ప్రభాస్-హను.. యుద్ధభూమిలో ఓ వీరుడు
ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమా 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్‌పై భారీ స్థాయిలో ప్రారంభమైంది.
By: Tupaki Desk | 17 Aug 2024 11:21 AM GMTప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కబోయే కొత్త సినిమా 'మైత్రీ మూవీ మేకర్స్' బ్యానర్‌పై భారీ స్థాయిలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక లాంచ్ వేడుక నేడు గ్రాండ్‌గా జరిగింది. ఈ సినిమా ప్రారంభంతోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించేలా చిత్ర యూనిట్ ఒక కాన్సెప్ట్ పోస్టర్‌ని విడుదల చేసింది.
ఈ కాన్సెప్ట్ పోస్టర్ ఒక రకమైన ఉత్కంఠను రేకెత్తించేలా ఉంది. దీనిలో బ్రిటిష్ పార్లమెంట్ భవనం పై ఉన్న బ్రిటిష్ జెండా కాలుతున్న దృశ్యం కనిపిస్తోంది. యుద్ధం నేపథ్యం, ఆ సమయంలో ఉన్న పరిస్థితులు హైలెట్ అవుతున్నాయి. పోస్టర్ లో యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు కూడా హైలెట్ కావడంతో, యాక్షన్ డోస్ కూడా గట్టిగానే ఉండనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ పోస్టర్ ద్వారా హను రాఘవపూడి సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచారు.
ఈ కథలో ప్రభాస్ ఓ వీరుని పాత్రను పోషిస్తుండగా, యుద్ధభూమిలో అన్యాయాలను ఎదుర్కొని, న్యాయం కోసం యుద్ధం చేసే కథనంతో సినిమా సాగుతుందట. ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్న సమయంలో ఒక యోధుడు పోరాటానికి సరికొత్త అర్థం చెప్పాడు. ఇది 1940ల కాలంలో జరిగే ఫిక్షనల్ స్టోరీ.. అని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా పూర్తిగా పీరియడ్ డ్రామా నేపథ్యంలో ఉండగా, ప్రభాస్ ఈ సినిమాలో కొత్త అవతారంలో కనిపిస్తారట.
పాన్ ఇండియా స్థాయిలో రూపొందబోతున్న ఈ ప్రాజెక్టును భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కిస్తోంది. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన ఇమాన్‌వి ప్రధాన పాత్రలో కనిపించనుంది. అలాగే, బాలీవుడ్ సీనియర్ నటులు మిథున్ చక్రవర్తి, జయప్రద ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించనున్నారు. ఇప్పటికే లాంచ్ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, ప్రాజెక్టు పట్ల ఉన్న అంచనాలను మరింత పెంచాయి.
ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మొత్తానికి, ప్రభాస్ మరియు హనురాఘవపూడి కాంబినేషన్ లో రాబోతున్న ఈ పాన్ ఇండియా సినిమా ఒక వినూత్న అనుభూతిని అందిస్తుందని, ప్రేక్షకులకు ఒక రకమైన సరికొత్త అనుభూతిని పంచుతుందని చిత్ర బృందం భావిస్తోంది.