హైదరాబాద్‌లో ల్యాండ్ అయిన గ్లోబల్ బ్యూటీ.. మహేష్ కోసమేనా?
ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ వచ్చింది. గురువారం ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
By: Tupaki Desk | 17 Jan 2025 6:26 AM GMTసూపర్ స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఓ గ్లోబ్ ట్రాటింగ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 అని పిలుచుకుంటున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం యావత్ సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ప్రియాంక హైదరాబాద్ లో ల్యాండ్ అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ప్రియాంక చోప్రా లాస్ ఏంజిల్స్ నుంచి హైదరాబాద్ వచ్చింది. గురువారం ఆమె శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మహేశ్ బాబు-రాజమౌళి సినిమాలో కథానాయికగా నటించనుందని వార్తలు వస్తున్న తరుణంలో.. ప్రియాంక నగరంలో అడుగుపెట్టడంతో SSMB29 ప్రాజెక్ట్ కోసమే వచ్చి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. తన పాత్రకు సంబంధించిన లుక్ టెస్ట్ లో పాల్గొనేందుకు వచ్చిందేమో అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్ లో కొన్నాళ్ళపాటు స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రియాంకా చోప్రా.. నిక్ జోనాస్ ను పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాలో సెటిల్ అయిపోయింది. అప్పటి నుండి ఎక్కువగా ఇంగ్లీషు సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు 'మహేష్ - రాజమౌళి' మూవీలో నటించడానికి ఓకే చెప్పినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే. ప్రియాంక గతంలో రామ్ చరణ్ సరసన 'తుఫాన్' (జంజీర్) అనే డిజాస్టర్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
RRR వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి చేయబోయే సినిమాపై గ్లోబల్ వైడ్ గా అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగానే SSMB29 చిత్రాన్ని ఇంటర్నేషనల్ మూవీగా తీర్చిదిద్దడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది తన కెరీర్ లోనే భారీ ప్రాజెక్ట్ అవుతుందని దర్శక ధీరుడు ఇదివరకే చెప్పారు. పాపులర్ స్టార్స్, పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ ఈ సినిమాలో భాగం కానున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక చోప్రాని తీసుకున్నారని టాక్. అలానే మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తారని అంటున్నారు. ఇందులో మహేష్ బాబు సైతం మునుపెన్నడూ చూడని న్యూ లుక్ లో కనిపించబోతున్నారు.
మహేష్ బాబుతో కలిసి రాజమౌళి ఈసారి ఓ ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ హై-వోల్టేజ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. దీనికి విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తుండగా.. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ లో కె.ఎల్.నారాయణ ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నిర్మాణంలో భాగం అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నట్లుగా టాక్. ఇటీవలే మేకర్స్ హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాల్ని నిర్వహించారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ కి సంబంధించిన అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.