హాట్ బ్యూటీకి అక్కడైనా పని అవుద్దా?
ఈ నేపథ్యంలో అమ్మడు ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ మీద దృష్టి సారించింది
By: Tupaki Desk | 6 May 2024 10:04 AM GMT'కంచె' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన అందాల భామ ప్రగ్యా జైస్వాల్ కెరీర్ ఆశించిన విధంగా ముందుకి సాగడం లేదు. అందం అభినయం ఉన్నా ఎందుకనో క్రేజీ ఆఫర్స్ అందులోపోయింది. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించినా 'స్టార్' స్టేటస్ సాధించలేకపోయింది. ఇటీవల కాలంలో ఆమెకు తెలుగులో అవకాశాలు సన్నగిల్లాయి. గత రెండేళ్లలో ప్రగ్యా నుంచి ఒక్కటంటే ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ నేపథ్యంలో అమ్మడు ఇప్పుడు మళ్లీ బాలీవుడ్ మీద దృష్టి సారించింది. దశాబ్ద కాలం తర్వాత హిందీ సినిమా ఆఫర్ దక్కించుకుంది.
బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న 'ఖేల్ ఖేల్ మేన్' అనే చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ కీలక పాత్ర పోషిస్తోంది. 2014లో వచ్చిన 'టిటూ MBA' తర్వాత ఆమె నటిస్తున్న హిందీ చిత్రమిదే. నిజానికి క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన 'ఠాగూర్' హిందీ రీమేక్ గబ్బర్ ఈజ్ బ్యాక్' మూవీలో అక్షయ్ తో కలిసి నటించాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ ఛాన్స్ మిస్ అయిందని ప్రగ్యా స్వయంగా వెల్లడించింది.
ప్రగ్యా జైస్వాల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ తో కలిసి నటించిన అనుభవాన్ని ప్రేక్షకులతో పంచుకుంది. 'గబ్బర్ ఈజ్ బ్యాక్' చిత్రం కోసం ఆడిషన్ ఇచ్చానని, కొన్ని కారణాల వల్ల అందులో నటించే అవకాశం రాలేదని చెప్పింది. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న 'ఖేల్ ఖేల్ మే'లో కీలక పాత్ర పోషిస్తున్నాను. ఇన్నాళ్లకు మళ్లీ ఆ అవకాశం రావడం యాదృచ్ఛికమని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని ప్రగ్యా తెలిపింది.
అక్షయ్ కుమార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం గర్వంగా ఉంది. 'ఖేల్ ఖేల్ మే' సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు ఇందులో నాకు సరైన పాత్ర లభించిందని హ్యాపీగా ఫీల్ అయ్యాను అని ప్రగ్యా చెప్పింది. మొదట్లో అక్షయ్ తో కలిసి నటించడానికి చాలా భయపడ్డానని తెలిపింది. కొద్ది రోజులకి ఆయన దగ్గరికి వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నానని, ఆయన ఎంతో ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చింది ప్రగ్యా.
మధ్యప్రదేశ్ లోని జబల్‌పూర్ కు చెందిన ప్రగ్యా జైస్వాల్.. 'విరాట్టు' అనే తమిళ సినిమాతో హీరోయిన్ గా తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత టిటూ ఎంబీఏ' మూవీతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. ఇక 2015లో 'మిర్చి లాంటి కుర్రాడు' చిత్రంతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన 'కంచె' సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, ఉత్తమ నటిగా సౌత్ ఫిలింఫేర్ అవార్డ్ అందుకుంది. 'ఓం నమో వేంకటేశాయ' సినిమాలో అక్కినేని నాగార్జునకు జోడీగా నటించింది.
ప్రగ్యా ఆ తర్వాత మంచు మనోజ్ సరసన నటించిన 'గుంటూరోడు', సాయి ధరమ్ తేజ్ తో కలిసి చేసిన 'నక్షత్రం' సినిమాలు బాక్సఫీస్ వద్ద నిరాశ పరిచాయి. 'జయ జానకీ నాయక' లో సెకండ్ హీరోయిన్ పాత్ర పోషించిన ప్రగ్యా.. 'ఆచారి అమెరికా యాత్ర' తో మరో ఫ్లాప్ రుచి చూసింది. నందమూరి బాలకృష్ణతో నటించిన 'అఖండ' సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ వెంటనే వచ్చిన 'సన్ ఆఫ్ ఇండియా' భారీ డిజాస్టర్ అయింది. దీంతో చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడు హిందీలో చేస్తున్న 'ఖేల్ ఖేల్ మే' చిత్రంపై అమ్మడు బోలెడన్ని ఆశలు పెట్టుకుంది. మరి ఈసారైనా ఆమెకి బాలీవుడ్ లో మంచి హిట్ లభిస్తుందేమో చూడాలి.