సినీ ఇండస్ట్రీలో రిస్క్, ఫెయిల్యూర్లు ఎక్కువ
ఇదే విషయాన్ని యాక్టర్ కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్తున్నాడు.
By: Tupaki Desk | 26 March 2025 6:42 AMసినీ ఇండస్ట్రీ రంగుల ప్రపంచం. బయట నుంచి చూడ్డానికి మాత్రమే ఎంతో అందంగా కనిపిస్తుంది తప్పించి అందులో ఉంటే కష్టాలు గురించి ఇండస్ట్రీలో ఉండేవారికి, ఇండస్ట్రీకి దగ్గరగా ఉండేవాళ్లకు మాత్రమే తెలుస్తాయి. సినిమా అంటేనే రిస్క్. అది కూడా చిన్న మొత్తంలో కాదు, ఒక్క శుక్రవారం కొన్ని వేల మంది జీవితాల్ని మార్చేస్తుంది.
ఇదే విషయాన్ని యాక్టర్ కం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ చెప్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ ఎప్పుడూ ఒకేలా ఉండదని, సినిమా అంటేనే రిస్క్ అని, ఎప్పుడూ లాభాలు మాత్రమే రావాలంటే కష్టమని, సినీ ఇండస్ట్రీలో రిస్క్ తో పాటూ ఫెయిల్యూర్లు కూడా ఎక్కువ ఉంటాయని ఆయన అన్నారు. అయితే బడ్జెట్ పెరుగుతున్నందుకు ఇలా అయిపోయిందనుకోవడానికి లేదు.
ఇప్పుడు సోషల్ మీడియా, టీవీ ఛానెల్స్ పెరిగిపోయి వెంటనే ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లడం ద్వారా సమాచారం త్వరగా తెలిసిపోతుంది అంతే కానీ గతంలో కూడా ఇండస్ట్రీలో రిస్క్, ఫెయిల్యూర్లు ఇలానే ఉండేవని పృథ్వీరాజ్ తెలిపాడు. 2004లో మలయాళం నుంచి 200 సినిమాలు రిలీజైతే అందులో 24 సినిమాలు మాత్రమే సక్సెస్ అయ్యాయి. మిగిలిన సినిమాలన్నీ ఫ్లాపులుగానే మిగిలాయని ఆయన అన్నాడు.
అంత రిస్క్ ఉన్నప్పటికీ ఎందుకు సినిమాలు తీస్తున్నారంటే దానికి కారణం సక్సెస్ అయిన సినిమాలకు లాభాలు భారీగా రావడమేనని చెప్తున్నాడు మల్టీ టాలెంటెడ్ పృథ్వీరాజ్. పెట్టిన బడ్జెట్ కు 300 నుంచి 400 శాతం వరకు అధికంగా లాభాలొస్తున్నాయని, ఈ విషయమే నిర్మాతలను, ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్ చేస్తుందని, ఇది కూడా ఒక రకమైన గ్యాంబ్లింగ్ లాంటిదే అని పృథ్వీరాజ్ సినీ ఇండస్ట్రీ గురించి అసలైన నిజాలను వెల్లడించాడు.
పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన ఎల్2: ఎంపురాన్ మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓ రేంజ్ లో జరిగాయి. సలార్ సినిమాతో తెలుగు వారికి ఆల్రెడీ బాగా దగ్గరైన పృథ్వీరాజ్ ముందు డైరెక్టర్ గా ఇప్పుడు పెద్ద సవాలే ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం గత వారం పది రోజులుగా మోహన్ లాల్, పృథ్వీరాజ్ అన్ని రాష్ట్రాలు తిరుగుతూ సినిమాను తెగ ప్రమోట్ చేస్తున్నారు. మరి ఎల్2: ఎంపురాన్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.