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనుషులు, మన కోసం బ్రతికే మనవాళ్ళు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?. ఈరోజే డ్రగ్స్ వద్దు అని చెప్పండి. మీకు తెలిసినవారు ఎవరైనా డ్రగ్స్ కి బానిసలైతే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయండి. వాళ్ళు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది'' అని ప్రభాస్ వీడియోలో పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టే సామాజిక కార్యక్రమాలకు ఇండస్ట్రీ సపోర్ట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సినీ ప్రముఖుల భేటీలో ప్రస్తావించారు. డ్రగ్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో తెలుగు చిత్ర పరిశ్రమ కూడా చురుగ్గా పాల్గొనాలని కోరారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ, గవర్నమెంట్ కలిసి పని చేస్తాయని ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్, నిర్మాత దిల్ రాజు మీడియాకి తెలిపారు. ఇందులో భాగంగానే ఇప్పుడు డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని హీరో ప్రభాస్ స్పెషల్ వీడియో రిలీజ్ చేసారని తెలుస్తోంది.
డ్రగ్స్ కు బానిసలుగా మారి ఎందరో యువతీ యువకులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత సమాజంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే ప్రభాస్ డ్రగ్స్ అవేర్‌నెస్ క్యాంపెయిన్‌లో పాల్గొనగా.. రాబోయే రోజుల్లో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ కూడా తమ సందేశాలను వీడియోల ద్వారా తెలుపనున్నారు. ఇకపోతే కొత్త సినిమాల విడుదల సమయంలోనూ నటీనటులు డ్రగ్స్ మీద సందేశాత్మక వీడియోలు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'పుష్ప 2: ది రూల్' రిలీజ్ కు ముందు హీరో అల్లు అర్జున్ సైతం డ్రగ్స్ మీద అవేర్‌నెస్ వీడియో చేసారు.
ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సందర్భంగా డ్రగ్స్ సేవించే వారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించింది. డ్రగ్స్ తీసుకొని దొరికితే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరికలు జారీ చేసారు. హైదరాబాద్‌లో ఈరోజు రాత్రి 8 గంటల నుండి రేపు ఉదయం 7 గంటల వరకు డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు చేయనున్నట్లు తెలిపారు. డ్రంకన్ డ్రైవ్‌లో దొరికిన వారికి రూ.10 వేల జరిమానా, 6 నెల జైలు శిక్ష, 3 నెలలు లైసెన్స్ రద్దు.. రెండోసారి దొరికిన వారికి రూ.15 వేలు జరిమానా విధింపు ఉంటుందని పేర్కొన్నారు.