Begin typing your search above and press return to search.

దేవుళ్ల‌ను నిషేధించిన ప్ర‌పంచాన్ని చూస్తారు: నాగ్ అశ్విన్

రానా హోస్టింగ్ చేయ‌గా చిత్రంలోని కీల‌క న‌టులు చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

By:  Tupaki Desk   |   20 Jun 2024 5:46 AM GMT
దేవుళ్ల‌ను నిషేధించిన ప్ర‌పంచాన్ని చూస్తారు: నాగ్ అశ్విన్
X

నాగ్ అశ్విన్ తెర‌కెక్కించిన భారీ ప్ర‌యోగాత్మ‌క సైన్స్ ఫిక్ష‌న్ చిత్రం - క‌ల్కి 2898 ఏడి. ప్ర‌భాస్, అమితాబ్, క‌మ‌ల్ హాస‌న్, దీపిక ప‌దుకొనే, దిశా ప‌టానీ త‌దిత‌రులు న‌టించారు. ఈ సినిమా ప్ర‌చారం కోసం ముంబైకి వెళ్లింది చిత్ర‌బృందం. రానా హోస్టింగ్ చేయ‌గా చిత్రంలోని కీల‌క న‌టులు చాలా ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

మ‌రోవైపు చిత్ర ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ 'ది వ‌ర‌ల్డ్ ఆఫ్ క‌ల్కి' పేరుతో వ‌రుస ఎపిసోడ్ ల‌ను సోష‌ల్ మీడియాలో రిలీజ్ చేస్తూ సినిమాపై అంత‌కంత‌కు ఉత్కంఠ‌ను పెంచేస్తున్నారు. ఇంత‌కుముందు విడుద‌లైన ఎపిసోడ్ 1తో క‌ల్కి చిత్రంపై చాలా వ‌ర‌కూ అభిమానుల‌కు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు క‌ల్కి ఎపిసోడ్ 2లో ఇంకా బ‌య‌టి ప్ర‌పంచానికి తెలియ‌ని చాలా విష‌యాల‌ను నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు.

భ‌విష్య‌త్ ప్ర‌పంచం ఎలా మారుతుందో క‌ల్కి చిత్రం ద్వారా వెండి తెర‌పై చూపిస్తున్నాన‌ని నాగ్ అశ్విన్ అన్నారు. ఇప్ప‌టి కాశీ న‌గ‌రం వేల సంవ‌త్స‌రాల త‌ర్వాత ఎలా మారిందో అధునాత‌నంగా ఎలా ఉంటుందో కూడా తెర‌పై ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. అప్ప‌టి ప్ర‌జ‌ల నాగ‌రిక‌త‌, ఉప‌యోగించే వాహ‌నాలు, తినే తిండి బ‌ట్ట‌ ఇలా ప్ర‌తిదీ విభిన్నంగా తెర‌పై క‌నిపిస్తాయ‌ని తెలిపారు. అంతేకాదు.. దేవుళ్ల‌ను బ్యాన్ చేసిన అరుదైన‌ ప్ర‌పంచాన్ని చూపించామ‌ని నాగ్ అశ్విన్ అన్నారు. ఇక ఈ విజువ‌ల్స్ లో కాశీ అధునాత‌న సంస్కృతి న‌గ‌రాన్ని ఆవిష్క‌రించిన తీరు విస్మ‌య‌ప‌రుస్తోంది. ఈ న‌గ‌రం నిర్మించేందుకు చాలా శ్ర‌మించాల్సి వ‌చ్చిందని కూడా నాగ్ అశ్విన్ వెల్ల‌డించారు.

ద‌ర్శ‌కుడి వివ‌రాల‌ ప్రకారం.. కల్కి కథ మూడు ప్రపంచాల మధ్య నడుస్తుంది. అందులో ఒకటి కాశి. ప్రపంచంలో ఏర్పడిన తొలి నగరంగా పేరున్న కాశి.. చివరి నగరంగా మారే పరిస్థితి ఆలోచనతోనే ఈ కథ మొదలవుతుంది. అక్కడి ప్రజలు దుర్భర జీవనం అనుభవిస్తుంటారు. అదే సమయంలో పిరమిడ్ ఆకారంలో ఉండే ప్రదేశమే కాంప్లెక్స్. ఆకాశంలో కిలోమీటర్ల మేర ఉండే ఆ ప్రాంతంలో సకల సౌకర్యాలుంటాయి. కాశీ ప్రజలు కాంప్లెక్స్‌కు వెళ్లి అక్కడున్నవాటిని ఆస్వాధించాలనుకుంటారు. కానీ అక్కడికి వెళ్లడానికి మిలియన్ల కొద్దీ యూనిట్స్ ఉండాలి. జీవితాన్ని పణంగా పెట్టి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. మరోవైపు శంబాలా అనే మరో రహస్య ప్రపంచం కూడా ఉంటుంది. కల్కితో ఆ ప్రపంచానికి లింక్ ఉంటుంది. ఈ మూడు ప్రపంచాలు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతూ.. ఆ సంఘర్షణలో నడిచే కథే కల్కి... అని వెల్ల‌డించారు. భూమి మీద మొద‌టి న‌గ‌రం.. చివ‌రి న‌గ‌రం అనే ఐడియాతో ఈ కథ‌ను ప్రారంభించామ‌ని కూడా నాగ్ అశ్విన్ అన్నారు.

3000 సంవ‌త్స‌రాల త‌ర్వాత కాశీ న‌గ‌రం ఎలా ఉంటుందో ఊహించి డిజైన్ చేసామ‌ని, అప్పుటి ప్ర‌జ‌లకు డ‌బ్బులు ఏ రూపంలో ఉండేవో.. వాతావ‌ర‌ణం ఎలా ఉండేదో సెట్స్ లో ఆవిష్క‌రించామ‌ని తెలిపారు. ఇప్పుడు క‌రెన్సీ డిజిట‌ల్ లో ఉంది. భ‌విష్య‌త్ లో ఎలా ఉంటుందో కూడా చూపించాం. అలాగే ఇప్పుడు ఎల‌క్ట్రిక్ వెహిక‌ల్స్ వ‌చ్చాయి. కానీ భ‌విష్య‌త్ వెహిక‌ల్స్ ఎలా ఉంటాయో ఊహించి రాసాను.. అని తెలిపారు. అలాగే మూడు ప్ర‌పంచాల్లో ఒక్కొక్క‌దానికి ఒక్క‌క్క థాట్ ప్రాసెస్ ని అనుస‌రించి డిజైన్ చేసామ‌ని వెల్ల‌డించారు.

ఈ నెలాఖ‌రున విడుద‌ల‌కు రానున్న క‌ల్కి భార‌త‌దేశంలో మునుపెన్న‌డూ చూడ‌ని విజువ‌ల్ ఫీస్ట్ గా నిలుస్తుంద‌ని ఇప్ప‌టివ‌ర‌కూ విడుద‌లైన విజువ‌ల్స్ చెబుతున్నాయి. నాగ్ అశ్విన్ ఇచ్చిన డీటెయిలింగ్ తో ప్రేక్ష‌కుల‌కు చాలా ముందే అవ‌గాహ‌న ఏర్ప‌డుతుంది. సినిమా క‌థ ఏంటో అర్థం కాలేదు! అన‌కుండా ప్రేక్ష‌కుల‌ను ఇప్ప‌టి నుంచే నాగ్ అశ్విన్ ప్రిపేర్ చేస్తున్న తీరు ఆస‌క్తిని క‌లిగిస్తోంది.