పక్క ఇండస్ట్రీలలో కోటాను కోట్లు ఖర్చు చేస్తున్న అగ్ర నిర్మాతలు!
పాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా, ప్రాంతీయత అడ్డంకులు చెరిగిపోయాయి.
By: Tupaki Desk | 3 Dec 2024 4:04 AM GMTపాన్ ఇండియా ట్రెండ్ మొదలైన తర్వాత భాషా, ప్రాంతీయత అడ్డంకులు చెరిగిపోయాయి. భారతీయ చిత్ర పరిశ్రమలో ఒకప్పటిగా సౌత్, నార్త్ అనే తేడాలు ఏమీ లేవు. దక్షిణాది దర్శక హీరోలు హిందీలో సినిమాలు చేస్తుంటే.. హిందీ స్టార్స్, డైరక్టర్స్ సౌత్ ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతున్నారు. ఇటీవల కాలంలో బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ వందల కోట్లు ఖర్చు చేసి మన హీరోలతో సినిమాలు తీస్తున్నారు. మన నిర్మాతలు పర భాషా హీరోలతో మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.
టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ లలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్.. హిందీలో సన్నీడియోల్ తో 'జాట్' అనే సినిమా చేస్తున్నారు. అలానే తమిళ్ లో అజిత్ కుమార్ తో 'గుడ్ బ్యాడీ అగ్లీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కన్నడ హీరో రిషబ్ శెట్టితో 'జై హనుమాన్' సినిమాని ప్రకటించారు. విజయ్ తో 'వారసుడు' మూవీ తీసి కోలీవుడ్ కు వెళ్లిన దిల్ రాజు.. ఆదిత్య రామ్ తో కలిసి ఎస్వీసీ బ్యానర్ లో తమిళ సినిమాలు చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే 'హిట్' మూవీ హిందీ రీమేక్ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
యూవీ క్రియేషన్స్ వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి 'కంగువ' వంటి తమిళ సినిమా నిర్మాణంలో భాగం పంచుకున్న సంగతి తెలిసిందే. 'వాతి'(సార్) వంటి తెలుగు తమిళ బైలింగ్వల్ మూవీ చేసిన సితార ఎంటర్టైన్మెంట్స్ సూర్యదేవర నాగవంశీ.. అల్లు ప్రొడక్షన్స్ తో కలిసి 'అల వైకుంఠపురములో' 'జెర్సీ' వంటి హిందీ రీమేక్స్ చేశారు. గీతా ఆర్ట్స్ అధినేత, సీనియర్ నిర్మాత అల్లు అరవింద్ ఎన్నో ఏళ్లుగా ఇతర భాషల్లోనూ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు.
'ది రాజా సాబ్' మూవీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్.. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో 'కాళీ' అనే బెంగాలీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలానే 'బేబీ' చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నిర్మాత SKN.. అదే సినిమా హిందీలో రీమేక్ తో ఇప్పుడు బాలీవుడ్ లో అడుగుపెడుతున్నారు. 'గూడాచారి 2' లాంటి పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న స్టార్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్.. హిందీలోనూ పలు చిత్రాలను నిర్మిస్తున్నారు.
కన్నడ నిర్మాత విజయ్ కిరగందూర్ తన హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో ప్రభాస్ తో 'సలార్' సినిమా నిర్మించారు. ప్రభాస్ తో మరో మూడు ప్రాజెక్ట్స్ కోసం డీల్ కుదుర్చుకున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ మూవీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 'జవాన్' తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన తమిళ దర్శకుడు అట్లీ.. ఇప్పుడు నిర్మాతగా మారి 'తేరి' హిందీ రీమేక్ గా 'బేబీ జాన్' మూవీని తీస్తున్నారు.
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ టీ-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తెలుగులోనూ సినిమాలు నిర్మిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తో 'స్పిరిట్' మూవీ, అల్లు అర్జున్ తో మరో సినిమా చేయనున్నారు. కరణ్ జోహార్, బోనీ కపూర్ లాంటి బాలీవుడ్ నిర్మాతలు సైతం ఇతర భాషల్లో సినిమాలు రూపొందిస్తున్నారు. వి క్రియేషన్స్ కళైపులి ధాను, లైకా సుభాష్కరన్ లాంటి తమిళ ప్రొడ్యూసర్ కూడా పక్క ఇండస్ట్రీలో సినిమాలు చేస్తున్నారు.
ఇలా అనేక మంది ప్రొడ్యూసర్స్ సొంత ఇండస్ట్రీలలోనే కాకుండా, పొరుగు భాషల్లోనూ మూవీస్ చేస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. ఒక చోట పోగొట్టుకున్న దాన్ని, మరో చోట రాబట్టుకోవాలనే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. వారిలో ఇప్పటికే కొందరు వరుస విజయాలతో పాన్ ఇండియా నిర్మాతలుగా వెలుగొందుతున్నారు.