Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ : ప్రేమలు

By:  Tupaki Desk   |   8 March 2024 4:25 AM GMT
మూవీ రివ్యూ : ప్రేమలు
X

'ప్రేమలు' మూవీ రివ్యూ


నటీనటులు: నస్లెన్-మామిత బైజు-సంగీత్ ప్రతాప్-శ్యామ్ మోహన్ అఖిల భార్గవన్-అల్తాఫ్ సలీమ్ తదితరులు

సంగీతం: విష్ణు విజయ్

ఛాయాగ్రహణం: అజ్మల్ సాబు

మాటలు: ఆదిత్య హాసన్

నిర్మాతలు: ఫాహద్ ఫాజిల్-దిలీష్ పోతన్-శ్యామ్ పుష్కరన్

కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: గిరీష్ ఏడీ

ఒకప్పుడు ఎక్కువగా తమిళం నుంచి తెలుగులోకి అనువాద చిత్రాలు వచ్చేవి. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎక్కువగా మలయాళ సినిమాలు ఆక్రమిస్తున్నాయి. రెండు వారాల కిందట మమ్ముట్టి సినిమా 'భ్రమయుగం' ప్రేక్షకులను పలకరిస్తే.. ఇప్పుడు మలయాళంలో ఘనవిజయం సాధించిన మరో సినిమా మన ముందుకు వచ్చింది. అదే.. ప్రేమలు. ఈ ప్రేమకథా చిత్రం విశేషాలేంటో చూద్దాం పదండి.


కథ:

సచిన్ (నస్లెన్) డక్కామొక్కీలు తిని డిగ్రీ పూర్తి చేసి.. ఉన్నత చదువుల కోసం యూకేకి వెళ్లాలని చూస్తున్న కేరళ కుర్రాడు. కానీ అతడి వీసా రిజెక్టవుతుంది. ఇంకో అవకాశం వచ్చే వరకు ఇంట్లో ఉండడం ఇష్టం లేక స్నేహితుడి సలహా మేరకు అతడితో కలిసి గేట్ కోచింగ్ కోసమని హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ కోచింగ్ కూడా సజావుగా సాగకపోవడంతో ఒక రెస్టారెంట్లో పనికి కుదురుతాడు. అంతకంటే ముందు సచిన్ ఓ పెళ్లిలో అనుకోకుండా రీణు (మామిత బైజు)ను చూసి ప్రేమలో పడతాడు. సరదా మనిషిలా కనిపించిన సచిన్ తో రీణు స్నేహం చేస్తుంది. మరోవైపు సహ ఉద్యోగి అయిన ఆది (శ్యామ్ మోహన్) రీణును ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ రాను రాను సచిన్ కే రేణు దగ్గరవుతుంది. ఆమె తనను ప్రేమిస్తోందని బలంగా నమ్మిన సచిన్ తనకు ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆమె తిరస్కరిస్తుంది. ఈ స్థితిలో సచిన్ ఏం చేశాడు.. ఇంతకీ వీళ్లిద్దరూ చివరికి కలిశారా లేదా అన్నది మిగతా కథ.


కథనం-విశ్లేషణ:

మలయాళ సినిమాలంటే అదో రకం. వాళ్ల కథలు.. ఆ కథలను చెప్పే తీరు వేరే స్టయిల్లో ఉంటుంది. దైనందిన జీవితాల్లో సాధారణంగా అనిపించే విషయాలనే అసాధారణ రీతిలో తెరపై ప్రెజెంట్ చేసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంటారు అక్కడి ఫిలిం మేకర్స్. తమ కథలను చెప్పే క్రమంలో తమ సంస్కృతిని.. పరిసరాలను వాడుకునే తీరు కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. చాలా కథల్లో షాక్ ఫ్యాక్టర్ కూడా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంటుంది. మలయాళ సినిమాలు అలవాటైన వాళ్లు ఇప్పుడు అదే భాష నుంచి తెలుగులోకి అనువాదమైన 'ప్రేమలు' సినిమాను కూడా ఇదే దృష్టితో చూడ్డానికి వెళ్తే నిరాశ తప్పదు. ఇదొక ఫక్తు తెలుగు ప్రేమకథా చిత్రంలా అనిపించి.. ఏముంది ఇందులో ప్రత్యేకత.. ఏదీ మలయాళ మార్కు అనే ప్రశ్నలు రేకెత్తిస్తే ఆశ్చర్యమేమీ లేదు. అలా అని సగటు తెలుగు ప్రేమకథా చిత్రం అన్నది ప్రతికూలాంశమేమీ కాదు. మనకు బాగా అలవాటైన ఓ ప్రేమకథను చూస్తున్న ఫీలింగే కలిగించినా.. రెండున్నర గంటలు టైంపాస్ చేయడానికి ఢోకా లేని ఎంటర్టైనర్.. ప్రేమలు.

''మంచి మంచి అమ్మాయిలందరూ ఎదవలకే పడతారు''.. ఇదొక పాపులర్ డైలాగ్. నిజానికి ఈ లైన్లో నడిచే ప్రేమకథలు కూడా ప్రేక్షకులను బాగా మెప్పిస్తుంటాయి. వాటికే ఎక్కువమంది ప్రేక్షకులు కనెక్ట్ అవుతుంటారు. దాన్నొక సూపర్ హిట్ ఫార్ములాగా చెప్పొచ్చు. టాప్ క్లాస్ అనిపించే హీరోయిన్.. జులాయిలా కనిపించే హీరో మధ్య ప్రేమకథలు పండడం దశాబ్దాలుగా చూస్తున్నాం. 'ప్రేమలు' కూడా ఈ కోవలోని సినిమానే. ఇందులో హీరోయిన్ మంచి చదువు చదువుకుని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటుంది. ఆమె తన తర్వాతి 30 ఏళ్ల జీవితాన్ని కూడా ప్లాన్ చేసి పెట్టుకుంటుంది. హీరోయేమో సరిగా చదువు అబ్బక.. తన భవిష్యత్తేంటో అర్థం కాక.. రోజుకో రకంగా లక్ష్యం మార్చుకుంటూ ఆవారాగా తిరిగేస్తుంటాడు. ఐతే ఇలా పద్ధతిగా ఉండే హీరోయిన్లు.. చివరికి క్రేజీగా ఉండే హీరోకు పడిపోవడం చాలా కామన్. చివరికి పతాక సన్నివేశంలో అదే జరుగుతుందని ప్రేక్షకులకు ముందే తెలిసిపోతుంది కానీ.. ఈ లోపు ఈ ప్రేమకథ ఎలా మొదలైంది.. ఎలా ముందుకు సాగింది.. అందులో మలుపులేంటి.. చివరికి కథ ఎలా సుఖాంతమైందన్నదే 'ప్రేమలు' కథాంశం.

ముందే చెప్పుకున్నట్లు ఇందులో మలయాళ సినిమాల మార్కు లేకపోవడం.. సర్ప్రైజింగ్ గా షాకింగ్ గా ఏదీ అనిపించకపోవడం కొంత మైనస్. అదే సమయంలో అనువాద సినిమాలా కాకుండా స్ట్రెయిట్ తెలుగు సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగడం ప్లస్. ఆశ్చర్యకరంగా ఒరిజినల్లో కూడా ఇది హైదరాబాద్ నేపథ్యంగా సాగే కథే. అందువల్ల కథ ఒరిజినల్ గా ఎక్కడో జరుగుతుంటే హైదరాబాద్ అని చెప్పి భ్రమింపజేయాల్సిన అవసరం లేకపోయింది. మన సిటీలో కథ జరుగుతుండటం.. దీనికి తోడు ఇప్పటి సోషల్ మీడియా ట్రెండుకు తగ్గట్లు డైలాగ్స్ రాయడంతో నేటివిటీ సమస్య అన్నదే లేకపోయింది. కాకపోతే సోషల్ మీడియా మీమ్స్.. ట్రోల్స్ ను ఫాలో అయ్యే క్రమంలో బూతులు విచ్చలవిడిగా వాడేశారు. కుర్చీ మడత పెట్టి ఏదో చేయడం దగ్గర్నుంచి.. పచ్చి బూతులు చాలానే వాడేశారు డైలాగుల్లో. యూత్ ఫుల్ మూవీ అంటే ఇలా బూతులు యథేచ్ఛగా వాడేయడం అనే భ్రమ నుంచి కొంచెం బయటికి వస్తే మంచిదేమో.

బూతుల సంగతి పక్కన పెడితే డైలాగులు ట్రెండీగా ఉండడం.. సన్నివేశాలన్నీ లైట్ హార్టెడ్ స్టయిల్లో ఉండటం వల్ల సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. లీడ్ పెయిర్ హీరో హీరోయిన్లలా కాకుండా మామూలు అబ్బాయి-అమ్మాయిలా కనిపించడం.. వారి క్యారెక్టర్లను కూడా లవబుల్ గా తీర్చిదిద్దడంతో ఈజీగా కనెక్ట్ అవుతాం. ప్రతి సీన్ మామూలుగా అనిపిస్తూనే.. ప్రేక్షకుల ముఖాల్లో ఒక చిరునవ్వును తీసుకొస్తాయి. కథ పరంగా ఆశ్చర్యపరిచేలా ఏమీ జరగదు. హీరోయిన్ని చూసి హీరో తొలి చూపులోనే పడిపోవడం.. హీరోయిన్ అతడి చలాకీ తనానికి ఎట్రాక్ట్ కావడం.. ఇతను ఏదో ఊహించేసుకోవడం.. ఇద్దరి మధ్య చనువు పెరగడం.. ఆపై ప్రపోజ్ చేయడం.. విడిపోవడం.. తిరిగి కలవడం.. ఈ క్రమమంతా వందల కొద్దీ తెలుగు సినిమాల్లో చూసిందే. కాకపోతే తెలిసిన సీన్లలాగే అనిపించినా.. వినోదాన్ని పంచుతాయి. చివరికొచ్చేసరికి ఒక మామూలు లవ్ స్టోరీ చూసినట్లే అనిపిస్తుంది కానీ.. ప్లెజెంట్ ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా రెండున్నర గంటలు టైంపాస్ చేయించే లవ్ స్టోరీ చూడాలనుకుంటే 'ప్రేమలు'పై ఓ లుక్కేయొచ్చు.


నటీనటులు:

'ప్రేమలు'కు ప్రేమజంటే ప్రధాన ఆకర్షణ. అస్లెన్- మామిత బైజు ఇద్దరూ కూడా లవబుల్ గా అనిపిస్తారు. వాళ్ల క్యారెక్టర్లను కూడా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ అనేలా డిజైన్ చేయడంతో చాలా త్వరగా వాళ్లతో కనెక్ట్ అయిపోతాం. పరభాషా నటులు అనే ఫీలింగ్ కూడా కలగదు వాళ్లను చూస్తుంటే. అస్లెన్.. మామిత.. ఇద్దరూ ఎక్కడా నటిస్తున్నట్లు అనిపించదు. సచిన్-రీణు అనే పాత్రల్లో అంత బాగా ఒదిగిపోయారు. హీరో ఫ్రెండు పాత్రలో సంగీత్ ప్రతాప్.. హీరోయిన్ కలీగ్ క్యారెక్టర్లో శ్యామ్ మోహన్ సినిమా అంతటా మంచి వినోదం పంచారు. అఖిల భార్గవన్ అనే అమ్మాయి కూడా ఆకట్టుకుంది. సినిమాలో మిగతా చెప్పుకోదగ్గ పాత్రలేవీ లేవు.


సాంకేతిక వర్గం:

'ప్రేమలు'లో విష్ణు విజయ్ పాటలు కొన్ని వినడానికి బాగున్నాయి కానీ.. లిరిక్స్ మాత్రం అర్థం కాకుండా అయోమయంగా అనిపిస్తాయి. కొన్ని చోట్ల మలయాళ పాటలను అలాగే వదిలేసినట్లున్నారు. తెలుగు పదాల అమరిక కూడా సరిగా లేదు. డైలాగ్స్ మీద పెట్టిన శ్రద్ధ పాటల మీద పెట్టలేదు. విష్ణు విజయ్ నేపథ్య సంగీతం కథకు తగ్గట్లుగా ప్లెజెంట్ గా సాగింది. అజ్మల్ సాబు ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ ను అతను ఉన్నంతలో బాగానే చూపించాడు. 'ఎయిటీస్ మిడిల్ క్లాస్' ఫేమ్ ఆదిత్య హాసన్ ట్రెండీ డైలాగులతో ఇది అనువాద చిత్రం అనే భావన రాకుండా చూశాడు. కానీ అతను మీమ్ లాంగ్వేజ్ విషయంలో కొంచెం నియంత్రించుకోవాల్సింది. పాపులర్ కదా అని చెప్పి పచ్చి బూతులు వాడేశాడు. ఇక స్క్రిప్టు రచయిత.. దర్శకుడు గిరీష్ ఏడీకి యూత్ అభిరుచుల మీద మంచి అవగాహనే ఉంది. ప్రేమజంట మధ్య ఆహ్లాదకరమైన.. సరదా సందర్భాలు సృష్టించి వినోదం పండించాడు. అతడి నరేషన్ మంచి ఫ్లోతో సాగింది.


చివరగా: ప్రేమలు.. టైంపాస్ లవ్ స్టోరీ


రేటింగ్- 2.75/5