Begin typing your search above and press return to search.

ప్రభాస్ స్టార్‌డమ్‌కు ఇదే నిదర్శనం!

అయినా సరే డార్లింగ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు, ఆయన స్టార్‌డమ్‌ కు అగ్ని పరీక్ష అంటూ ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉంటారు.

By:  Tupaki Desk   |   29 July 2024 2:30 PM GMT
ప్రభాస్ స్టార్‌డమ్‌కు ఇదే నిదర్శనం!
X

ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న పాన్ ఇండియన్ స్టార్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ప్రభాస్ మాత్రమే. టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు.. ఫ్లాప్ సినిమాతోనూ భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. బాక్సాఫీస్ వద్ద రెండుసార్లు 1000 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఏకైక సౌత్ హీరోగా, రెండో ఇండియన్ యాక్టర్ గా రికార్డ్ క్రియేట్ చేసారు. అయినా సరే డార్లింగ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు, ఆయన స్టార్‌డమ్‌ కు అగ్ని పరీక్ష అంటూ ఓ వర్గం నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉంటారు.

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించిన ప్రభాస్.. 'బాహుబలి 2' తో ₹1810 కోట్లు రాబట్టి, భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన హీరోగా చరిత్ర సృష్టించారు. అయితే ఈ సక్సెస్ లో మేజర్ క్రెడిట్ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళికి దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ప్రాజెక్ట్ కోసం ఐదేళ్ల పాటు కష్టపడిన ప్రభాస్ ను ఇక్కడ తక్కువ చేయలేం. అయినా కూడా నేటికీ ఈ సినిమా క్రెడిట్ అంతా రాజమౌళిదే అనే మాట వినిపిస్తూనే ఉంటుంది.

బాహుబలి తర్వాత సుజీత్ డైరెక్షన్ లో 'సాహో' సినిమా చేశారు ప్రభాస్. సుమారు ₹350 కోట్లు బడ్జెట్ పెట్టి తీసిన ఈ చిత్రం, జపాన్ వసూళ్లను కలుపుకొని ₹470 కోట్లు కలెక్ట్ చేసింది. 2019లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సౌత్ చిత్రంగా నిలిచింది. తెలుగు కంటే హిందీ వెర్షన్ ఎక్కువ వసూళ్లు సాధించి కమర్షియల్ హిట్ గా నిలిచింది. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న దర్శకుడితో ఈ రేంజ్ కలెక్షన్లు వచ్చాయంటే అది ప్రభాస్ స్టార్‌ డమ్‌ వల్లనే సాధ్యమైందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ప్రభాస్ సాహో తర్వాత రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' సినిమాలో నటించారు. ఇది కూడా ఒక్క మూవీ అనుభవం ఉన్న దర్శకుడితో చేసిన చిత్రమే. దీనికి ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. అయినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ₹200–350 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా.. ₹250–300 కోట్ల వరకూ వసూలు చేసినట్లుగా ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది ఆయన గత చిత్రాలో పెర్ఫామ్ చేయకపోయినా, ఈ సినిమాకి వచ్చిన టాక్ కు ఆమాత్రం కలెక్షన్లు వచ్చాయంటే దానికి ప్రభాసే కారణం. అందులోనూ ఇది మాస్ సినిమా కాదు.. క్లాస్ మూవీ.

ఆ తర్వాత ప్రభాస్ నుంచి 'ఆదిపురుష్' సినిమా వచ్చింది. రామాయణం ఆధారంగా హిందీ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించారు. ఇది తొలి ఆట నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. అలాంటి పరిస్థితుల్లోనూ ₹440 కోట్ల వరకూ రాబట్టగలిగింది అంటే దానికి డార్లింగ్ స్టార్ డమ్ ఒక్కటే మెయిన్ రీజన్. ఇదే క్రమంలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 1' సినిమాలో నటించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ₹720 కోట్లు కలెక్ట్ చేసి, 2023లో అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు సినిమాగా నిలిచింది. అయితే కొంతమంది ఈ క్రెడిట్ ను హీరో అకౌంట్ లో కాకుండా దర్శకుడి ఖాతాలో వేశారు.

చివరగా 'కల్కి 2898 AD' మూవీతో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సైన్స్ ఫిక్షన్ సినిమా.. ఇప్పటి వరకూ 1100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి, ఎన్నో రికార్డులు తిరగరాసింది. దీన్ని కూడా దర్శకుడి ఖాతాతో వేయడానికి నాగి ఇంతకముందు రెండు విజయాలు అందుకున్నారు కానీ, అవేమీ వందల కోట్లు కొల్లగొట్టిన చిత్రాలేమీ కాదు. ఇక్కడ డైరక్టర్ ను తక్కువ చేయడం లేదు కానీ.. కంటెంట్ కు ప్రభాస్ స్టార్ డమ్ తోడైంది కనుకే ఆ రేంజ్ ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్టయిందని అనడంలో అతిశయోక్తి లేదు.

ప్రభాస్ ఇప్పుడు మారుతి దర్శకత్వంలో 'ది రాజాసాబ్' సినిమా చేస్తున్నారు. ఈ మూవీతో బాక్సాఫీసు రికార్డులు బ్రేక్ చేస్తేనే ప్రభాస్ స్టార్ డమ్ ఏంటనేది ప్రూవ్ అవుతుందని కొందరు మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ మధ్య కాలంలో డార్లింగ్ నుంచి వస్తున్న వాటిల్లో ఇది లో బడ్జెట్ మూవీ. మరోవైపు మారుతికి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం లేదు. అయినా ఈ చిత్రానికి భారీ క్రేజ్ ఏర్పడటానికి, మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయంటే దానికి కారణం ప్రభాసే.

ఏదేమైనా సినిమా హిట్టయితే దర్శకుడి క్రెడిట్ ఇవ్వడం.. తక్కువ కలెక్షన్లు వస్తే హీరో స్టార్‌డమ్‌ను సంకించడం సరికాదు. ప్రభాస్ ఆల్రెడీ తన బాక్సాఫీస్ స్టామినా ఏంటో అనేకసార్లు చూపించారు. రాజమౌళి లేకుండానే బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి చూపించారు. కాబట్టి ఇప్పుడు కొత్తగా ప్రభాస్ తన స్టార్‌ డమ్‌ను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని డార్లింగ్ ఫ్యాన్స్ అంటున్నారు. 'ది రాజాసాబ్' సినిమాతో మరో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ను కొనసాగిస్తారని నమ్ముతున్నారు.