Begin typing your search above and press return to search.

ప్రియదర్శి ఈసారి 'కోర్ట్' ప్రయోగం.. మోషన్ పోస్టర్ ఎలా ఉందంటే..

నేచురల్ స్టార్ నాని అప్పుడప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు అండగా నిలుస్తూ మంచి కథలను ప్రేక్షకులకు అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు.

By:  Tupaki Desk   |   18 Jan 2025 2:14 PM GMT
ప్రియదర్శి ఈసారి కోర్ట్ ప్రయోగం.. మోషన్ పోస్టర్ ఎలా ఉందంటే..
X

నేచురల్ స్టార్ నాని అప్పుడప్పుడు మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు అండగా నిలుస్తూ మంచి కథలను ప్రేక్షకులకు అందించడంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు సమర్పకుడిగా "కోర్ట్ - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ" అనే న్యూ కోర్ట్ డ్రామాతో ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మొదటి లుక్ విడుదల కాగా, ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచేలా ఉందని చెప్పాలి. న్యాయవ్యవస్థ మీద ప్రత్యేక దృష్టి సారించిన ఈ కథ, సమాజంలోని సమస్యలను స్పృశిస్తూ ముందుకు సాగనుంది.


ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధాన పాత్రలో న్యాయవాదిగా కనిపించబోతున్నారు. మొదటి లుక్ పోస్టర్ చూస్తే న్యాయస్థానంలో న్యాయం కోసం పోరాడే న్యాయవాదిగా ఆయన కనిపిస్తున్నారు. ఆయనతో పాటు యువ జంట హర్ష్ రోషన్, శ్రీదేవి బాధతో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. ఇంతటి సున్నితమైన కథను బయటకు వెల్లడించకుండా, ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించేలా మేకర్స్ ఈ పోస్టర్ డిజైన్ చేశారు.

నాని సోషల్ మీడియాలో మోషన్ పోస్టర్ షేర్ చేస్తూ, "ఈ సినిమా ప్రతి ఒక్కరిని కదిలించగలదు. ఇది మార్చి 14న అందరి మధ్య చర్చనీయాంశంగా మారే చిత్రం అవుతుంది" అంటూ చెప్పుకొచ్చారు. ఇక వీడియో బ్యాక్ గ్రౌండ్ లో డైలాగ్ కూడా ఆకట్టుకుంది. ''నువ్వు మరి నేను అనుకున్నంత ఎద‌వ‌వు ఏం కాదు. అంటే ఎంతో కొంత ఎద‌వ‌నే అంటావు. ఏ కాదా.. స‌ర్లే ఉండు.. నేను వెళ్లాలి.. హలో హలో.. నీ పేరు ఏంటి.. జాబిలి.. మ‌రి నీ పేరు”.. అంటూ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో ఈ వీడియో ప్రారంభమైంది

ఈ కథ ఒక యువకుడు తన మీదపడిన అవాస్తవాల ఉక్కిరి బిక్కిరి నుంచి బయటపడే జర్నీగా ఉంటుందని తెలుస్తోంది. సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై ఈ సినిమా ప్రేరణ కలిగించేలా ఉంటుందనడంలో సందేహం లేదు. ఈ సినిమాలో శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, సుభలేఖ సుధాకర్ వంటి అనుభవజ్ఞులైన నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతికంగా కూడా ఈ చిత్రం అత్యున్నత ప్రమాణాలతో రూపొందుతోంది. సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం, దినేశ్ పురుషోత్తమన్ అందించిన ఛాయాగ్రహణం ఈ సినిమాకు మరింత ఆకర్షణను తెస్తాయి.

ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంట ఈ సినిమాను నిర్మిస్తూ చాలా గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. రామ్ జగదీశ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా సామాజిక సమస్యలను అర్థవంతంగా బిగ్ స్క్రీన్ పై చూపించనున్నట్లు తెలుస్తోంది. మార్చి 14న విడుదల కానున్న ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక కొత్త అనుభవాన్ని అందించడమే కాకుండా, సమాజానికి అవసరమైన సందేశాన్ని కూడా అందించనుందని తెలుస్తోంది.