Begin typing your search above and press return to search.

'ప్రసన్న వదనం' మూవీ రివ్యూ

By:  Tupaki Desk   |   3 May 2024 10:59 AM GMT
ప్రసన్న వదనం మూవీ రివ్యూ
X

'ప్రసన్న వదనం' మూవీ రివ్యూ

నటీనటులు: సుహాస్-పాయల్ రాధాకృష్ణ-రాశి సింగ్-నితిన్ ప్రసన్న-నందు-వైవా హర్ష తదితరులు

సంగీతం: విజయ్ బుల్గానిన్

ఛాయాగ్రహణం: ఎస్.చంద్రశేఖరన్

నిర్మాత: మణికంఠ

రచన-దర్శకత్వం: అర్జున్ వైకే

మంచి కంటెంట్ ఉన్న సినిమాలు చేస్తూ నటుడిగానే కాక హీరోగా మంచి పేరు సంపాదించాడు సుహాస్. ఇప్పుడు అతడి నుంచి వచ్చిన 'ప్రసన్న వదనం' కూడా ప్రోమోలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తించింది. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ: సూర్య (సుహాస్) ఒక రేడియో కంపెనీలో ఆర్జే. ఓ ప్రమాదంలో తల్లిదండ్రులు కోల్పోయి.. తనూ తీవ్రంగా గాయపడ్డ సూర్యకు ఒక విచిత్రమైన ఆరోగ్య సమస్య తలెత్తుతుంది. అతను ఏ ముఖాన్నీ గుర్తు పట్టలేడు. అలాగే ఏ వాయిస్ కూడా గుర్తించలేడు. కానీ ఈ సమస్య తన క్లోజ్ ఫ్రెండ్ తప్ప ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతుంటాడు. సూర్య జీవితంలోకి అనుకోకుండా వచ్చిన ఆద్య (పాయల్ రాధాకృష్ణ) తనను ఇష్టపడడమే కాక అతడి సమస్యను కూడా అర్థం చేసుకుంటుంది. ఇలా సాఫీగా జీవితం సాగిపోతున్న సమయంలో సూర్య ఒక హత్యను కళ్లారా చూస్తాడు. దాని గురించి కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లాక అతను పెద్ద సమస్యలో చిక్కుకుంటాడు. ఆ సమస్యేంటి.. దాన్నుంచి సూర్య బయటపడ్డాడా లేదా అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ: రొటీన్ సినిమాల వరదలో ఏదైనా కొత్త ఐడియాతో ఓ టీజరో.. ట్రైలరో కనిపిస్తే ప్రేక్షకులు ఎంతో ఆశగా ఆ సినిమా వైపు చూస్తారు. కానీ ఐడియా వరకు ఎగ్జైటింగ్ గా అనిపించినా.. దాన్ని రెండు రెండున్నర గంటల సినిమాగా మలిచే క్రమంలో తడబడే దర్శకులే ఎక్కువ. ఐతే సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే మాత్రం ఓ కొత్త ఐడియా చుట్టూ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే అల్లి రెండున్నర గంటలు ప్రేక్షకులను కూర్చోబెట్టడంలో విజయవంతం అయ్యాడు. ముఖాలు-గొంతులు గుర్తు పట్టలేని హీరో.. ఒక హత్య కేసులో చిక్కుకుపోయి దాన్నుంచి ఎలా బయటపడ్డాడన్న ఇంట్రెస్టింగ్ ఐడియాతో తెరకెక్కిన సినిమా ఇది. భలే భలే మగాడివోయ్.. మహానుభావుడు లాంటి సినిమాల్లో హీరోకు ఒక లోపం ఉండడం.. దాని వల్ల తలెత్తే ఇబ్బందుల చుట్టూ కామెడీ చూశాం. కానీ 'ప్రసన్న వదనం'లో హీరో సమస్యను కామెడీ కోసం కాకుండా థ్రిల్ పంచడానికి ఉపయోగించుకున్నాడు దర్శకుడు. హీరో పాత్రకు సంబంధించిన లోపం అన్నది కొత్తది కావడం వల్ల.. దాన్ని అనుసరించే సాగే సన్నివేశాలు కూడా కొత్తగా అనిపిస్తాయి. ఈ పాయింట్ చుట్టూ ఎప్పుడూ చూసే ఒక టెంప్లేట్ మర్డర్ మిస్టరీని బోర్ కొట్టకుండా నడిపించగలిగాడు దర్శకుడు. మరీ వావ్ అనుకునే స్థాయిలో లేకపోయినా.. ఆరంభం నుంచి చివరి వరకు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టడంలో మాత్రం 'ప్రసన్న వదనం' సక్సెస్ అయింది.

'ప్రసన్న వదనం' ట్రైలర్ లో అందరినీ ఆకర్షించిన అంశం.. హీరోకు ఉన్న లోపమే. తనతోనే కలిసి ఉండే వ్యక్తుల ముఖాలు.. గొంతు కూడా గుర్తు పట్టలేని హీరో పాత్ర సినిమాను డ్రైవ్ చేస్తుంది. నిజంగా ఇలాంటి మెడికల్ ప్రాబ్లం ఒకటి ఉందో లేదో కానీ.. ఆ పాయింట్ ఎంచుకోవడం ద్వారా ప్రేక్షకులు ఆరంభం నుంచే సినిమాలో లీనమయ్యేలా చేయగలిగాడు కొత్త దర్శకుడు అర్జున్ వైకే. తన సమస్యను దాచి పెట్టి హీరో రోజువారీ కార్యకలాపాల్లో ఎలా నెట్టుకొస్తాడన్నది ఆసక్తికరంగా చూపించారు. హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ కూడా దీని వల్ల ఆసక్తికరంగా తయారైంది. కథానాయికకు పదే పదే హీరో ఎదురుపడడం కొంచెం సినిమాటిగ్గా అనిపించినా.. ఆమెను గుర్తు పట్టకుండా వేర్వేరు వ్యక్తులుగా భావిస్తూ తనతో వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు రకాలుగా మాట్లాడ్డం ఫన్నీగా అనిపిస్తుంది. కొంచెం ఫన్.. కొంచెం రొమాన్సుతో తొలి గంట సినిమా సాఫీగా సాగిపోతుంది. ఆ తర్వాత సినిమా క్రైమ్ థ్రిల్లర్ గా రూపాంతరం చెందుతుంది. సాధ్యమైనంత మేర ఉత్కంఠ రేకెత్తించేలాగే ఈ ట్రాక్ ను కూడా నడిపించాడు దర్శకుడు.

అసలు విలన్ ఎవరు అన్నది చివరి వరకు దాచి పెట్టకుండా మధ్యలోనే ట్విస్ట్ రివీల్ చేయడంతో అక్కడ ప్రేక్షకులు థ్రిల్ ఫీలవుతారు. ఇక హీరోను ఇరికించడానికి విలన్ వేసే ఎత్తుగడలు.. దీనికి తోడు తన సమస్య వల్ల హీరో అంతకంతకూ చిక్కుకపోవడంతో అతనీ చిక్కుముడి నుంచి ఎలా బయటపడతాడనే ఆసక్తి కలుగుతుంది. కానీ ఇక్కడ్నుంచి కథ ముందుకు సాగడంలో ఒడుదొడుకులు కనిపిస్తాయి. థ్రిల్లర్ సినిమాల్లో ఉండాల్సిన వేగం ద్వితీయార్ధంలో మిస్సయింది. హీరోకు విలన్లు వేసిన చిక్కుముడి పకడ్బందీగా అనిపించినా.. దాన్నుంచి అతను బయటపడే క్రమం అంత ఆసక్తికరంగా అనిపించదు. లూజ్ ఎండ్స్ చాలా కనిపిస్తాయి. చాలా సింపుల్ గా ఒక్కో సమస్యను సాల్వ్ చేసుకుంటూ వెళ్లిపోతాడు హీరో. దర్శకుడు అంతకుముందు వరకు చూపించిన బిగి.. తర్వాత మిస్సయింది. కొన్ని సీన్లలో లాజిక్ కూడా కనిపించదు. హీరోయిన్ పాత్రను క్లైమాక్స్ కోసం వాడుకున్న తీరు కూడా ఏమంత ఆసక్తికరంగా అనిపించదు. ద్వితీయార్ధంలో కథనంలో వేగం బాగా తగ్గిపోయి.. ఫైనల్ ట్విస్ట్ కోసం ప్రేక్షకులు చాలా సేపు ఎదురు చూడాల్సి వస్తుంది. ఆ సీక్రెట్ ఏంటో తెలిసిపోయాక క్లైమాక్స్ కూడా అనుకున్నట్లే ముగుస్తుంది. ఇక్కడ హీరోయిన్ పాత్రతో చిన్న డ్రామా ప్లే చేశారు కానీ.. అది థ్రిల్ కలిగించకపోగా.. ఫన్నీగా తయారైంది. కథ.. హీరో పాత్రలో ఉన్న కొత్తదనం-ఆసక్తి వల్ల 'ప్రసన్న వదనం' చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది కానీ.. చివరికి ఒక పకడ్బందీ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ అయితే కలగదు. అలా అని ఇది బోర్ కొట్టే సినిమా కాదు. పైగా డిఫరెంట్ అటెంప్ట్ కాబట్టి కొత్త తరహా థ్రిల్లర్లు చూడాలనుకునేవారికి ఇది మంచి ఆప్షనే.

నటీనటులు: సుహాస్ నటనకు వంకలు పెట్టడానికి లేదు. చాలా కన్విన్సింగ్ గా తన పాత్రను పోషించాడు. పెర్ఫామెన్స్ అవసరమైన సన్నివేశాలను నిలబెట్టాడు. కొన్ని చోట్ల ఎమోషన్లు చక్కగా పలికించాడు. అన్నింటికీ మించి సినిమా సినిమాకూ కథల్లో వైవిధ్యం చూపిస్తున్నందుకు అతణ్ని అభినందించాలి. లుక్స్ పరంగా యావరేజ్ అయినా.. తన పెర్ఫామెన్స్.. స్క్రిప్ట్ సెలక్షన్ తో అతను మనసులు గెలుస్తున్నాడు. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ చూడ్డానికి బాగుంది. నటన కూడా ఓకే. ఇంకో కీలకమై లేడీ క్యారెక్టర్లో రాశి సింగ్ పర్వాలేదు. నితిన్ ప్రసన్న మరోసారి నెగెటివ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. నందు పాత్ర పరిమితం. వైవా హర్ష హీరో ఫ్రెండు పాత్రలో రాణించాడు. గోపరాజు రమణ.. ఇతర నటీనటులు ఓకే.

సాంకేతిక వర్గం: బేబి ఫేమ్ విజయ్ బుల్గానిన్ సంగీతం ఆకట్టుకుంటుంది. రెండు పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం సినిమా నడతకు తగ్గట్లుగా సాగింది. చంద్రశేఖరన్ ఛాయాగ్రహణం కూడా బావుంది. ఒక థ్రిల్లర్ మూవీకి సరిపడా విజువల్స్ చూడొచ్చు. నిర్మాణ విలవల్లో పరిమితులు కనిపిస్తాయి. ఐతే దృష్టి ఎక్కువగా కథా కథనాల మీదే ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బందిగా అనిపించదు. కొత్త దర్శకుడు అర్జున్ వైకే తన ప్రతిభను చాటాడు. ఇలాంటి కథతో అరంగేట్రం చెయ్యాలని అనుకోవడమే సాహసం. రిస్కీ సబ్జెక్ట్ ని ఉన్నంతలో బాగానే డీల్ చేశాడు. ద్వితీయార్ధంలో ఇంకొంచెం బిగి.. వేగం ఉండుంటే ఇది పర్ఫెక్ట్ థ్రిల్లర్ అయ్యేది. అయినా సరే దర్శకుడికి మంచి మార్కులే పడతాయి

చివరగా: ప్రసన్నవదనం.. పాత థ్రిల్లర్ కథకు కొత్త కలర్

రేటింగ్-2.75/5