Begin typing your search above and press return to search.

రాధిక 3.0 ఎవరో తేలిపోయింది..!

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.

By:  Tupaki Desk   |   8 July 2024 7:31 AM GMT
రాధిక 3.0 ఎవరో తేలిపోయింది..!
X

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు మరియు టిల్లు స్క్వేర్ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా టిల్లు స్క్వేర్ సినిమాకు వచ్చిన ఆధరణ నేపథ్యంలో వెంటనే మూడో టిల్లు ను కూడా తీసుకు వస్తామని ప్రకటించారు. ఇప్పటికే అందుకు సంబంధించిన వర్క్ షురూ అయ్యిందని సమాచారం అందుతోంది.

టిల్లు క్యూబ్‌ సినిమా కోసం ఇప్పటికే సిద్దు స్క్రిప్ట్‌ వర్క్ మొదలు పెట్టాడు అంటూ ఆయన సన్నిహితులు అంటున్నారు. సిద్దు చిన్న లైన్ తీసుకుని సెట్స్ పైకి వెళ్తాడు. దాన్ని ఆన్ లొకేషన్‌, షూటింగ్‌ సమయంలో డెవలప్ చేస్తూ వెళ్తాడు అంటూ టిల్లుకు వర్క్‌ చేసిన టెక్నీషియన్స్ కొందరు చెప్పుకొచ్చారు.

ఆ విషయం పక్కన పెడితే సిద్దు జొన్నలగడ్డ కి జోడీగా మొదటి టిల్లులో నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. రాధిక గా ఆమె పాత్రకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికి కూడా రాధిక పేరు మారు మ్రోగుతూనే ఉంది. టిల్లు స్క్వేర్‌ లో హీరోయిన్‌ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. లిల్లీ గా ఆమెను చూపించినా కూడా రాధిక 2.0 గా అంతా మాట్లాడుకున్నారు.

ఇప్పుడు టిల్లు క్యూబ్‌ లో రాధిక 3.0 గా ఎవరు నటించబోతున్నారు అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు అమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేశారు అంటూ సమాచారం అందుతోంది.

సిద్దు జొన్నలగడ్డ హీరోయిన్‌ ఎంపిక పర్ఫెక్ట్‌ గా ఉంటుందని గతంలో నిరూపితం అయ్యింది. కనుక ఈసారి కూడా ప్రియాంక జవాల్కర్ ఎంపిక కచ్చితంగా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవడం ఖాయం అన్నట్లుగా టిల్లు ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ తో టాక్సీవాలా సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్ ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే స్టార్స్ కు జోడీగా నటించే అవకాశాలు రాకపోవడంతో కెరీర్ ఖతం అనుకున్నారు. అనూహ్యంగా టిల్లు గాడి లవర్‌ పాత్ర ఈ అమ్మడికి లభించింది. దీంతో ఈ అమ్మడి కెరీర్‌ యూటర్న్‌ తీసుకుంటుందేమో చూడాలి.