Begin typing your search above and press return to search.

ఇన్‌స్టాలో ప్రభాస్‌... పేరు ఆయనది, పోస్ట్‌లు వేరే వాళ్లవి!

ఆ పోస్ట్‌లు సైతం ప్రభాస్ కాకుండా ఆయన టీం మెంబర్స్ వేస్తారని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు.

By:  Tupaki Desk   |   4 Feb 2025 6:30 AM GMT
ఇన్‌స్టాలో ప్రభాస్‌... పేరు ఆయనది, పోస్ట్‌లు వేరే వాళ్లవి!
X

సెలబ్రెటీల గురించి తెలుసుకునేందుకు వారి అభిమానులు సోషల్‌ మీడియాను ఆశ్రయిస్తారు. సెలబ్రెటీల అకౌంట్స్‌ను అనుసరించే వారి సంఖ్య లక్షల నుంచి కోట్లలో ఉంటుంది. హీరోలు, హీరోయిన్స్‌ పెట్టే పోస్ట్‌లను బట్టి ఫాలోవర్స్ సంఖ్య ఉంటుంది. హీరోలతో పోల్చితే హీరోయిన్స్‌ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఒక్కో హీరోయిన్‌కి కోట్లలో ఇన్‌స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఉంటారు. హీరోల్లోనూ కొద్ది మందికి కోటి అంతకు మించి ఫాలోవర్స్ ఉంటారు. కోటి అంతకు మించి ఫాలోవర్స్ ఉన్న హీరోల్లో రెబల్‌ స్టార్ ప్రభాస్ ఒకరు. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్‌కి 13 మిలియన్‌ల ఫాలోవర్స్‌ ఉంటారు. ప్రభాస్ నుంచి చాలా రేర్‌గా మాత్రమే పోస్ట్‌లు వస్తూ ఉంటాయి.

సాధారణంగా పెద్దగా పోస్ట్‌లు చేయని ఖాతాలు నెటిజన్స్‌ ఫాలో అయ్యేందుకు ఆసక్తి చూపించరు. కానీ ప్రభాస్‌కి ఉన్న పాన్‌ ఇండియా క్రేజ్ నేపథ్యంలో నెటిజన్స్ ఆయన ఖాతాను భారీ ఎత్తున ఫాలో అవ్వడం మనం చూస్తూ ఉంటాం. రేర్‌గా మాత్రమే ప్రభాస్‌ నుంచి పోస్ట్‌లు వస్తూ ఉంటాయి. ఆ పోస్ట్‌లు సైతం ప్రభాస్ కాకుండా ఆయన టీం మెంబర్స్ వేస్తారని నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్పుకొచ్చారు. సోషల్‌ మీడియా అంటే పెద్దగా నచ్చని వ్యక్తి ప్రభాస్ అని, ఆయనకు ఎప్పుడూ మొబైల్‌కి దూరంగా ఉండాలి అనుకుంటారు. ఆయనకు సంతోషాన్ని ఇచ్చేవి చాలా చిన్న చిన్న విషయాలు. వాటిని వెతుక్కుంటూ ఉంటాడని పృథ్వీరాజ్ సుకుమారన్‌ చెప్పుకొచ్చారు.

ఈ మలయాళ నటుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ప్రభాస్‌ ఎంత పెద్ద గొప్ప స్టార్‌ అయినా చాలా సింపుల్‌గా ఉంటాడు. స్టార్‌డం గురించి ఎప్పుడూ ఆలోచించరు. ప్రభాస్‌ పేరుతో ఉన్న ఇన్‌స్టా గ్రామ్‌ నుంచి వచ్చే పోస్ట్‌లు సైతం ఆయన చేయరు. ఈ మాటలతో ఫ్యాన్స్‌కి నిరాశ కలిగించి ఉంటే క్షమించాలి. ఫామ్ హౌస్‌లో సంతోషంగా గడుపుతూ ఉంటారు. మొబైల్ పని చేయని చోటుకు వెళ్దామని అంటూ ఉంటారు. చాలా మంది మొబైల్‌ లేకుంటే ఉండలేరు. కానీ ప్రభాస్ మాత్రం మొబైల్ లేకుంటే బాగుండు అనుకుంటారు. ఈ కాలంలో అలాంటి వారు ఉండటం చాలా అరుదుగా చూస్తూ ఉంటామని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.

ప్రభాస్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌ తనకు సన్నిహితుడిగా మారాడు అంటూ పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. ప్రభాస్‌తో ఒక్కసారి వర్క్‌ చేస్తే ఎవరైనా ఆయన తీరుకు ఫిదా కావాల్సిందే అని మరోసారి నిరూపితం అయ్యింది. ఎంత పెద్ద స్టార్‌ అయినా, వందల కోట్ల పారితోషికం తీసుకుంటూ ఉన్నా సింపుల్‌గా ఉండే వ్యక్తి ప్రభాస్ అంటూ ఆయనతో వర్క్‌ చేసిన వారు ఎంతో మంది అంటూ ఉంటారు. అది నిజమే అని పృథ్వీరాజ్ తాజా ఇంటర్వ్యూలో మరోసారి చెప్పుకొచ్చారు.