సూపర్ స్టార్ స్పూర్తితోనే ఆ సీన్ ను తీశా
మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసీఫర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.
By: Tupaki Desk | 20 March 2025 12:40 PM ISTమోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన లూసీఫర్ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ సినిమాతో డైరెక్టర్ గా పృథ్వీరాజ్ తన సత్తా ఏంటో చూపించాడు. మోహన్ లాల్ కు కూడా లూసీఫర్ మంచి పేరు తెచ్చిపెట్టింది. కేవలం హిట్ టాక్ మాత్రమే కాకుండా ఆ సినిమా కమర్షియల్ గా కూడా బాగా పే చేసింది.
తెలుగులో అదే సినిమాను మెగాస్టార్ చిరంజీవి హీరోగా నయనతార కీలకపాత్రలో రీమేక్ చేశారు. గాడ్ ఫాదర్ అనే టైటిల్ తో రీమేక్ అయిన ఈ మూవీ తెలుగులో కూడా బాగానే ఆడింది. అయితే ఇప్పుడు లూసీఫర్ కు సీక్వెల్ తెరకెక్కింది. ఎల్2: ఎంపురాన్ టైటిల్ తో రూపొందిన ఈ సినిమా మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ లూసీఫర్ సినిమాలోని ఓ సీన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించారు. లూసీఫర్ సినిమాలో మోహన్ లాల్ ఎంట్రీ సీన్ ఆ సినిమాలోనే హైలైట్ గా నిలిచిందనే విషయం తెలిసిందే.
ఆ సీన్ ను తాను సూపర్ స్టార్ రజినీకాంత్ స్పూర్తితో రాసుకున్నట్టు పృథ్వీరాజ్ తెలిపారు. రజినీకాంత్ గురించి తాను విన్న ఒక కథను స్పూర్తిగా తీసుకుని ఆ సీన్ ను తెరకెక్కించానని పృథ్వీ చెప్పారు. చెన్నైలో రజినీ ఉండే పోయోస్ గార్డెన్ వీధిలో ఎప్పుడూ ఎలాంటి పరిస్థితులుంటాయో ఓ వార్త చదివానని, అది చదివాక దాన్ని బేస్ చేసుకుని లూసీఫర్ లో మోహన్ లాల్ ఎంట్రీ సీన్ ను రాసుకున్నానని, మూవీలో ఆ సీన్ కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు.
అయితే పృథ్వీరాజ్ సూపర్ స్టార్ రజినీకి చాలా పెద్ద ఫ్యాన్ అనే సంగతి సందర్భం వచ్చిన ప్రతీ సారీ చెప్తూనే వస్తున్నారు. ఎల్2: ఎంపురాన్ ట్రైలర్ ను కూడా పృథ్వీరాజ్ ముందుగా రజినీకే చూపించి ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నానని, ట్రైలర్ చూశాక రజినీ చెప్పిన మాటల్ని తానెప్పటికీ మర్చిపోలేనని కూడా ట్వీట్ చేసిన పృథ్వీరాజ్ రజినీని ఎప్పుడెప్పుడు డైరెక్ట్ చేస్తానా అని వెయిట్ చేస్తున్నానని, గతంలో ఓసారి ఆ ఛాన్స్ వచ్చినప్పటికీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదని పృథ్వీరాజ్ అన్నారు.