ప్రభాస్.. కంటెంట్ ఉన్న దర్శకుడితోనే మరోసారి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడు. అతని మార్కెట్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ మార్కెట్లలోనూ విస్తరించింది.
By: Tupaki Desk | 14 March 2025 5:00 PM ISTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత కీలక దశలో ఉన్నాడు. అతని మార్కెట్ ప్రస్తుతం టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్, మోలీవుడ్ మార్కెట్లలోనూ విస్తరించింది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ సినిమాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ‘సాహో’, ‘రాధేశ్యామ్’ లాంటి సినిమాలు మిశ్రమ ఫలితాలు అందుకున్నప్పటికీ సలార్ - కల్కి 2తో మళ్ళీ తన మాస్ స్టామినా నిరూపించుకున్నాడు. ఇక నెక్స్ట్ రాజాసాబ్, హనూ ఫౌజి, స్పిరిట్, సలార్ 2, కల్కి 2 వంటి భారీ సినిమాలతో ప్రభాస్ ఫ్యూచర్ లైనప్ ను బలంగా ప్లాన్ చేసుకున్నాడు.
ప్రభాస్ లైనప్ చూస్తే ప్రతి సినిమా మినిమమ్ 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. నెక్స్ట్ మారుతి దర్శకత్వంలో ‘రాజాసాబ్’ కూడా సరికొత్త మాస్ హారర్ ఎంటర్టైనర్‌గా రాబోతోంది. అలాగే ప్రభాస్ కెరీర్‌లో అత్యంత పవర్‌ఫుల్ ప్రాజెక్టుగా ‘స్పిరిట్’ ముద్ర వేయనుంది. ఈ చిత్రాన్ని దర్శకుడు సందీప్ తెరకెక్కించనున్నాడు. మరోవైపు సలార్ 2 - కల్కి 2 సినిమాలు ప్రభాస్ స్టార్‌డమ్‌ను మరింత పెంచేలా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ క్రేజీ లైనప్ మధ్యనే హను రాఘవపూడితో ప్రభాస్ చేస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’ ప్రత్యేకంగా నిలిచింది. 1940ల నాటి బ్యాక్‌డ్రాప్‌లో సుభాష్ చంద్రబోస్ పాయింట్ కు కనెక్షన్ ఉండే యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను హను రాఘవపూడి డిజైన్ చేశాడు. ‘సీతా రామం’ లాంటి క్లాసిక్ హిట్ తర్వాత హనూ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉంది.
ఇప్పటికే హనూ దర్శకత్వం వహించిన ‘ఫౌజీ’పై మంచి అంచనాలున్నాయి. తాజాగా మరోసారి ప్రభాస్-హనూ కాంబినేషన్‌లో ఇంకో మూవీ ప్లాన్ అయినట్లు టాక్ నడుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ ప్రాజెక్ట్‌కి ముందస్తుగా అడ్వాన్స్ చెల్లించిందట. అయితే ఇది ‘ఫౌజీ’ పూర్తయ్యాకనే స్టార్ట్ అవుతుందా లేదా ఇంకాస్త టైమ్ తీసుకుంటుందా అన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే ప్రభాస్ బిజీ లైనప్ కారణంగా ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. అడ్వాన్స్ అయితే ఇచ్చేశారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ ప్రాజెక్ట్‌ల షూటింగ్‌లో పాల్గొననున్నాడు. ‘స్పిరిట్’ జూన్‌లో స్టార్ట్ కానుంది. దీంతో పాటు ‘సలార్ 2’, ‘కల్కి 2’ షూటింగ్స్ కూడా లైన్‌లో ఉన్నాయి. అందువల్ల హనూ రెండో ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందనేది పూర్తి వివరాలు రావాల్సి ఉంది. కచ్చితంగా మరో రెండేళ్ల తరువాతే ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉండవచ్చు.