Begin typing your search above and press return to search.

వివాదంపై దర్శకుడి తల్లి ఆవేదన!

ఇటీవల దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ మీడియా ముందుకు వచ్చినప్పటికీ వివాదంపై స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయన తల్లి మల్లిక ఈ విషయమై స్పందించారు.

By:  Tupaki Desk   |   31 March 2025 8:30 AM
వివాదంపై దర్శకుడి తల్లి ఆవేదన!
X

మలయాళ సూపర్ స్టార్‌ మోహన్‌ లాల్‌ ప్రధాన పాత్రలో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వంలో రూపొంది ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎల్‌ 2 : ఎంపురాన్‌ పై వివాదం రాజుకుంది. చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌పై ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందుత్వంపై పృథ్వీరాజ్ సుకుమారన్‌ విషం కక్కాడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. హిందూ సంఘాల వారు సైతం ఎల్‌ 2 సినిమా విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇన్నాళ్లు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ తనకు హిందువులపై ఉన్న ఆక్రోషంను ఈ సినిమాతో చూపించాడు అంటూ కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా ఎల్‌ 2 సినిమా రాజకీయ వివాదం మొత్తం దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ చుట్టూ తిరుగుతోంది.

హిందు సంఘాలతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు సినిమాలోని హిందుత్వ వ్యతిరేక సన్నివేశాలు తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు, అంతే కాకుండా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ క్షమాపణలు చెప్పాల్సిందే అంటున్నారు. ఇటీవల దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ మీడియా ముందుకు వచ్చినప్పటికీ వివాదంపై స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. కానీ ఆయన తల్లి మల్లిక ఈ విషయమై స్పందించారు. తన కొడుకును ఈ విషయమై బలిపశువును చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమా విషయంలో అందరి బాధ్యత ఉంటుంది. కానీ ఈ వివాదం మాత్రం తన కొడుకు చుట్టూ తిరుగుతుందని మల్లిక సోషల్‌ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.

ఎల్‌ 2 సినిమా వివాదం గురించి మల్లిక సుదీర్ఘంగా పోస్ట్‌ చేశారు... ఎల్‌ 2 : ఎంపురాన్‌ తెర వెనుక ఏం జరిగిందో నాకు పూర్తిగా తెలుసు. ఈ విషయంలో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ను అన్యాయంగా నిందిస్తున్నారు. తప్పుడు వార్తలు చూస్తూ ఉంటే తల్లిగా నా మనసు ఆవేదన చెందుతోంది. ఈ సినిమా విషయంలో మోహన్‌ లాల్‌, నిర్మాతలు ఎవరు కూడా పృథ్వీరాజ్‌ మోసం చేశాడని, తమకు తెలియకుండా ఆ సినిమాలో సన్నివేశాలు తీశాడని, మార్చాడని అనలేదు. సినిమాలో సమస్య ఉంటే ఆ సినిమా కోసం వర్క్‌ చేసిన ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుంది. చిత్రీకరణ సమయంలో అంతా ఉన్నారు, సినిమా షూటింగ్‌ మొదలు పెట్టడానికి ముందు అందరి ఆమోదంతోనే స్క్రిప్ట్‌ను ఫైనల్‌ చేస్తారు. షూటింగ్ సమయంలో ఏమైనా మార్పులు ఉన్నా అందరి ఆమోదంతోనే చేస్తారు.

కానీ ఇప్పుడు నా కొడుకును బలి పశువును చేస్తున్నారు. మొత్తం తప్పు ఒక్కడిదే అంటూ కొందరు చేస్తున్న విమర్శలు తల్లిగా బాధపడేలా ఉన్నాయి. నా కుమారుడు ఈ సినిమాతో ఎవరి యొక్క వ్యక్తిగత మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చింది. ఎల్‌ 2 సినిమాలో విలన్‌ను హిందుత్వ ఉగ్రవాదిగా చూపించడంతో పాటు, జాతీయ స్థాయిలో ముఖ్య నాయకుడిగా ఎదిగినట్లు చూపించారు. అంతే కాకుండా గుజరాత్‌కి చెందిన వ్యక్తిగా చూపించడం రాజకీయంగా చర్చనీయాంశం అయింది. ఒక జాతీయ పార్టీ నాయకుడి కథతో ఆ విలన్ పాత్ర పోలి ఉందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. అందుకే పృథ్వీరాజ్ సుకుమారన్‌ను ఆ పార్టీకి చెందిన వారు తీవ్ర స్థాయిలో విమర్శిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వివాదం ముందు ముందు ఎక్కడికి దారి తీస్తుంది అనేది చూడాలి.