'బాయ్స్ హాస్టల్' గోలపొట్టే సాంగ్.. ఎలా ఉందంటే..
తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి 'ప్రొటెస్ట్' అనే సాంగ్ విడుదలైంది.
By: Tupaki Desk | 16 Aug 2023 4:51 PM GMTఒకప్పుడు ఇతర ఇండస్ట్రీ హిట్ సినిమాలను మరో భాషలో రీమేక్ చేసేవారు. ఇప్పటికీ ఆ తంతు కొనసాగుతోంది. అయితే దీంతో పాటే డైరెక్ట్‌గా డబ్బింగ్ సినిమాల రిలీజ్‌ల ట్రెండ్ ఈ మధ్య ఎక్కువైపోయింది. కంటెంట్ ఉంటే చాలు.. డబ్బింగ్గా వచ్చి ఇక్కడ ఆడియెన్స్‌ను అలరిస్తున్నాయి. ముఖ్యంగా కన్నడ సినిమాలకు ఈ మధ్య మరింత క్రేజ్ పెరిగింది. 'కేజీయఫ్', 'చార్లి 777', 'కాంతార' వంటి చిత్రాలు రిలీజై ప్రతి భాషలోను మంచి సక్సెస్‌ను అందుకున్నాయి.
ఇప్పుడు మరో సినిమా రిలీజ్ కాబోతుంది. అదే 'హాస్టల్ హుడుగురు బేకాగిద్దరే'. చిన్న సినిమాగా రిలీజై, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించింది. దీంతో ఈ సినిమా తెలుగులో వస్తుందా? రాదా? అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు యూత్ ఆడియెన్స్. అందుకు తగ్గట్టే.. రీసెంట్గా 'బాయ్స్ హాస్టల్' పేరుతో ఈ సినిమాను తీసుకొస్తున్నట్లు అనౌన్స్ చేశారు. తాజాగా ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి 'ప్రొటెస్ట్' అనే సాంగ్ విడుదలైంది.
ఈ సాంగ్ లిరిక్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, అందులోని సన్నివేశాలు ప్రతీది ఆకట్టుకునేలా ఉన్నాయి. 'ఫిజిక్స్ పేపర్లో కెమిస్ట్రీ రాసేసి.. తలమీద బరువంత దిగిపోద్ది అనుకుంటే.. పాసయ్యే ఆశేమో పచ్చడి లేని దోశాయే' అంటూ సాగిన లిరిక్స్‌ను మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది. హాస్టల్లో ఉన్న విదార్థులంతా సౌకర్యాలు సరిగ్గా లేవంటూ ఫన్నీగా ప్రొటెస్ట్ చేస్తున్నట్లు చూపించారు. ఈ పాటకు లిరిక్స్ భాస్కర భట్ల అందించగా.. సాయి చరణ్ ఆలపించారు. అజనీశ్ లోక్‌నాథ్ అందించిన మ్యూజిక్ హైలైట్.
క్రైమ్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది. నవ్వులు పూయిస్తూనే ఉత్కంఠతో కన్నడ యూత్ ఆడియెన్స్‌ను అలరించింది. కుర్రాళ్ల హాస్టల్ లైఫ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో.. ఓ హాస్టల్ వార్డెన్ అనుమానాస్పద మృతి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇక ఈ చిత్రాన్ని అన్నపూర్ణా స్టూడియోస్, ఛాయ్ బిస్కెట్ సంయుక్తంగా కలిసి ఆగస్టు 26న విడుదల చేస్తున్నాయి.
నితిన్ కృష్ణమూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో మంజునాథ్ నాయక, ప్రజ్వల్, తేజస్ జయన్న, శ్రీవాత్స, తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం కన్నడ యువతను బాగా ఆకట్టుకుంది. ఇంకా ఈ సినిమాలో స్టార్ యాక్టర్స్ రమ్య, రిషబ్ శెట్టి, దర్శకుడు పవన్‌కుమార్ గెస్ట్ రోల్స్‌లో కనిపించి సందడి చేశారు. అజనీష్ లోకనాథ్ స్వరాలు సినిమాకు బాగా హైలైట్‌గా నిలిచాయి.