చిలుకూరు బాలాజీని దర్శించి తీపి కబురు అందుకున్న పీసీ
కొద్దిరోజులుగా నగరంలోనే ఉన్న గ్లోబల్ ఐకాన్ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి, అటుపై కామారెడ్డిలోని మహదేవుని ఆలయాన్ని కూడా సందర్శించింది.
By: Tupaki Desk | 24 Jan 2025 1:34 PM GMTప్రస్తుతం ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో బస చేసిన సంగతి తెలిసిందే. కొద్దిరోజులుగా నగరంలోనే ఉన్న గ్లోబల్ ఐకాన్ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని సందర్శించి, అటుపై కామారెడ్డిలోని మహదేవుని ఆలయాన్ని కూడా సందర్శించింది. వేకువఝామున భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలను పీసీ ఆచరిస్తోంది.
ఇదిలా ఉండగానే ఏ దేవుడు కరుణించాడో తెలీదు కానీ, వేళా విశేషం కలిసొచ్చి ఇప్పుడు ప్రియాంక చోప్రాకు శుభవార్త అందింది. పీసీ నిర్మించిన `అనుజ` అనే చిత్రం ఆస్కార్ 2025లో ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో నామినేషన్ పొందింది. 180 చిత్రాలతో పోటీ పడిన `అనుజ` ఆస్కార్ నామినేషన్స్- 2025 పోటీలో మొదటి ఐదు స్థానాల్లో నిలిచింది. ఏలియన్, ఐయామ్ నాట్ ఎ రోబోట్, ది లాస్ట్ రేంజర్, ఎ మ్యాన్ హూ వుడ్ నాట్ రిమైన్ సైలెంట్ చిత్రాలతో పాటు భారతదేశం నుంచి `అనుజ` నామినేట్ అయింది. ఈ శుభవార్త వినగానే పీసీ అరిచినంత పని చేసింది. ఆనందంగా గర్వంగా కనిపించింది. అందుకు సంబంధించిన పోస్ట్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. మూవీ నుంచి ఒక పోస్టర్, క్లిప్‌ను షేర్ చేస్తూ ``యాయ్! అనుజ.. 2025 ఆస్కార్‌లకు ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌కు నామినీగా వెళుతోంది! ఇన్‌క్రెడిబుల్! అద్భుతమైన గౌరవం ఇచ్చినందుకు అకాడెమీకి ధన్యవాదాలు`` అని క్యాప్షన్‌లో రాశారు.
సలాం బాలక్ ట్రస్ట్ ఇండియా ఈ మూవీని తెరకెక్కించింది. వర్క్ లైఫ్ తో పాటు, పిల్లల జీవితంలో ముఖ్యంగా బాలికలలో విద్య ప్రాముఖ్యతను హైలైట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రమిది. అనుజ బృందానికి అభినందనలు అని పీసీ రాసింది. ఇలాంటి ఉత్తేజకరమైన సాహసోపేతమైన కథను సమర్ధించడం కంటే నాకు గర్వకారణం మరొకటి లేదు అని ప్రియాంక చోప్రా పోస్ట్‌లో రాశారు. ప్రియాంక చోప్రాతో పాటు, రెండుసార్లు ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నిర్మాత గునీత్ మోంగా, మిండీ కాలింగ్ కూడా ఈ చిత్రంతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు.
ఢిల్లీలోని ఒక వస్త్ర కర్మాగారంలో పనిచేసే ప్రతిభావంతురాలైన తొమ్మిదేళ్ల బాలిక కథ అనుజ. చిన్నారికి పాఠశాలకు వెళ్లే అరుదైన అవకాశం లభిస్తుంది. కానీ ఆ చిన్నారి, తన సోదరి పాలక్ భవిష్యత్తును ప్రభావితం చేసే విధంగా కఠినమైన పని కోసం ఉపాధి కోసం వెళ్లాల్సి వస్తుంది. విధి వారితో ఎలా ఆడుకుంది? అన్నదే సినిమా. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది పిల్లలను ప్రభావితం చేసే ఒక గొప్ప అంశాన్ని బయటి ప్రపంచానికి చెప్పే చిత్రమిదని పీసీ అన్నారు. ఇంకా భవిష్యత్తును ఎరుగని, వర్తమానంలో ఎదుర్కొనే కఠిన వాస్తవాన్ని దర్శకులు తెరపై ఆవిష్కరించారని తెలిపారు. సజ్దా పఠాన్, అనన్య షాన్‌బాగ్, నగేష్ భోంస్లే, గుల్షన్ వాలియా తదితరులు ఇందులో నటించారు.