ఫెయిల్యూర్ మీట్ ఎఫెక్ట్.. 'లవ్ రెడ్డి'కి ప్రభాస్ సపోర్ట్!
సాధారణంగా సినిమా విజయం సాధించినప్పుడు మేకర్స్ సక్సెస్ మీట్‍లు నిర్వహిస్తుంటారు.
By: Tupaki Desk | 20 Oct 2024 10:25 AM GMTసాధారణంగా సినిమా విజయం సాధించినప్పుడు మేకర్స్ సక్సెస్ మీట్‍లు నిర్వహిస్తుంటారు. నిజంగా సినిమా విజయం సాధించకపోయినా, పెద్ద హిట్టయిందంటూ గొప్పలు చెప్పుకుంటూ సక్సెస్ సెలబ్రేషన్స్ చేయడం కూడా మనం చూస్తుంటాం. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఒక సినిమాకి 'ఫెయిల్యూర్ మీట్' నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ చిత్రమే ''లవ్ రెడ్డి''. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్ లో 'ఫెయిల్యూర్ మీట్' పెట్టడానికి గల కారణాలను చిత్ర బృందం వివరించింది.
ఈ మధ్య కాలంలో టైటిల్ తోనే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిన సినిమా ‘లవ్ రెడ్డి’. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా.. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా కొత్త దర్శకుడు స్మరణ్ రెడ్డి తెరకెక్కించిన సినిమా ఇది. 'ప్రేమకు కులం కూడా ఉందా ?' అంటూ సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ ను షేర్ చేయడంతో జనాల దృష్టిలో పడింది. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ లో అక్టోబర్ 18న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. కానీ అనుకున్న స్థాయిలో ఓపెనింగ్ రాలేదు. ఈ నేపథ్యంలో 'బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యూర్ మీట్' అంటూ మేకర్స్ ఈవెంట్ ను నిర్వహించారు. సినిమాని తాము జనాల దగ్గరకు తీసుకువెళ్లే విషయంలో ఫెయిల్ అయ్యామని, ఈ విధంగానైనా జనాల్లోకి తీసుకెళ్లాలనేదే తమ ఉద్దేశ్యమని తెలిపారు.
ఈ సందర్భంగా దర్శకుడు స్మరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘లవ్ రెడ్డి’ సినిమాకి ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. బ్లాక్ బస్టర్ బొమ్మ చూశామని అంటున్నారు. అదే సమయంలో ఈ సినిమాని జనాలకు రీచ్ అయ్యేలా చేయడంలో మేం ఫెయిల్ అయ్యాం. అందుకే ఫెయిల్యూర్ మీట్ పెట్టాం అని అన్నారు. అంజన్ రామచంద్ర మాట్లాడుతూ.. ''ఈ సినిమాకి ఆడియన్స్ నుంచే కాకుండా మీడియా నుంచి కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ప్రతి మూవీలో చిన్న చిన్న తప్పులు ఉంటాయి. కొత్తవాళ్లతో ఇంతమంచి సినిమా తీస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. ఈ మధ్యకాలంలో కొత్తవాళ్ల్లు చేసిన బెస్ట్ డెబ్యూ అని మీడియా సైడ్ నుంచి ప్రశంసలు వస్తున్నాయి. కొందరు తమ లైఫ్ లో జరిగిన లవ్ ఫెయిల్యూర్స్ గురించి చెబుతున్నారు'' అని చెప్పారు.
''సినిమా చూసిన వాళ్ళ దగ్గర ‘లవ్ రెడ్డి’ గెలిచాడు. కానీ ఎవరైతే చూడలేదో వాళ్ళ ప్రేమను పొందలేకపోయాం. వాళ్లకు ఈ సినిమాని రీచ్ చెయ్యాలనే ప్రయత్నమే ఈ ఫెయిల్యూర్ మీట్. లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్లంతా ఈ ఫెయిల్యూర్ మీట్ తర్వాత సినిమా చూడండి'' అని అంజన్ రామచంద్ర అన్నారు. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ మంచి సినిమాను ఆదరించడంలో ఫెయిల్ కాలేదు. వాళ్లను ఫెయిల్ చేయకూడదనే ఈ ఫెయిల్యూర్ మీట్ పెట్టాం. మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ నుంచి మా మూవీకి పూర్తి సపోర్ట్ దొరికింది. మంచి థియేటర్స్ దొరికాయి. ప్రమోషన్స్ పరంగా మేము ప్రేక్షకులకు అనుకున్న స్థాయిలో రీచ్ కాలేకపోయాం అని తెలిపారు. 'లవ్ రెడ్డి'ని ఎలాగైనా నిలబెట్టాలని నా ఫ్రెండ్ హీరో కిరణ్ అబ్బవరం ముందుకొచ్చి హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, విజయవాడలో ఫ్రీ షోస్ అరేంజ్ చేశాడు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ ఫ్రీ షోలకు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది అని చెప్పారు.
ప్రేక్షకుల వద్దకు ఈ సినిమాను ఎలాగైనా తీసుకెళ్లాలనే కారణంతోనే ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నామని నిర్మాత మదన్ గోపాల్ రెడ్డి చెప్పారు. ఫెయిల్యూర్ మీట్ పెట్టడానికి నాకు భయం లేదు. డబ్బులు పోతే నేను పదేళ్లయినా సంపాదించుకుంటా. నేను గెలిచే బయటికి వెళ్లాలని ఈ మీట్ పెట్టా. ఆడియన్స్ కు సినిమా రీచ్ అవ్వాలంటే నేను ఏదో ఒకటి చేసి వెళ్లాలి. మూడేళ్లు ఈ సినిమా కోసం నేను కష్టపడ్డాను. ఈ సినిమా కోసం హీరోహీరోయిన్ అందరూ చాలా కష్టపడ్డారు. మా హీరో హీరోయిన్, డైరెక్టర్ గెలిచారు. అందుకు హ్యాపీగా ఉంది. లవ్ రెడ్డి కూడా గెలవాలి. అందుకే ఈ మీట్ పెట్టాను. ఆ ఫెయిల్యూర్‌ను కూడా ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్తాను అని నిర్మాత అన్నారు. ఫ్రీ షో చూసిన వాళ్లు కూడా కొందరు తనకు డబ్బులు ఫోన్‍పే చేశారని తెలిపారు. ఓటీటీలో ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుందని, కానీ థియేటర్ లో బ్లాక్ బస్టర్ అయితేనే ప్రొడ్యూసర్ కు డబ్బులు వస్తాయని అన్నారు. ఈ వీకెండ్ లోపు సినిమా బాగా పికప్ అవుతుందనే గట్టి నమ్మకంతో టీమ్ అంతా ఉన్నామని తెలిపారు.
ఇదిలా ఉంటే ''లవ్ రెడ్డి'' సినిమాకి రెబల్ స్టార్ ప్రభాస్ సపోర్ట్ లభించింది. 'ఈ మూవీ గురించి మంచి విషయాలు వింటున్నా. టీం మొత్తానికి శుభాకాంక్షలు' అంటూ డార్లింగ్ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో పేర్కొన్నారు. సినిమా ట్రైలర్ ను కూడా షేర్ చేసారు. ఫెయిల్యూర్ మీట్ పెట్టిన తర్వాత ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సపోర్ట్ దొరకడంతో, రాబోయే రోజుల్లో ఈ సినిమా మరింత పుంజుకుంటుందని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని గీతాన్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.