నార్త్ లో ప్రభాస్ ప్రభంజనం!
ముఖ్యంగా ఇది నార్త్ సర్క్యూట్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
By: Tupaki Desk | 25 Jun 2024 3:54 PM GMTఇప్పుడు ఎక్కడ చూసినా 'కల్కి' ఫీవర్ కనిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఈ ఫాంటసీ మూవీ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. దాదాపు ఐదు నెలల తర్వాత థియేటర్లలోకి వస్తోన్న పెద్ద సినిమా కావడంతో, ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని సినీ ప్రియులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఆన్ లైన్ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ చూస్తే, ఈ మూవీ కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారనే విషయం అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఇది నార్త్ సర్క్యూట్స్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి.
'బాహుబలి' సినిమా సంచలన విజయం సాధించిన తర్వాత ప్రభాస్ కు నార్త్ లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అప్పటి నుంచి డార్లింగ్ నటించిన చిత్రాలు హిందీ బెల్ట్ లో టాక్ తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. ఇప్పుడు 'కల్కి 2898 AD' సినిమాపై మొదటి నుంచీ ఉత్తరాది ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తూ వస్తున్నారు. ప్రభాస్ తో పాటుగా ఈసారి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకునే, దిశా పటానీ లాంటి బాలీవుడ్ స్టార్స్ యాడ్ అవ్వడం మరింత ప్లస్ అయింది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ ని బట్టి చూస్తే, కల్కి మూవీ 2024లో హిందీలో అతిపెద్ద ఓపెనర్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
'కల్కి 2898 AD' సినిమాకి నార్త్ ఇండియాలో ఇప్పటికే 45 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. అంటే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఈ చిత్రం పాతిక కోట్లు వసూలు చెయ్యొచ్చు. ఓవరాల్ గా మొదటి రోజు కలెక్షన్లు రూ. 30 కోట్లకి పైగానే ఉంటాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మిడ్ వీక్ రిలీజ్, టీ20 వరల్డ్ కప్ సెమీస్ లను పరిగణనలోకి తీసుకుని చూస్తే.. ప్రభాస్ సినిమాకి ఇది అధ్బుతమైన ఓపెనింగ్ అనే చెప్పాలి. దీనికి పాజిటివ్ టాక్ వచ్చి, రివ్యూలు సానుకూలంగా ఉంటే మాత్రం.. బాలీవుడ్ లో కల్కి ప్రభంజనం సృష్టించడం ఖాయం.
బాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి అగ్ర హీరోల సినిమాల ఓపెనింగ్స్ 15 కోట్లు దాటడం కష్టమైపోయింది. గతేడాది షారుఖ్ ఖాన్ నటించిన 'పఠాన్' 'జవాన్' చిత్రాలు మాత్రమే ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. 2024లో హృతిక్ రోషన్ నటించిన 'ఫైటర్' మూవీ ₹22.5 కోట్లు రాబట్టి ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. 'కల్కి' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఆ నంబర్ ను క్రాస్ చేసి, బాలీవుడ్‌లో అతి పెద్ద ఓపెనర్ గా మారే ఛాన్స్ ఉంది.
హిందీలో అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సౌత్ హీరోల సినిమాలను తీసుకుంటే, ₹ 53.95 కోట్లతో 'కేజీఎఫ్ చాప్టర్ 2' అగ్ర స్థానంలో నిలిచింది. ప్రభాస్ నటించిన 'బాహుబలి - 2' (₹ 41 కోట్లు), 'ఆదిపురుష్' (₹ 36 కోట్లు), 'సాహో' (₹ 24.40 కోట్లు) చిత్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీటితో పాటుగా 2.0 (20.25 కోట్లు), RRR (20 కోట్లు), సలార్ (15.75 కోట్లు), కబాలి (5.21 కోట్లు), బాహుబలి (5.15 కోట్లు), రాధేశ్యామ్ (4.44 కోట్లు) వంటి దక్షిణాది చిత్రాలు టాప్-10 లో ఉన్నాయి. ఇప్పుడు 'కల్కి 2898 AD' సినిమా టాప్-5 ఓపెనర్స్ లో చోటు సంపాదించబోతోంది. అది 'బాహుబలి 2' దగ్గర వరకూ వెళ్తుందా?, 'ఆదిపురుష్' ను అధిగమిస్తుందా? అనేది మరో రెండు రోజుల్లో తేలిపోతుంది.
ఏదేమైనా టాలీవుడ్ స్టార్ ప్రభాస్ నటించిన 7 సినిమాలు హిందీలో బిగ్ ఓపెనింగ్స్ రాబట్టిన దక్షిణాది చిత్రాల లిస్టులో ఉన్నాయంటే, నార్త్ లో అతని క్రేజ్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. జూన్ 27న విడుదల కాబోతున్న 'కల్కి 2898 AD' చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రెబల్ స్టార్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.