Begin typing your search above and press return to search.

రీ రిలీజ్ ట్రెండ్.. మిస్టర్ ప్రెగ్నెంట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్

ఈ విషయంపైనే మిస్టర్ ప్రెగ్నెంట్ నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడారు. రీరిలీజ్ చేసే సమయాలను మార్చుకోవాలని సూచించారు

By:  Tupaki Desk   |   19 Aug 2023 12:27 PM GMT
రీ రిలీజ్ ట్రెండ్.. మిస్టర్ ప్రెగ్నెంట్ నిర్మాత షాకింగ్ కామెంట్స్
X

బిగ్ బాస్‌తో ఫేమ్ యంగ్ హీరో సోహెల్.. వరుసగా సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. చివరగా 'అర్గానిక్ మామ.. హైబ్రిడ్ అల్లుడు' సినిమాతో వచ్చిన ఆయన.. ఈ సారి ప్రయోగాత్మక 'మిస్టర్ ప్రెగ్నెంట్' చిత్రంతో వచ్చారు. ఆగస్ట్ 18న రిలీజైన ఈ చిత్రం పర్వాలేదనిపించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ లో ఈ చిత్ర నిర్మాత అప్పిరెడ్డి కీలక కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల పుట్టినరోజు లేదా ఇతర సందర్భాల్లో వారి పాత్ర చిత్రాలను 4కేకు మారుస్తూ మళ్లీ విడుదల చేస్తున్నారు. వీటికి మంచి రెస్పాన్స్, వసూళ్లు కూడా వస్తున్నాయి. ఈ విషయంపైనే మిస్టర్ ప్రెగ్నెంట్ నిర్మాత అప్పిరెడ్డి మాట్లాడారు. రీరిలీజ్ చేసే సమయాలను మార్చుకోవాలని సూచించారు. లేదంటే చిన్న నిర్మాతలు నష్టపోతారని చెప్పారు.

చిన్న సినిమాలు రిలీజయ్యే రోజు బడా సినిమాలను రీరిలీజ్‌ చేయడం ఆపాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం రోజు కాకుండా నాన్ వీకెండ్స్ సోమ, మంగళ వారాల్లో విడుదల చేసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు. అయితే తాను రీరిలీజ్ లకు వ్యతిరేకం కాదని కూడా చెప్పారు. తన వ్యాఖ్యలను అర్థం చేసుకోవాలని అన్నారు.

చిన్న సినిమాకి వీకెండ్‌ లో థియేటర్స్ దొరకడమే చాలా కష్టమైన రోజులు. అలాంటిది రీరిలీజ్‌లు అంటూ బడా హీరోల పాత సినిమాలు రిలీజ్ చేస్తుంటే మాలాంటి చిన్న నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారు. అలా అని నేనేమి రీరిలీజ్‌ సినిమాలకు వ్యతిరేకిని కాదు.

కానీ చిన్న సినిమాలు రిలీజయ్యే రోజు బడా సినిమాలు చేయొద్దని కోరుకుంటున్నాను.శుక్రవారం రోజు కాకుండా సోమ, మంగళవారాల్లో ఈ విడుదల చేసుకుంటే బాగుంటుంది. చిన్న నిర్మాతలకు ఎటువంటి నష్టం కూడా ఉండదు. ఇదే విషయంపై త్వరలోనే ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌లో కూడా మాట్లాడతాను అని అప్పిరెడ్డి అన్నారు.

ఇకపోతే ఆగస్ట్‌ 18న మిస్టర్‌ ప్రెగ్నెంట్‌ చిత్రం రిలీజైన సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంతో పాటు ఇతర చిన్న చిత్రాలు కూడా ఆడియెన్స్ ముందుకు వచ్చాయి. అయితే ఈ సినిమాలతో పాటు అదే రోజు ప్రభాస్‌ యోగితో పాటు ధనుష్‌ రఘువరన్‌ బీటెక్‌ మళ్లీ థియేటర్స్‌లో రీరిలీజ్ అయ్యాయి.

దీంతో కొత్త సినిమాల కన్నా రిరిలీజైన సినిమాలకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే మిస్టర్ ప్రెగ్నెంట్ నిర్మాత ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు కూడా పలువురు నిర్మాతలు ఇదే విషయాన్ని కూడా చెప్పారు.