ప్రభాస్ (X) విక్కీ! ధూమ్ 4 ఆఫర్ ఎవరికి?
అయితే ఈ కథనాల్లో నిజం ఎంత? అన్నది అటుంచితే, ఇప్పుడు ప్రభాస్ కోసం ఆఫర్ చేసిన పాత్రలో విక్కీ కౌశల్ ని నటింపజేసే ఆలోచనతో యష్ రాజ్ బ్యానర్ ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 24 Sep 2023 2:45 AM GMTప్రతిష్ఠాత్మక యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ధూమ్ ఫ్రాంఛైజీ సినిమాలు ఎలాంటి సంచలనాలు సృష్టించాయో తెలిసిందే. ఈ సిరీస్ లో వరుసగా మూడు సినిమాలు విడుదలై అఖండ విజయాలు సాధించాయి. జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ .. వరుసగా మూడు భాగాల్లో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రల్లో నటించారు. ఆ ముగ్గురి నటనకు గొప్ప పేరొచ్చింది. భారతదేశంలో ధూమ్ సిరీస్ అసాధారణ వసూళ్లను సాధించింది. ఇక ఈ సిరీస్ కి ట్యాలెంటెడ్ విజయ్ కృష్ణ ఆచార్య దర్శకరచయిత.
అతడు తదుపరి ధూమ్ 4 కోసం సన్నాహకాల్లో ఉన్నాడని చాలా కాలంగా వార్తలొస్తున్నాయి. కానీ రకరకాల కారణాలతో ఈ నాలుగో భాగం సెట్స్ పైకి వెళ్లడం అంతకంతకు ఆలస్యమవుతోంది. ముఖ్యంగా ఈసారి నాలుగో భాగంలో దక్షిణాదికి చెందిన ఒక అగ్ర హీరోని కీలక పాత్రకు ఎంపిక చేయాలని యష్ రాజ్ ఫిలింస్ భావిస్తోంది. నాలుగో భాగంలో కింగ్ ఖాన్ షారూఖ్ ని నటింపజేయాలని కూడా యష్ రాజ్ ఫలింస్ భావించింది. కానీ షారూఖ్ అందుకు సిద్ధంగా లేడని కూడా టాక్ వినిపించింది. ఇంతలోనే నేటితరం యంగ్ స్టర్స్ తో ధూమ్ 4ని తెరకెక్కించే యోచనలో యష్ రాజ్ బ్యానర్ ఉందని కూడా టాక్ వినిపించింది. అదే క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ని నెగెటివ్ షేడ్ ఉన్న కీలక పాత్రకు ఎంపిక చేసే ఆలోచనతో యష్ రాజ్ ఫిలింస్ ఉందని, బాహుబలి స్టార్ గా ప్రభాస్ క్రేజ్ తో దక్షిణాది మార్కెట్లను కొల్లగొట్టే ఆలోచనలో నిర్మాత ఆదిత్య చోప్రా ఉన్నారని కూడా టాక్ వినిపించింది. అంతేకాదు ధూమ్ 4లో నటించేందుకు ప్రభాస్ కి ఏకంగా 100 కోట్ల పారితోషికాన్ని యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ ఆఫర్ చేసిందని కూడా కథనాలొచ్చాయి.
అయితే ఈ కథనాల్లో నిజం ఎంత? అన్నది అటుంచితే, ఇప్పుడు ప్రభాస్ కోసం ఆఫర్ చేసిన పాత్రలో విక్కీ కౌశల్ ని నటింపజేసే ఆలోచనతో యష్ రాజ్ బ్యానర్ ఉందని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ మాట్లాడుతూ.. తాను విజయ్ కృష్ణ ఆచార్య తనకు కథ వినిపించినప్పుడు ధూమ్ 4లో ఆఫర్ ఇస్తున్నాడని భావించానని అన్నాడు. అంతేకాదు.. ధూమ్ 4లో అవకాశం ఇస్తే తాన నటించేందుకు సిద్ధంగా ఉన్నానని కూడా ఆసక్తిని వ్యక్తం చేసాడు. అయితే అప్పటికి విక్కీకి ఆఫర్ చేసినది ధూమ్ 4 కాదు. అది ఒక ఫ్యామిలీ స్టోరి. విక్కీ కౌశల్ కి విజయ్ కృష్ణ ఆచార్య 'ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ' కథను వినిపించి ఓకే చేయించుకున్నాడు. ఈ సినిమా ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రాన్ని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. తాజా ఇంటర్వ్యూలో విక్కీ తనను యష్ రాజ్ బ్యానర్ సంప్రదించి ఈ చిత్రానికి ఆచార్య తెరకెక్కిస్తున్నారని చెప్పినప్పుడు అది 'ధూమ్ 4' అని వెంటనే అనుకున్నాను. అయితే స్క్రిప్ట్ వినగానే ఇది యాక్షన్ సినిమా కాదని, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అర్థమైంది. కథ ముగిసే సమయానికి ఈ మూవీలోని లీడ్ పాత్రలో లీనమైపోయానని విక్కీ తెలిపాడు. ధూమ్ 4లో భాగం కావాలనే ఆలోచన మీరు ఇంకా ఉందా? అని ప్రశ్నించగా.. అలాంటిది నిజంగా జరిగితే చాలా బాగుంటుందని విక్కీ చెప్పాడు. అయితే యష్ రాజ్ బ్యానర్ ఇంకా ప్రభాస్ ని నటింపజేయాలని భావిస్తోందా? లేక విక్కీ కౌశల్ లాంటి నేటి జనరేషన్ హిందీ స్టార్లతో ముందుకు సాగుతుందా? అన్నది వేచి చూడాలి. ఒకవేళ ధూమ్ 4లో ఆఫర్ వస్తే ప్రభాస్ కాదనేందుకు ఛాన్సుందా? అన్నది కూడా ఆలోచించాలి.
తదుపరి విక్కీ కౌశల్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. మేఘనా గుల్జార్ సామ్ బహదూర్ లో కూడా విక్కీ కనిపించనున్నాడు. ఇందులో అతను ఫీల్డ్ మార్షల్ సామ్ మానేక్షా పాత్రలో కనిపిస్తాడు. మరోవైపు ప్రభాస్ వరుసగా సలార్ - కల్కి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇవి రెండూ భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రిలీజ్ బరిలోకి రానున్నాయి.