MI 7 - ఓపెన్ హైమర్ తర్వాత ఆ ఘనత 'సలార్'కే!
ఆ రెండు సినిమాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ని టార్గెట్ చేసిన భారతీయ సినిమాగా సలార్ కి గుర్తింపు దక్కనుందని టాక్ వినిపిస్తోంది
By: Tupaki Desk | 18 Aug 2023 5:39 AM GMTఇటీవలి కాలంలో ఐమ్యాక్స్ లో విడుదలై సంచలనం సృష్టించిన సినిమాల్లో టామ్ క్రూజ్ నటించిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికనింగ్ (ఎంఐ7) ఇండియా నుంచి సుమారు 100 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాత నోలాన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ చిత్రం 100కోట్ల మార్క్ ను తాకడం ఆశ్చర్యం కలిగించింది. నాన్ ఫ్రాంఛైజీ కేటగిరీలో ఓపెన్ హైమర్ నిజమైన సంచలనంగా మారింది. భారతదేశం సహా ప్రపంచదేశాల్లో అన్ని ఐమ్యాక్స్ లలో ఈ సినిమాలు విడుదలై బంపర్ కలెక్షన్లను తెచ్చాయి.
ఆ రెండు సినిమాల తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఐమ్యాక్స్ ని టార్గెట్ చేసిన భారతీయ సినిమాగా సలార్ కి గుర్తింపు దక్కనుందని టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్ నుంచి చాలా సినిమాలు ఐమ్యాక్స్ ఫార్మాట్ లో విడుదలవుతున్నా భారతదేశం నుంచి పరిమితంగా మాత్రమే ఐమ్యాక్స్ రిలీజ్ కి వస్తున్నాయి. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 చిత్రాన్ని పాన్ వరల్డ్ కేటగిరీలో అత్యంత భారీగా విడుదల చేసేందుకు ప్రశాంత్ నీల్ - హోంబలే అధినేత కిరంగదూర్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది. సలార్ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్-ఇండియన్ చిత్రాలలో ఒకటి. ఇందులో యాక్షన్ కంటెంట్ దృష్ట్యా పాన్ వరల్డ్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టు టాక్ వినిపించింది.
అలాగే ఐమాక్స్ ఫార్మాట్‌లో ఈ చిత్రం విడుదల కానుందని అమెరికా డిస్ట్రిబ్యూటర్లు అధికారికంగా ధృవీకరించడంతో అభిమానుల్లో ఒకటే ఉత్కంఠ నెలకొంది. IMAX బుకింగ్‌లు త్వరలో ఓపెన్ కానున్నాయి. అయితే భారతదేశంలో IMAX విడుదలకు సంబంధించి టీమ్ ఇంకా ఎటువంటి నిర్దిష్ట ప్రకటనలు చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉందని గుసగుస వినిపిస్తోంది. నిజానికి రెగ్యులర్ స్క్రీన్లతో పోలిస్తే ఐమ్యాక్స్ లో విజువల్ అనుభూతి ఎంతో యూనిక్ గా ఉంటుంది. అందుకే ఐమ్యాక్స్ స్క్రీన్లలో వీక్షణ కోసం భారతదేశంలోను యువతరం పోటీపడుతున్నారనేది ఒక రిపోర్ట్.
ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటించింది. పృథ్వీరాజ్ సుకుమారన్, ఈశ్వరీ రావు, జగపతి బాబు ఇతర ముఖ్య పాత్రలలో నటించారు. కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ సౌండ్‌ట్రాక్ లు యూనివర్శల్ అప్పీల్ ని తేనున్నాయి. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం 28 సెప్టెంబర్ 2023న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే ప్రభాస్ అభిమానుల్లో బోలెడంత సందడి నెలకొంది.