Begin typing your search above and press return to search.

400 సినిమాల న‌టుడు కొడుకు గురించి ఆందోళ‌న‌

అత‌డు ద‌క్షిణ భార‌త‌దేశంలోని పెద్ద సూప‌ర్ స్టార్ కొడుకు అయినా స్టార్ డ‌మ్ గురించి క‌ల‌లు క‌న‌డం లేదు.

By:  Tupaki Desk   |   29 Dec 2024 3:00 AM GMT
400 సినిమాల న‌టుడు కొడుకు గురించి ఆందోళ‌న‌
X

స‌హ‌జంగానే స్టార్ల కొడుకులు హీరోలు అవ్వాల‌ని ఇండ‌స్ట్రీని ఏలాల‌ని అనుకుంటారు. కానీ ఈ స్టార్ కిడ్ కి అలాంటి ఆలోచ‌న‌లే లేవు. అత‌డు ద‌క్షిణ భార‌త‌దేశంలోని పెద్ద సూప‌ర్ స్టార్ కొడుకు అయినా స్టార్ డ‌మ్ గురించి క‌ల‌లు క‌న‌డం లేదు. స‌రిక‌దా.. అత‌డు త‌న రోజువారీ భ‌త్యం కోసం మేక‌లు మేపుతున్నాడు. పొలంలో ప‌ని చేస్తున్నాడు. విదేశాల్లో ఫామ్‌లో ఉంటున్నాడు. త‌న వ్య‌క్తిగ‌త ఇష్టాల‌ను అస్స‌లు వ‌దులుకోవ‌డం లేదు. పొలంలో ప‌ని చేయ‌డం.. ప్ర‌కృతితో మ‌మేకం అవ్వ‌డం లేదా ప్రయాణాల‌ను ఆస్వాధించ‌డం .. వంటి స‌హ‌జ‌జీవ‌న విధానాల‌ను అనుస‌రిస్తున్నాడు. ఇవ‌న్నీ చాలామందిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాయి. ఇదంతా ఎవ‌రి గురించి అంటే.. సూప‌ర్‌స్టార్ మోహ‌న్ లాల్ కుమారుడు ప్ర‌ణ‌వ్ మోహ‌న్ లాల్ గురించే.

అయితే ఇప్పుడు త‌న కొడుకు స్టార్ అవ్వాల‌నే క‌నీస ఆందోళ‌న కూడా త‌న‌కు లేద‌ని చెబుతున్నారు మోహ‌న్ లాల్. త‌న కొడుకు ప్ర‌తిభావంతుడైన న‌టుడు అని ప్ర‌శంసించిన లాల్.. నేను కూడా అత‌డిలాగే పొలంలో ఉండాల‌ని అనుకుంటున్న‌ట్టు మోహ‌న్ లాల్ చెప్పారు. తాను ఏం చేయాల‌నుకుంటే అది చేయ‌మ‌ని తానే స‌ల‌హా ఇచ్చాన‌ని తెలిపాడు. మా నాన్న గారు కూడా నేను న‌టిస్తాను అన‌గానే, ముందు డిగ్రీ పూర్తి చేసి త‌ర్వాత ఏం అవ్వాల‌నుకుంటున్నావో అది అవ్వు! అని అన్నార‌ని, అలాంటి స్వేచ్ఛ త‌న కుమారుడికి ఇచ్చాన‌ని మోహ‌న్ లాల్ తాజా ఇంట‌ర్వ్యూలో తెలిపారు. అంతేకాదు ప్ర‌ణ‌వ్ తో తీరిక స‌మ‌యాల్లో పొలంలో గడుపుతాన‌ని అన్నారు లాల్. ఆట‌విడుపు ఆట‌ల‌తో కాల‌క్షేపం చేయ‌డం త‌న‌కు ఇష్ట‌మ‌ని అన్నారు. కొడుకుతో ఆట‌లు ఆడే ఓ ఫోటోని కూడా అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది.

దశాబ్దాలుగా నటుడిగా పరిశ్రమలో ఆధిపత్యం చెలాయించిన మోహన్‌లాల్ ఇటీవల బాలల ఫాంటసీ చిత్రం బరోజ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు. ద‌ర్శ‌కుడిగా మారి తొలి ప్ర‌య‌త్న‌మే ప్ర‌శంస‌లు అందుకున్నారు. 400 చిత్రాలకు పైగా సినిమాల్లో నటించిన మోహన్‌లాల్ నిర్మాతగా, పంపిణీదారుగా, నేపథ్య గాయకుడిగా నిరూపించారు. అయితే ఒకానొక సమయంలో స‌హ‌జ‌మైన జీవితాన్ని గడపడానికి సినిమాల‌ నుండి నిష్క్రమించాలని భావించిన‌ట్టు తెలిపాడు. త‌న‌కు కూడా ప్ర‌ణ‌వ్ లా ఉండ‌టం చాలా ఇష్ట‌మ‌ని కూడా అన్నాడు. నాలాగే ప్రణవ్ కూడా ఆరో తరగతి చదువుతున్నప్పుడు స్కూల్‌లో ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. అతడికి సొంతంగా కొన్ని సూత్రాలు ఉన్నాయి. ఎక్కువ సినిమాలు చేయాలనుకోవడం లేదు. అతడు అప్పుడప్పుడు ప్రయాణం.. అప్పుడ‌ప్పుడు సినిమాలు చేయాలనుకుంటున్నాడు. అది అతడి ఎంపిక. దాంతో మాకు ఎలాంటి సమస్య లేదు. తన జీవితాన్ని ఆనందించనివ్వండి.. అని అన్నారు.

జీతూ తెర‌కెక్కించిన 'ప్ర‌ణ‌వ్ ఒన్నమన్' (2002)లో మోహన్‌లాల్ చిన్నప్ప‌టి వెర్షన్‌లో ప్ర‌ణ‌వ్ నటించాడు. పునర్జని (2003)లో తన నటనకు ఉత్త‌మ బాల‌న‌టుడిగా కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డును గెలుచుకున్నాడు. ఆ తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్నాడు. కమల్ హాసన్ నటించిన పాపనాశం సినిమాకి ప్రణవ్ జీతూ జోసెఫ్‌కు సహాయ దర్శకుడిగా ప‌ని చేసాడు. ఈ ఏడాది నవంబర్‌లో మోహన్‌లాల్ భార్య సుచిత్ర తమ కుమారుడు స్పెయిన్‌లో ఉన్నాడని, అక్కడ వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్నాడని వెల్లడించారు. ప్ర‌ణ‌వ్ యాక్షన్ థ్రిల్లర్ ఆది (2018)తో హీరో అయ్యాడు. ఇరుపతియోన్నాం నూట్టాండు (2019), హృదయం (2022), వర్షాంగళ్కు శేషం (2024) చిత్రాలలో క‌థానాయ‌కుడిగా న‌టించాడు. మరక్కర్: అరబికాడలింటే సింహం (2021), బరోజ్‌లో అతిధి పాత్రల్లో కనిపించాడు.