అన్న అప్పును తీర్చడం తమ్ముడి బాధ్యత కాదు
అయితే వడ్డీతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో మొత్తం రూ.9.39 కోట్లకు అప్పు భారం పెరిగింది.
By: Tupaki Desk | 5 April 2025 3:00 AMతన అన్నయ్య రామ్‌కుమార్ చేసిన అప్పులకు తాను బాధ్యత వహించలేనని నటుడు ప్రభు చెన్నై హైకోర్టులో గట్టిగా వాదించాడు. ఈసన్ ప్రొడక్షన్స్ 'జగజాల కిల్లాడి' నష్టాల సమయంలో చేసిన అప్పునకు సంబంధించిన వివాదమిది. ఈ సినిమాలో నటులు విష్ణు విశాల్ - నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలు పోషించారు. శివాజీ గణేషన్ మనవడు, నటుడు దుష్యంత్, అతడి భార్య అభిరామి భాగస్వాములుగా ఉన్న ఆ కంపెనీ తనభాకీయం ఎంటర్‌ప్రైజెస్ నుండి రూ.3.74 కోట్లు అప్పుగా తీసుకుంది. అయితే వడ్డీతో పాటు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో మొత్తం రూ.9.39 కోట్లకు అప్పు భారం పెరిగింది.
దీంతో అప్పు ఇచ్చిన సంస్థ నిర్మాతల తాత అయిన శివాజీ గణేషన్ ఇంటిని స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. 'జగజాల కిల్లాడి' అన్ని హక్కులను రుణ పరిష్కారం కోసం తనభాకీయం ఎంటర్‌ప్రైజెస్‌కు బదిలీ చేయాలని మే 2024లో ఒక మధ్యవర్తి తీర్పు ఇచ్చాడు. ఈ ఆదేశం పాటించకపోవడంతో రుణదాత హైకోర్టును ఆశ్రయించి, రామ్‌కుమార్ తండ్రి, ప్రముఖ నటుడు శివాజీ గణేషన్‌కు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం వేయడానికి అనుమతి కోరాడు. ఆ తర్వాత కోర్టు శివాజీ గణేషన్ నివాసం అయిన అన్నై ఇల్లం జప్తుకు ఆమోదం తెలిపింది. దీనితో ప్రభు ఈ ఉత్తర్వుకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశారు. స్వాధీనం చేసుకున్న ఆస్తి చట్టబద్ధంగా రామ్‌కుమార్‌కు చెందదని, తనకు మాత్రమే చెందుతుందని ఆయన వాదించారు. నిర్ణయాన్ని రద్దు చేయాలని కోర్టును కోరారు.
కోర్టు రుణ పరిష్కార తీర్పును ప్రభు సవాలు చేయడంతో అది చర్చనీయాంశమైంది. జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్ నేతృత్వంలోని బెంచ్ ముందు, ఇటీవలి విచారణలో రూ.3 కోట్ల అప్పుకు సంబంధించి రూ.150 కోట్ల విలువైన ఆస్తులను స్తంభింపజేయడం అన్యాయమని ప్రభు న్యాయవాది వాదించారు. ప్రభు తన జీవితంలో ఎప్పుడూ డబ్బు అప్పు తీసుకోలేదని .. రామ్‌కుమార్ అప్పులకు సంబంధించిన బాధ్యతలలో ప్రభుకు ఎలాంటి ప్రమేయం లేదని డిఫెన్స్ నొక్కి చెప్పింది. అయితే రామ్‌కుమార్ సోదరుడిగా ప్రభు అప్పును ఎందుకు తీర్చలేకపోయారని, తర్వాత దాన్ని ఎందుకు తిరిగి పొందలేకపోయారని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ప్రతిస్పందనగా, ప్రభు న్యాయ బృందం ఆ ఆలోచనను తీవ్రంగా తిరస్కరించింది. రామ్‌కుమార్ పలు రకాల వనరులను తాకట్టుగా పెట్టి అప్పు తీసుకున్నాడని .. ప్రభును బాధ్యత వహించమని బలవంతం చేయడం కుదరదని న్యాయవాది వాదించారు.
ఈ కేసులో ఉన్న సంక్లిష్టతల దృష్ట్యా కోర్టు ఇప్పుడు విచారణను ఏప్రిల్ 8కి వాయిదా వేసింది. తమిళ సినిమా అత్యంత గౌరవనీయమైన కుటుంబ వారసత్వ సంపదలలో ఒకదానికి సంబంధించిన కేసు ఇది. ప్రభు 'అన్నై ఇల్లం' యాజమాన్యాన్ని కాపాడుకోవడానికి పోరాడుతున్నందున ఈ కేసు ఆసక్తికరంగా మారింది.