బాలకృష్ణ నా లక్కీఛార్మ్ అనేసిన ప్రగ్యాజైశ్వాల్!
తెలుగులో అమ్మడి క్రేజ్ పెరగడానికి కారణం బాలయ్య ఇమేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 10 Jan 2025 7:18 AM GMTముంబై బ్యూటీ ప్రగ్యాజైశ్వాల్ తెలుగులో ఇప్పటికే చాలా సినిమాలు చేసింది. కానీ ఎన్ని సినిమాలు చేసినా నటసింహ బాలకృష్ణ సరసన నటించిన `అఖండ`తో మాత్రం బాగా ఫేమస్ అయింది. తెలుగులో అమ్మడి క్రేజ్ పెరగడానికి కారణం బాలయ్య ఇమేజ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మడి పాపులారిటీ రెట్టింపు అయింది బాలయ్య అభిమానుల వల్లే. సంక్రాంతికి రిలీజ్ అవుతున్న `డాకు మహారాజ్` లోనూ నటించింది. `అఖండ తాండవం`లో కూడా హీరోయిన్ గా ఎంపికైంది ప్రగ్యా.
ఈ నేపథ్యంలో ఇటీవలే బాలయ్య కారణంగానే అవకాశాలు వస్తున్నాయనే ప్రశ్న ఆమె ముందుకు వెళ్లడంతో ఆయన తనకు ఎలాంటి రికమండీషన్లు ఇవ్వలేదని కూడా కుండ బద్దలు కొట్టేసింది. `డాకు మహారాజ్` లో ఛాన్స్ కి కారణం దర్శకుడు బాబి అంది. కథలే తన దగ్గరకు వస్తునాయని..తాను వాటి దగ్గరకు వెళ్లడం లేదని తెలిపింది. ఈ నేపథ్యంలో తాజాగా బాలయ్య `నా లక్కి ఛార్మ్` అంటూ ట్విస్ట్ ఇచ్చింది.
బాలయ్యతో వరుసగా కలిసి పనిచేయడం ఓ గొప్ప అవకాశంగా భావిస్తుంది. అఖండ చిత్రం రాత్రికి రాత్రే తన రాతను మార్చేసిందంది. కోవిడ్ సమయంలో బోయపాటి పిలిచి ఇచ్చిన అవకాశంగా పేర్కొంది. ఆయన నుంచి పిలుపు రాగానే ముంబై నుంచి హ్యాండ్ బ్యాగ్ తో హైదరాబాద్ లో దిగిపోయానంది. కథ చెప్పిన గంటలోపే ప్రాజెక్ట్ ఖరారైందట. ఇప్పుడు `అఖండ -2`లోనూ తనని భాగం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసింది.
ఇక బాలయ్యని `బాల` అని ముద్దుగా పిలిచే హీరోయిన్లలో ప్రగ్యాజైశ్వాల్ కూడా ఉంది. ఆయన్ని సర్ అని పిలవడం ఇష్టం ఉండదని ఇటీవలే శ్రద్దా శ్రీనాధ్ ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేసిన సంగతి తెలిసిందే. సర్ అని పిలవడం కంటే బాల అంటేనే ఆయన ఎంతో సంతోషంగా ఫీలవుతారని తెలిపింది. ప్రగ్యాజైశ్వాల్ కూడా ఇదే విషయాన్ని గతంలో ఓ సందర్భంలో రివీల్ చేసింది.