Begin typing your search above and press return to search.

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను నిల‌దీసిన న‌ట్టికుమార్

ఇటీవ‌ల ఫ్లాపుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన‌ పంపిణీదారులు, థియేట‌ర్ యజ‌మానుల‌ను కాపాడాల‌ని ఆయ‌న సినీపెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవిని అభ్య‌ర్థించారు.

By:  Tupaki Desk   |   17 Sep 2023 12:14 PM GMT
విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను నిల‌దీసిన న‌ట్టికుమార్
X

పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్ల న‌ష్టాల‌పై వ‌కాల్తా పుచ్చుకున్నారు నిర్మాత కం ఎగ్జిబిట‌ర్ న‌ట్టికుమార్. ఇటీవ‌ల ఫ్లాపుల వ‌ల్ల న‌ష్ట‌పోయిన‌ పంపిణీదారులు, థియేట‌ర్ యజ‌మానుల‌ను కాపాడాల‌ని ఆయ‌న సినీపెద్ద అయిన మెగాస్టార్ చిరంజీవిని అభ్య‌ర్థించారు. ఈ సంద‌ర్భంగా విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ఫ్లాప్ సినిమాల‌పై న‌ట్టి గ‌రంగ‌రం ఇప్పుడు ఇండ‌స్ట్రీలో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. న‌ష్టాల రిక‌వ‌రీ కోసం పంపిణీవ‌ర్గాలు కోర్టుకెక్కుతాయ‌ని కూడా న‌ట్టి ఈ సంద‌ర్భంగా మీడియా ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు.

దేవ‌ర‌కొండ న‌టించిన `ఖుషి` పంపిణీదారులు న‌ష్ట‌పోయారు. న‌ష్ట‌పోయిన పంపిణీదారుల‌కు డ‌బ్బు వెన‌క్కి ఇవ్వండి. లైగ‌ర్- డియ‌ర్ కామ్రేడ్- ఖుషి అన్నీ ఫ్లాపులే. ముందు ఎగ్జిబిట‌ర్లు డిస్ట్రిబ్యూట‌ర్ల‌ను కాపాడుకోండి. వాళ్లు లేక‌పోతే హీరోలు లేనే లేరు.. విజ‌య్ దేవ‌ర‌కొండ దీనిని గ‌మ‌నించి స్పందించాలి... అని నట్టి అన్నారు.

ఓ యూట్యూబ్ చానెల్ ఇంట‌ర్వ్యూలో న‌ట్టి సూటిగా దేవ‌ర‌కొండ‌ను ప్ర‌శ్నించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ ఉన్నాడా లేడా? ఫ్లాప‌య్యాక బాధ్య‌త తీస్కోవ‌లి క‌దా? సినిమాలో న‌టించాడు. మ‌ధ్య‌లో వెళ్లిపోలేదు. రెమ్యున‌రేష‌న్ తీసుకున్నాడా లేదా? అత‌డికే తెలియాలి. లైగర్ దెబ్బ తిన్నందుకు విజ‌య్-పూరి కాంబినేష‌న్ మ‌ళ్లీ సినిమా తీసి డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ఇవ్వొచ్చు క‌దా? న‌ష్టాల రిక‌వ‌రీకి స‌హ‌క‌రించాలి క‌దా? అని కూడా వ్యాఖ్యానించారు.

ఖుషి అవ్వొచ్చు ఇంకోటి అవ్వొచ్చు.. సినిమాలు పోతూనే ఉన్నాయి. పోయిన‌వాళ్లు పోతూనే ఉన్నారు. హీరోగారు న‌ష్ట‌పోయిన డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు తిరిగి వెన‌క్కి ఇవ్వండి. `ఖుషి` విశాఖ‌పట్నం డిస్ట్రిబ్యూట‌ర్ కి మూడు కోట్లు న‌ష్టం వ‌చ్చింది. వారి క‌ష్టం ప‌రిశీలించండి. డిస్ట్రిబ్యూట‌ర్ ఎగ్జిబిట‌ర్లు లేక‌పోతే హీరోలు లేరు. అది గుర్తు పెట్టుకోవాలి. విజ‌య్ దేవ‌ర‌కొండకు చెబుతున్నాను.. అంటూ న‌ట్టి గ‌ళం విప్పారు.

చిరంజీవి గారిని అభ్య‌ర్థిస్తున్నాను. సార్.. మీరు తీసిన సినిమాల‌కు న‌ష్టం వ‌స్తే, తిరిగి డ‌బ్బు వెన‌క్కి ఇచ్చేశారు. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో పంపిణీదారుల‌కు ఎగ్జిబిట‌ర్ల‌కు క‌ష్టం వ‌చ్చింది. ఇది ఇంకా సాగ‌కుండా ఆపాలి. పంపిణీదారులు, ఎగ్జిబిట‌ర్ల న‌ష్టాలను తిరిగి రిక‌వ‌రీ చేసేందుకు మీరు స‌హ‌క‌రించాలి.. అని న‌ట్టి అన్నారు.

అక్కినేని నాగార్జున గారు.. మీ అబ్బాయి మార్కెట్ ఎంతో మీకు తెలుసు.. మార్కెట్ ఎంత ఉందో తెలియ‌కుండా సినిమా చేయ‌డం నిర్మాత‌ల త‌ప్పు. హీరో స్థాయికి త‌గ్గ సినిమాలు తీస్తున్నారా? చాంబ‌ర్ వైస్ ప్రెసిడెంట్ సుప్రియ గారు మీరేం చేస్తున్నారు. డ‌బ్బు పోయిన డిస్ట్రిబ్యూట‌ర్లు అంతా ఏమైపోవాలి? పోయిన‌వాళ్లంతా పోతూనే ఉండాలా? ఇలాంటివి చెప్పడం కూడా చెవిటోడి చెవిలో శంకం ఊదిన‌ట్టేనా? అని కూడా న‌ట్టి కామెంట్ చేసారు.

చాంబ‌ర్ - కౌన్సిల్ ఇలాంటి గొడ‌వ‌ల్ని ఎలా సెటిల్ చేస్తాయి? మీరు చేయ‌లేన‌ప్పుడు కోర్టులున్నాయ్. అక్క‌డ ప‌రిష్కారం దొరుకుతుంది. లైగ‌ర్ కి న‌ష్టాలొచ్చిన‌ప్పుడు ధ‌ర్నా చేసారు. కానీ ఏం చేసారు? అందుకే న్యాయ‌ప‌రిష్కారం కోసం కోర్టుల‌కు వెళితే త‌ప్పు లేదు. కోర్టుకు వెళ్లార‌ని వారిని దూరం పెట్ట‌డం స‌మంజ‌సం కాదు.. అని కూడా న‌ట్టి అన్నారు. సినిమా ఇండ‌స్ట్రీ యూజ్ అండ్ త్రో త‌ర‌హా. వాడుకుని విసిరేస్తారు ఇక్క‌డ‌.. అని కూడా న‌ట్టి వ్యాఖ్యానించారు.

కోర్టుకు వెళుతున్నాం. మేం డ‌బ్బు రిక‌వ‌రీ చేసుకోవ‌డానికి మేం సిద్ధంగా ఉన్నాం. ఒక్కో సినిమా 120 కోట్ల బిజినెస్ చేస్తే హీరో ద‌గ్గ‌ర ఉందా? నిర్మాత లేదా ఇంకా ఎవ‌రి వ‌ద్ద ఉంది ఆ డ‌బ్బు. మేం రిక‌వ‌రీ చేసుకుంటాం. కోర్టుకెళ‌తాం అని కూడా న‌ట్టి కుమార్ అన్నారు.

కేడీపేటకు చెందిన ఒక‌ మాస్టార్ ఒక‌రు `అజ్ఞాత‌వాసి` సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసారు. 5ల‌క్ష‌లు పోయాయి. దాంతో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. నిజానికి హీరో ప‌వ‌న్ క‌ల్యాణ్ డ‌బ్బు వెన‌క్కి ఇచ్చారు. నిర్మాత‌లు హీరోలు ఇస్తున్నారు. కానీ కింది వాళ్ల‌కు అంద‌కుండా మ‌ధ్య‌లో వాళ్లే తిరిగి ఇవ్వ‌డం లేదు. ప‌వ‌న్ ఇచ్చాడు వెన‌క్కి. కానీ ఏం ప్ర‌యోజ‌నం .. అవి చేరాల్సిన చోటికి చేర‌లేదు. గ‌తంలో వివి వినాయ‌క్ కూడా న‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు వెనక్కి ఇచ్చారు. కానీ న‌ష్ట‌పోయిన పంపిణీదారుల వ‌ర‌కూ ఆ ప‌రిహారం వెళ్లిందా అంటే లేదు.. అని కూడా న‌ట్టి అన్నారు.

100 కుటుంబాల‌కు కోటి సాయం:

నైజాంలో అభిషేక్ పిక్చర్స్ పంపిణీ చేసిన `డియర్ కామ్రేడ్` సినిమా నష్టాల గురించి నిర్మాత అభిషేక్ నామా హీరో విజయ్ దేవరకొండకు బహిరంగంగా ట్వీట్ చేయడంతో, హీరో అభిమానులు పంపిణీదారుని తీవ్రంగా ట్రోల్ చేశారు. వాస్తవానికి విజయ్ దేవ‌ర‌కొండ‌ తన రెమ్యునరేషన్ నుండి రూ.1 కోటి అవసరమైన 100 కుటుంబాలకు పంచుతానని ప్రకటించిన తర్వాత ఇది జరిగింది. అభిషేక్ నామా వలె అదే స్టాండ్‌ని తీసుకున్న న‌ట్టి కుమార్ కూడా దేవ‌ర‌కొండ‌పై ఘాటుగా స్పందించారు. ఫ్యాన్స్ ని వ‌దిలేసి, త‌మ సినిమాల వ‌ల్ల న‌ష్ట‌పోయిన డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్ల‌ను ఆదుకోవాల‌ని న‌ట్టి సూచించారు.