Begin typing your search above and press return to search.

'ప్రతినిధి 2' టీజర్: 'ఓటెయ్యండి లేదా చచ్చిపోండి' అంటున్న నారా రోహిత్

టాలీవుడ్ లో వైవిధ్యమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్

By:  Tupaki Desk   |   29 March 2024 6:53 AM GMT
ప్రతినిధి 2 టీజర్: ఓటెయ్యండి లేదా చచ్చిపోండి అంటున్న నారా రోహిత్
X

టాలీవుడ్ లో వైవిధ్యమైన కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నారా రోహిత్. ఇటీవల కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్న టాలెంటెడ్ యాక్టర్.. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు 'ప్రతినిధి 2' చిత్రంతో కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే టైటిల్ అనౌన్స్ మెంట్ తోనే ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఈ మూవీ టీజర్ ను ఆవిష్కరించారు.

నారా రోహిత్ కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రాల్లో ‘ప్రతినిధి’ ఒకటి. 2014లో వచ్చిన ఈ పొలిటికల్ డ్రామా మంచి విజయం సాధించింది. ఇప్పుడు అదే ఫ్రాంచైజీలో రెండో సినిమాగా "ప్రతినిధి 2" తెరకెక్కుతోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వంలో ఈ పొలిటికల్ థ్రిల్లర్ రూపొందుతోంది. ఈరోజు (మార్చి 29) శుక్రవారం మూవీ టీజర్ ను మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి చిత్ర బృందానికి బెస్ట్ విషెస్ అందజేశారు.

'5.. 4.. 3.. 2.. 1.. గో' అంటూ న్యూస్ రూమ్ లో ఉదయ భాను కౌంట్ డౌన్ స్టార్ట్ చేయడంతో ఈ టీజర్ ప్రారంభమవుతుంది. రాష్ట్ర అభివృద్ధి, అప్పులు వంటి పొలిటికల్ అంశాలను ప్రస్తావిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇందులో హీరో నారా రోహిత్ ఒక టీవీ ఛానెల్‌లో పనిచేసే నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించారు. రాజకీయ నాయకుడైన అజయ్ ఘోస్ ను ఇంటర్వ్యూ చేస్తూ, రాష్ట్ర అప్పుల గురించి ప్రశ్నిస్తున్నాడు. దానికి అతను 5 లక్షల కోట్లు అప్పు ఉందని బదులిస్తాడు.

'అంత అప్పు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది సార్' అని అడగ్గా.. అభివృద్ధి జరిగితే అవి తీరడానికి ఎంతో సమయం పట్టదని సమాధానమిస్తాడు. దీనికి వెంటనే 'అభివృద్ధి ఎక్కడుంది సార్?' అంటూ నారా రోహిత్ నవ్వుతూ ప్రశ్నించడంతో ఈ టీజర్ ఆసక్తికరంగా మారుతుంది. చివర్లో "ఇప్పటికైనా కళ్లు తెరవండి, ఒళ్ళు విరిచి బయటకు వచ్చి ఓటు వెయ్యండి. లేదంటే ఈ దేశం వదిలి వెళ్లిపోండి. అదీ కుదరకపోతే చచ్చిపోండి" అంటూ సీరియస్ గా హెచ్చరిస్తూ, ఓటు విలువను తెలియజెప్పడం హైలైట్ గా నిలిచింది.

టీజర్ లో 'జనం కోసం బ్రతికితే చచ్చాక కూడా జనంలోనే బ్రతికి ఉంటాం' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'పైన కూర్చొని నీతులు ఎన్నైనా చెప్తావ్.. మేము ఖర్చు పెట్టిందంతా ఎవరిస్తారు? వాడా.. వాడెమ్మ మొగుడా' అని రఘుబాబుతో పలికించడం ద్వారా ప్రస్తుత రాజకీయ నాయకులపై సెటైర్లు వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇందులో యాక్షన్ పాళ్లు కూడా ఎక్కువే అని టీజర్ లోనే హింట్ ఇచ్చారు.

మొత్తం మీద సమకాలీన రాజకీయాలకు అద్దంపట్టే అంశాలతో వచ్చిన 'ప్రతినిధి 2' ఇంటెన్స్ టీజర్ అందరినీ అలరించడమే కాదు, ఆలోచింపజేస్తుంది. న్యూస్ రిపోర్టర్ పాత్రలో నారా రోహిత్ మెప్పించారు. జర్నలిస్ట్ మూర్తి తన రైటింగ్, టేకింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇంటర్వ్యూ ఎపిసోడ్, ఓటు హక్కు - ఓటరు బాధ్యతల గురించిన సీక్వెన్స్ చాలా బాగుంది. మరికొన్ని రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ టీజర్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారే అవకాశం ఉంది.

మహతి స్వర సాగర్ కంపోజ్ చేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం చక్కగా ఉంది. ప్రొడక్షన్ డిజైన్ గ్రాండ్ గా అనిపించింది. కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన ఈ చిత్రానికి రవితేజ గిరిజాల ఎడిటర్ గా వ్యవహరించారు. వానర ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్‌రాజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

'ప్రతినిధి 2' చిత్రంలో నారా రోహిత్ తో పాటుగా సిరి లెల్ల, దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా, సచిన్ ఖేడేకర్, తనికెళ్ల భరణి, ఇంద్రజ, శ్రీ, ఉదయ భాను, అజయ్ గోష్, అజయ్, ప్రవీణ్, పృధ్వీ రాజ్, రఘుబాబు, రఘు కారుమంచి తదితరులు ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని 2024 సమ్మర్ స్పెషల్ గా ఏప్రిల్ నెలలో రిలీజ్ చేనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఎన్నికలకు ముందు ప్రేక్షకుల ముందుకి రాబోతున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.