Begin typing your search above and press return to search.

తప్పు తెలుసుకున్నా : ప్రకాష్ రాజ్

ఈ నేపథ్యంలో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు

By:  Tupaki Desk   |   20 March 2025 4:54 PM
తప్పు తెలుసుకున్నా : ప్రకాష్ రాజ్
X

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌ యాప్‌ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌లకు ప్రచారకర్తలుగా వ్యవహరించిన సినీ నటులు, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ జాబితాలో సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌ పేరు కూడా ఉండటంతో ఆయన స్పందించారు.

ఈ విషయంపై ప్రకాశ్‌రాజ్‌ ఎక్స్‌ వేదికగా ఒక వీడియోను విడుదల చేశారు. ప్రస్తుతం తాను ఒక పల్లెటూరిలో షూటింగ్‌లో ఉన్నానని, ఆన్‌లైన్‌ గేమింగ్‌ యాప్‌ కేసుల గురించి, తాను చేసిన ప్రకటన గురించి ఇప్పుడే తెలిసిందని ఆయన అన్నారు. అందరినీ ప్రశ్నించే తాను దీనికి సమాధానం చెప్పాలని ఆయన పేర్కొన్నారు.

2016లో ఒక గేమింగ్‌ యాప్‌కు తాను ప్రకటన చేసిన మాట నిజమేనని, అయితే అది తప్పని కొద్ది నెలల్లోనే తెలుసుకున్నానని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. 2017లో ఆ సంస్థ తనతో ఒప్పందాన్ని పొడిగించాలని కోరితే, తాను ఆ ప్రకటనను పొరపాటున చేశానని, ఏడాది ఒప్పందం ముగిసినందున ఇకపై ఆ ప్రకటనను ప్రసారం చేయవద్దని, తాను కూడా నటించనని స్పష్టం చేశానని ఆయన వెల్లడించారు. ఆ తర్వాత తాను ఏ గేమింగ్‌ యాప్‌కు ప్రచారకర్తగా పనిచేయలేదని ఆయన తేల్చి చెప్పారు.

2021లో ఆ కంపెనీని మరొకరికి అమ్మేసినప్పుడు, ఏదో సోషల్‌ మీడియా వేదికలో తన పాత ప్రకటనను ఉపయోగించారని, దానిపై తాను వారికి లీగల్‌ నోటీసులు పంపానుని, వాట్సాప్‌ ద్వారా కూడా సంప్రదించి ఆ ప్రకటనను తొలగించాలని కోరానని, వారు వెంటనే స్పందించారని ప్రకాశ్‌రాజ్‌ తెలిపారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రకటన లీక్ కావడంతో తాను ఈ వివరణ ఇస్తున్నానని ఆయన అన్నారు. ఇప్పటివరకు పోలీసుల నుంచి తనకు ఎలాంటి సమాచారం అందలేదని, ఒకవేళ వస్తే వారికి వివరణ ఇస్తానని ఆయన స్పష్టం చేశారు.

తొమ్మిదేళ్ల కిందట, ఏడాది కాంట్రాక్టు కోసం మాత్రమే తాను ఆ ప్రకటనలో నటించానని, ఆ తర్వాత చేయలేదని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా యువతకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నానని, గేమింగ్‌ యాప్‌లు ఒక వ్యసనమని, వాటికి దూరంగా ఉండాలని, తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని ప్రకాశ్‌రాజ్‌ సూచించారు.