అంచనాలు సంచలనాలయ్యేలా పీసీ మళ్లీ దిగుతోందా!
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత బాలీవుడ్ సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 14 Dec 2024 5:30 PM GMTప్రియాంక చోప్రా హాలీవుడ్ కి వెళ్లిన తర్వాత బాలీవుడ్ సినిమాలకు పూర్తిగా దూరమైన సంగతి తెలిసిందే. నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న తర్వాత న్యూయార్క్ లో కాపురం పెట్టింది. అటుపై బాలీవుడ్ వైపు చూడటమే మానేసింది. ఇంకా చెప్పాలంటే ఇండియా రావడమే రేర్ గా మారింది. ఆ మధ్య సోదరుడి వివాహం నేపథ్యంలో ఇండియాకి వచ్చింది. అదే సమయంలో బాలీవుడ్ లో తాను నిర్మిస్తున్న హిందీ సినిమా పానీ సినిమా పనులు కూడా పనిలో పనిగా చక్కబెట్టి వెళ్లిపోయింది.
బాలీవుడ్ లో పీసీ చివరిగా `ది స్కై ఈజ్ పింక్` సినిమా చేసింది. ఆ తర్వాత మళ్లీ హిందీ సినిమాల వైపు చూసింది లేదు. గత రెండు..మూడేళ్లగా మళ్లీ కంబ్యాక్ అవుతుందనే ప్రచారం జరిగింది గానీ అది ఇంతవరకూ సాధ్యపడలేదు. దీంతో పీసీ ని హిందీ జనాలు కూడా మర్చిపోయారు. ఆమెని హాలీవుడ్ హీరోయిన్ల ఖాతాలో వేసేసారు. అప్పుడప్పుడు ఇన్ స్టా లో పీసీ ఫోటోలు చూసి సంబర పడటం తప్ప! రియల్ ప్రియాంకను ఇక హిందీ తెరపై చూడటం కష్టమేననుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది ఓ హిందీ సినిమా ప్రకటిస్తున్నట్లు తెలిపింది. `భారతీయ సినిమాలు ఎప్పుడూ నా హృదయానికి దగ్గరగానే ఉంటాయి. అందుకే నా అభిమానులతో పాటు నాకు కూడా బాలీవుడ్ కి తిరిగి రావాలని ఆసక్తిగా ఉంది. ప్రస్తుతం ఓ హిందీ సినిమాకు సైన్ చేసే పనిలో ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎక్కువ రోజులు ఎదురు చూడాల్సిన పనిలేదు.
మీ అందరి అంచనాలు మించేలా ఉంటుదీ చిత్రం. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను .18 ఏళ్లకే పరిశ్రమలోకి వచ్చాను. అప్పటి నుంచి ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నా. నటిగా రాణిస్తున్నందుకు గర్వపడుతున్నాను. ఇన్నేళ్ల ప్రయాణంలో ఎన్నో అనుభవాలున్నాయి` అని తెలిపింది.