యువరాజును కనుగొనే వరకూ చాలా కప్పల్ని ముద్దు పెట్టుకోవాలి: పీసీ
తాజాగా ప్రియాంక చోప్రా ప్రఖ్యాత హార్పర్ బజార్ - యుకే ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
By: Tupaki Desk | 5 Feb 2025 3:41 AM GMTగ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా అమెరికన్ గాయకుడు, నటుడు నిక్ జోనాస్ ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. పిసి- నిక్ ఇప్పుడు ఒక ఆడ శిశువుకు తల్లిదండ్రులు. మాల్తీ మేరీ చోప్రా జోనాస్‌ను జనవరి 2022లో సరోగసీ ద్వారా స్వాగతించారు. ఈ జంట అన్యోన్య దాంపత్యం, హ్యాపీ లైఫ్ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. నిక్- ప్రియాంక చోప్రా జంట పెళ్లయిన కొన్ని రోజులకే ఈ జంట విడిపోతున్నారంటూ పుకార్లు సృష్టిస్తూ ప్రముఖ ఆంగ్ల మ్యాగజైన్ తప్పుడు కథనాలు వెలువరించడం అప్పట్లో కలకలం రేపింది. కాలానికి ఎదురీది శత్రువులు, విద్వేషాగ్ని రాజేసేవారిని దూరంగా ఉంచడం ద్వారా ఈ జంట తమ కలల్ని నిజం చేసుకుంటోంది.
తాజాగా ప్రియాంక చోప్రా ప్రఖ్యాత హార్పర్ బజార్ - యుకే ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా తన గత సంబంధాల గురించి పీసీ ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఇంతకుముందు రిలేషన్ షిప్స్‌లో సరైన నిజాయితీ లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని వ్యాఖ్యానించింది. మనం మన రాకుమారుడిని కనుగొనే వరకూ చాలా ``కప్పల్ని ముద్దు పెట్టుకోవాల``ని ఘాటుగా వ్యాఖ్యానించింది.
అయితే ప్రియాంక చోప్రా ఏ హీరోలను ఉద్దేశించి ఈ కామెంట్లు చేసింది! అంటూ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియాంక చోప్రా గతంలో షారూఖ్ ఖాన్ తో `డాన్` చిత్రీకరణ సమయంలో ప్రేమలో పడిందని కథనాలొచ్చాయి. అంతకుముందు డెబ్యూ హీరో హార్మన్ బవేజాతో రెండేళ్ల పాటు డేటింగ్ చేసింది. ఆ తర్వాత ఇద్దరూ బ్రేకప్ అయ్యారు. క్రిష్ చిత్రీకరణ సమయంలో హృతిక్ రోషన్ తోను పీసీ ప్రేమలో పడిందని వార్తలు వచ్చాయి. షాహిద్ కపూర్ తోను ఎఫైర్ సాగించిందని వార్తలు వచ్చాయి. ఇంకా పలువురు హీరోలతో లింకప్ చేసి బాలీవుడ్ మీడియా కథనాలు రాసింది. అయితే పీసీ కప్పలు అని వ్యాఖ్యానించడంతో ఇప్పుడు మరోసారి తన గత ప్రేమాయణాల గురించి అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
ప్రియాంక చోప్రా జోనాస్ - నిక్ జోనాస్ డిసెంబర్ 2018లో వివాహం చేసుకున్నారు. ఇటీవలి ఇంటర్వ్యూలో పీసీ భాగస్వామిలో కోరుకునే ముఖ్య లక్షణాల గురించి మాట్లాడారు. భర్తలో నిజాయితీ, కుటుంబ విలువలు.. ఆశయం ముఖ్యమని పీసీ వ్యాఖ్యానించింది. ఇవన్నీ నిక్ లో చూసానని అంది. ``మిమ్మల్ని గౌరవించే వ్యక్తి కోసం మీరు వెతకాలి. గౌరవం -ప్రేమ, ఆప్యాయతకు భిన్నంగా ఉంటుంది... మీరు మీ యువరాజును కనుగొనే వరకు చాలా కప్పలను ముద్దు పెట్టుకోవాలి`` అని ప్రియాంక చోప్రా ఈ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించింది. కెరీర్ మ్యాటర్ కి వస్తే.. ప్రస్తుతం మహేష్ - రాజమౌళి చిత్రంలో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోందని కథనాలొస్తున్నాయి. దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.