Begin typing your search above and press return to search.

ఇద్దరు దర్శకులతో యాంకర్ ప్రదీప్.. పవన్ టైటిల్!

ఇక 2021లో విడుదలైన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.

By:  Tupaki Desk   |   17 Oct 2024 5:53 AM GMT
ఇద్దరు దర్శకులతో యాంకర్ ప్రదీప్.. పవన్ టైటిల్!
X

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు సుపరిచితమైన యాంకర్ ప్రదీప్ మాచిరాజు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, తన చమత్కారపు మాటలు, చిలిపి వ్యవహారంతో ప్రతి ఇంటికీ చేరువయ్యాడు. యాంకరింగ్ ద్వారా పాపులర్ అయిన ప్రదీప్ పలు రియాలిటీ షోలు కూడా చేశాడు. సోషల్ మీడియాలో కూడా అతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక 2021లో విడుదలైన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.


ఈ సినిమా మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. ఆ తరువాత కూడా అతను మరో సినిమాతో వెంటనే రాబోతున్నట్లు అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. కానీ ప్రదీప్ ఎప్పుడు కూడా వాటిపై సరైన క్లారిటీ ఇవ్వలేదు. ఇక తాజాగా ప్రదీప్ మళ్ళీ యాంకరింగ్ కి విరామం ఇచ్చి, ఒక కొత్త ప్రేమకథతో సినిమాలపై దృష్టి పెట్టాడు. తాజాగా ప్రదీప్ మాచిరాజు కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది.

ఈ ప్రేమకథపై ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి 'అక్కడ అమ్మాయి-ఇక్కడ అబ్బాయి' అనే పేరును ఫిక్స్ చేయడం విశేషం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 1996లో హీరోగా పరిచయమైన సినిమా టైటిల్ కూడా ఇదే. దీంతో టైటిల్ తో ప్రదీప్ పవన్ అభిమానుల్లోనూ, ప్రేక్షకుల్లోనూ ఈ టైటిల్ మంచి ఆసక్తిని రేపుతోంది.

ఈ సినిమాలో దీపికా పిళ్ళై హీరోయిన్‌గా నటిస్తోంది. పోస్టర్‌లో ప్రదీప్, దీపికా ఇద్దరూ ప్రేమలో మునిగిపోయి ఉన్నట్లుగా కనిపించడమే కాకుండా, రొమాంటిక్ ఫీల్ ను బాగా హైలైట్ చేశారు. ఈ పోస్టర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీని పెంచేస్తోంది. మేకర్స్ ఈ ఫస్ట్ లుక్‌తో పాటు ఒక క్రియేటివ్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. మోషన్ పోస్టర్‌లో, సీతాకోకచిలుకలు వారి ప్రేమకథ ప్రపంచానికి చక్కగా మార్గనిర్దేశం చేస్తున్నట్లు చూపించారు.

రాధన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మోషన్ పోస్టర్‌కి మరో ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మోషన్ పోస్టర్‌కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది. ఇక సినిమాకు టెలివిజన్ డైరెక్టర్స్ అయిన నితిన్-భరత్ ద్వయం తొలిసారిగా దర్శకులుగా పరిచయం అవుతున్నారు. టెలివిజన్ లో మంచి అనుభవం ఉన్న ఈ ఇద్దరూ ఢీ లాంటి షోలు చేశారు. ఇక ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై కూడా అదే స్థాయి ప్రతిభను ప్రదర్శించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాను మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం, యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉండబోతుందని సినీ వర్గాల నుండి సమాచారం. ప్రదీప్, దీపికా కాంబినేషన్ ప్రేక్షకులకు ఎంతో ఆసక్తికరంగా మారబోతోందని పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేశారు. ఇక సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం, ఈ సినిమా విడుదల తేదీకి సంబంధించిన వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.