రీరిలీజ్ ట్రెండ్.. డిస్ట్రిబ్యూటర్లకు ప్రొడ్యూసర్స్ బిగ్ షాక్
ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 20 Aug 2023 7:51 AM GMTప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రాలు బాక్సాఫీసు వద్ద మళ్లీ సందడి చేస్తున్నాయి. 'రీళ్లు'లో సందడి చేసిన చిత్రాను 4కే టెక్నాలజీతో కొత్త అనుభూతి ఇస్తున్నాయి. ఏదైనా సూపర్ హిట్ సినిమాను టీవీలోనో, ఓటీటీలోనో చూసి.. అరే ఈ చిత్రం చాలా బాగుందే థియేటర్లలో చూసి ఉంటే బాగుండేది అనుకునేవారికోసం వీటిని మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఆయా హీరోల పుట్టినరోజు లేదా ఇతర సందర్భాల సమయంలో అభిమానులు ఈ చిత్రాలను రిలీజ్లు చేస్తున్నారు. ఇవి బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఇక్కడి దాకా అంతా బాగుంది కానీ ఇప్పుడీ రీరిలీజ్‌లు ఇండస్ట్రీలో ఓ పెద్ద సమస్యగా మారబోతున్నాయి. వీటి వల్ల లాభాలు ఎలా అయితే ఉన్నాయో నష్టాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు.
ఇప్పటికే పలువురు నిర్మాతలు ఈ రీరిలీజ్‌ల వల్ల నష్టపోతున్నాం అంటూ వాపోతున్నారు. తమ చిన్న చిత్రాలను విడుదల చేసే వీకెండ్లో వాటిని విడుదల చేయడం వల్ల.. ప్రేక్షకులు ఎక్కువగా వాటికే ఆసక్తి చూపిస్తున్నారని తద్వారా తమకు వసూళ్లు రావట్లేదని, నష్టపోతున్నామని చెబుతున్నారు. అయితే ఇది జరుగుతున్న సమయంలో రీరిలీజ్ సినిమా నిర్మాతలు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు. డిమాండ్‌ను క్యాష్‌గా మార్చేందుకు ఇష్టమొచ్చినట్లు రేట్లు పెంచేస్తున్నారట.
పాట సినిమాల రీరిలీజ్ రైట్స్ కొనుగోలు చేయాలనుకుంటున్న డిస్ట్రిబ్యూటర్లకు బిగ్ షాక్ ఇస్తున్నారట. భారీ ధరలు చెబుతున్నారని తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాస్ ఎంబీబీఎస్ సినిమాకు... జెమినీ ఫిల్మ్ సర్యూట్ వారు రూ.2కోట్లు డిమాండ్ చేశారుట. నాగచైతన్య-సమంత 'ఏమాయ చేశావే' ప్రొడ్యూసర్స్ అయితే రూ.1కోటి చెప్పారట. అంటే ఈ లెక్కన ఏమాయ చేశావే సినిమాకు ఎక్స్పెన్సెస్ రీకవర్ అవ్వాలంటే కనీసం రూ.3.5కోట్లు వసూళ్లు అవ్వాలి.
టైర్ -1 స్టార్ హీరోల సినిమాలకైతే ఈ రేట్లు మరింత ఎక్కువ చెబుతున్నారట. డిస్ట్రిబ్యూటర్లు ఇంత రేట్లు చెప్పడం సరికాదని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ సమస్యను నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి సరి చేసుకోవడం మంచిదని బయట నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఈ సమస్య ఎక్కడ వరకు వెళ్తుందో..