నాపై అవన్నీ మంచి పుకార్లే: ప్రగ్య జైస్వాల్
కానీ 2024లో ప్రగ్యకు ఊరటనిచ్చే రెండు సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి.
By: Tupaki Desk | 2 Aug 2024 3:43 PM GMTప్రగ్యా జైస్వాల్ పరిచయం అవసరం లేదు. తెలుగు-హిందీ పరిశ్రమలకు ఈ భామ సుపరిచితం. కానీ ఇటీవల తెలుగు పరిశ్రమలో ఆశించినంత జోరు లేదు. కానీ 2024లో ప్రగ్యకు ఊరటనిచ్చే రెండు సినిమాలు రిలీజ్ కి వస్తున్నాయి. వాటిలో అక్షయ్ కుమార్ `ఖేల్ ఖేల్ మే` ఒకటి కాగా.. ఎన్బీకే 109 మరొకటి.
ఖేల్ ఖేల్ మే ట్రైలర్ లాంచ్ సందర్భంగా భారతీయ సినీ పరిశ్రమలోని ఇద్దరు బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ - అక్షయ్ కుమార్, నందమూరి బాలకృష్ణలతో కలిసి పనిచేసిన అనుభవం గురించి ప్రగ్యాను మీడియా ప్రశ్నించగా.. ప్రగ్య మాట్లాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ``రెండు విభిన్న పరిశ్రమల్లో పనిచేసినందుకు నేను కృతజ్ఞురాలి. మంచి సినిమాలు, కథల్లో భాగం కావడమే కాకుండా గుర్తుండిపోయే పాత్రల్లో నటించాలని మాత్రమే ప్రయత్నిస్తున్నాను. నాకు మంచి అవకాశాలు వస్తే భాష ముఖ్యం కాదు`` అని తెలిపింది.
ఇదే వేదికపై ప్రగ్య మరో కఠినమైన ప్రశ్నను ఎదుర్కొంది. మీపై పుకార్లు వచ్చినప్పుడు అవి మీ కుటుంబంలో కలకలం సృష్టించాయా అని మీడియా ప్రశ్నించింది. దానికి ప్రగ్యా ఇలా సమాధానమిచ్చింది. ``నా గురించి నేను ఎప్పుడూ ప్రతికూల పుకార్లు వినలేదు. నేను ఎదుర్కొన్న అన్ని పుకార్లు మంచివి.. సానుకూలమైనవి.. అవి నిజంగా నిజమని నేను ఆశిస్తున్నాను`` అని తెలిపింది.
బాలకృష్ణ సరసన అఖండలో మొదటిసారి నటించిన ప్రగ్యకు ఇప్పుడు NBK 109లో నటించే అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి బాబి కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు. బాబి డియోల్ ఇందులో విలన్ పాత్రధారి. నందమూరి బాలకృష్ణతో కలిసి పనిచేసిన ప్రగ్య తాజా ఇంటర్వ్యూలో భాషతో సంబంధం లేకుండా అన్ని పరిశ్రమల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని క్లారిటీ నిచ్చింది.
ఖేల్ ఖేల్ మే చిత్రంలో అక్షయ్ కుమార్, తాప్సీ పన్ను, ఫర్దీన్ ఖాన్, వాణి కపూర్, అమ్మీ విర్క్, ఆదిత్య సీల్, ప్రగ్యా జైస్వాల్ తదితరులు నటించిన మల్టీస్టారర్. ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. ఖేల్ ఖేల్ మేను టి-సిరీస్- వకావో ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఆసక్తికరంగా శ్రద్ధా కపూర్ నటించిన స్త్రీ 2 కూడా అదే రోజున విడుదల కానుంది. స్త్రీ 2 చిత్రాన్ని టి-సిరీస్ ఫిల్మ్, వకావో ఫిల్మ్స్, కెకెఎమ్ ఫిల్మ్ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి.