పృథ్వీ వివాదం.. పెరుగుతున్న వైసీపీ హెచ్చరికలు!
లైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
By: Tupaki Desk | 12 Feb 2025 5:27 AM GMTలైలా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. "150 మేకలు, 11 మేకలు" అనే కామెంట్స్ అనవసరమైన రాజకీయ చర్చకు దారి తీశాయి. దీంతో వైఎస్సార్‌సీపీ అభిమానులు తీవ్ర ఆగ్రహంతో #BoycottLaila హ్యాష్‌టాగ్‌ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. పృథ్వీ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అధికార పార్టీ వైపుగా ఉన్నారని ఆరోపణలు రావడంతో, ఈ వివాదం మరింత ముదిరింది. అయితే ఈ ట్రోలింగ్ కారణంగా హైబీపీ సమస్య తలెత్తడంతో పృథ్వీ ఆసుపత్రిలో చేరడం కొత్త మలుపు తీసుకుంది.
హాస్పిటల్ బెడ్ నుంచే పృథ్వీ వైసీపీ శ్రేణులపై తీవ్ర స్థాయిలో స్పందించాడు. "సినిమాను సినిమాగా చూడాలి. 11 మేకలు అన్న మాటకు ఇంత అసహనం ఎందుకు? ఎవరైనా 11 అంటే, అది మీకేంటి ప్రాబ్లం? నా తల్లిని, నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ నీచమైన కామెంట్లు చేయడం ఎంతవరకు సమంజసం?" అంటూ నిలదీశాడు. అలాగే, తనపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు ప్రకటించాడు. "లైలా" సినిమాను డ్యామేజ్ చేయాలని చూస్తున్నవారు విఫలమవుతారని, విశ్వక్ సేన్ పెద్ద హిట్ కొట్టబోతున్నాడని ధీమా వ్యక్తం చేశాడు.
ఈ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి కూడా స్పందించారు. "మేము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదు, కానీ మా పార్టీపై జోకులు వేసే ఆర్టిస్టులకు వ్యతిరేకం. మా మీద కామెంట్లు చేసే నటులు ఎవరో, వాళ్లు చేసే సినిమాలు బహిష్కరించాల్సిందే" అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. "టికెట్ కొనుక్కొని మరీ మా మీద జోకులు వేయించుకునేంత పిచ్చిగొర్రెలం కాదు" అంటూ ఘాటుగా స్పందించారు.
అంతేకాదు, వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కూడా పృథ్వీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "తెలుగు సినీ పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నాం. కానీ, పృథ్వీ లాంటి వాళ్లను ప్రోత్సహించడం ఆపాలి. అతనికి ఏ సినిమాలో అవకాశం ఇచ్చినా, ఆ సినిమాను పూర్తిగా బహిష్కరిస్తాం. అలానే, ఆ నిర్మాతలు, ఆ హీరోల సినిమాలను కూడా బాయ్‌కాట్ చేస్తాం" అంటూ హెచ్చరించారు.
మరోవైపు, ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో హీరో విశ్వక్ సేన్ స్పందిస్తూ, "మా సినిమా కోసం చాలా కష్టపడ్డాం. ఎవరో ఒకరు పొరపాటు చేస్తే అందరం బాధితులుగా మారాలా? ఒకరి వ్యాఖ్యల వల్ల మొత్తం టీమ్‌కు నష్టం కలగకూడదు" అంటూ విజ్ఞప్తి చేశాడు. లైలా సినిమాపై నెగెటివిటీ తగ్గించాలని, సినిమాను రాజకీయాలతో ముడిపెట్టొద్దని కోరాడు. ఇక ఫిబ్రవరి 14న ఈ సినిమా విడుదల కానుండగా, దీనిపై ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి.