Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు ఫిక్స్‌!

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్‌' సినిమాను చేస్తున్నాడు

By:  Tupaki Desk   |   16 Dec 2024 7:30 AM GMT
ప్రభాస్‌ కోసం ఇద్దరు ముద్దుగుమ్మలు ఫిక్స్‌!
X

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో 'రాజాసాబ్‌' సినిమాను చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్‌లో ఆ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. సీతారామం సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమాను ప్రభాస్‌ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు 2025లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలతో పాటు స్పిరిట్‌ సినిమాను ప్రభాస్ మొదలు పెట్టబోతున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్‌ సినిమా ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారికంగా నిర్మాత ప్రకటించారు.

అర్జున్‌ రెడ్డి, యానిమల్ సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్‌ వంగ ప్రస్తుతం ప్రభాస్ కోసం స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ చేస్తున్నారు. అతి త్వరలో షూటింగ్‌ కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్న ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలు నటించబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్న నేపథ్యంలో రెండు పాత్రలకు జోడీగా ఇద్దరు హీరోయిన్స్‌ ఎంపిక జరుగుతుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఆ ఇద్దరు హీరోయిన్స్ ఎంపిక దాదాపు పూర్తి అయ్యిందని తెలుస్తోంది.

స్పిరిట్‌ సినిమాలో కియారా అద్వానీ, నయనతారలు నటించబోతున్నారు. గతంలో ప్రభాస్‌తో నయనతార నటించింది. యోగి సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. చాలా కాలం తర్వాత మళ్లీ వీరి కాంబో మూవీ రాబోతుంది. కియారా అద్వానీతో ప్రభాస్ మొదటి సారి నటించబోతున్నాడు. తెలుగు లో కియారా అద్వానీ భరత్‌ అనే నేను, వినయ విధేయ రామ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం రామ్‌ చరణ్‌కి జోడీగా గేమ్‌ ఛేంజర్‌లో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. తెలుగు, హిందీ భాషలతో పాటు అన్ని భాషల్లోనూ కియారా అద్వానీకి గుర్తింపు ఉంది. అందుకే ఈ సినిమాకు ఆమెను ఎంపిక చేశారని తెలుస్తోంది.

ప్రభాస్‌తో సందీప్ వంగ తీయబోతున్న సినిమా కోసం ఫ్యాన్స్‌ మాత్రమే కాకుండా ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యానిమల్‌ సినిమా దాదాపుగా రూ.1000 కోట్ల వసూళ్లు సొంతం చేసుకుంది. కనుక సందీప్ తదుపరి సినిమాపై హిందీ ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రభాస్ సలార్‌, కల్కి సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో భారీ విజయాలను సొంతం చేసుకున్నాడు. కనుక రాజాసాబ్‌, ఫౌజీ, స్పిరిట్‌ సినిమాలు మరో మూడు భారీ విజయాలను ప్రభాస్‌కి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.