Begin typing your search above and press return to search.

AI వీడియోతో దారుణం.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్

"ఇది కేవలం చెడు కలగా అనిపిస్తూ ఉంది. టెక్నాలజీ మనకు సాయం చేసేందుకు పుట్టింది కానీ, ఇలా మన జీవితాలను దుఃఖంగా మార్చేందుకు కాదు.

By:  Tupaki Desk   |   7 Dec 2024 12:21 PM GMT
AI వీడియోతో దారుణం.. నటి ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

సోషల్ మీడియా అనేది ఇటీవల కాలంలో ఏ విధంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాజిటివ్ కంటే నెగిటివ్ వైబ్ తో ఉండేవారే ఎక్కువగా ఉంటారు అని కొందరు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారు. ఇక అది ఎన్నో చేదు అనుభవాలను కూడా తీసుకువస్తుందనే వాస్తవం ఇటీవల మరోసారి నిరూపితమైంది. తాజాగా, నటి ప్రగ్యా నాగ్రా గురించి సోషల్ మీడియాలో ఒక అసభ్యమైన ట్రెండ్ షాక్ కు గురి చేస్తోంది.

గత కొన్ని రోజులుగా ప్రగ్యా నాగ్రా పేరుతో ఒక ప్రైవేట్ వీడియో లీక్ అయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అసలు అలాంటి వీడియో లేదని ఆమె క్లారిటీ ఇచ్చినప్పటికీ, అది తప్పుడు సమాచారంగా విస్తరించింది. ఈ విషయంలో ప్రగ్యా సోషల్ మీడియాలో ఎమోషనల్ గా స్పందిస్తూ తన బాధను పంచుకున్నారు.

"ఇది కేవలం చెడు కలగా అనిపిస్తూ ఉంది. టెక్నాలజీ మనకు సాయం చేసేందుకు పుట్టింది కానీ, ఇలా మన జీవితాలను దుఃఖంగా మార్చేందుకు కాదు. ఈ విధమైన AI కంటెంట్‌ను సృష్టించి, అది వైరల్ అయ్యేలా చేసిన వారి పై జాలిపడే స్థితిలో ఉన్నాను. ఈ కష్ట సమయంలో నాతో ఉన్న అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అనుభవం మరే మహిళా అనుభవించకూడదని ప్రార్థిస్తున్నాను," అంటూ ప్రగ్యా తన భావాలను వ్యక్తం చేశారు.

అసలు ఈ వీడియో AI టెక్నాలజీతో తయారై, దానిని తన పేరుతో వైరల్ చేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయం పై సైబర్ పోలీసులను సంప్రదించి, నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ పరిస్థితిని ఆమె ఎమోషనల్ గా తీసుకొని, సోషల్ మీడియాలో తన బాధను పంచుకోవడం ద్వారా సోషల్ మీడియా ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవచ్చు.

గతంలో రష్మిక మందన్నకు కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. AI ద్వారా తప్పుడు వీడియోలు క్రియేట్ చేసిన వారిపై సైబర్ క్రైమ్ వెంటనే కేసు కూడా నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. టెక్నాలజీ అనేది మన జీవితాలను మెరుగుపరచాలని ఉద్దేశించినప్పటికీ, దీనిని తప్పుడు దారిలో వినియోగించే వారి వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఈ సంఘటన స్పష్టంగా చూపిస్తుంది. ప్రత్యేకించి AI టెక్నాలజీ వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి సమస్యలు ఇంకెవరికి ఎదురుకాకుండా పటిష్ఠమైన చట్టాలు, నియమాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రగ్యా తన సందేశంతో తెలియజేశారు. మొత్తం మీద, ఈ ఘటన మరోసారి AI టెక్నాలజీని వినియోగించే పద్ధతులపై కొత్త చర్చను ప్రేరేపిస్తోంది. ఇలాంటి పరిణామాలను నివారించేందుకు బాధ్యతాయుతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని పలువురు నెటిజన్లు ప్రగ్యాకు మద్దతు అందిస్తున్నారు.