Begin typing your search above and press return to search.

లైలా.. పొలిటికల్ సెగలు

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు సాధారణంగా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఏర్పాటు చేస్తారు.

By:  Tupaki Desk   |   10 Feb 2025 5:05 AM GMT
లైలా.. పొలిటికల్ సెగలు
X

సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లు సాధారణంగా చిత్రాన్ని ప్రమోట్ చేయడానికి, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచడానికి ఏర్పాటు చేస్తారు. అయితే, కొన్ని సందర్భాల్లో ఈ వేడుకలు అనవసరమైన వివాదాలకు కారణమవుతాయి. తాజాగా లైలా మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు థర్టీ ఇయర్స్ పృధ్వీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. రాజకీయాలు, సెటైర్లు సినిమాలకు మించి ప్రచారంలోకి రావడంతో, ఈ సినిమాకు అప్రయత్నంగా ప్రతికూల ప్రభావం ఏర్పడుతోంది.

లైలా సినిమా ఫంక్షన్‌లో పాల్గొన్న పృధ్వీ, తన ప్రసంగంలో అనుకోకుండా రాజకీయ వ్యాఖ్యలు చేశారు. సినిమా షూటింగ్ మొదలైనప్పుడు 150 గొర్రెలు ఉండేవని, చివరకు 11 మాత్రమే మిగిలాయని చెప్పి, ఇది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలని సెటైరికల్‌గా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు విన్నవారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వ్యంగ్యంగా ఉందని భావించారు. దీంతో ఈ వ్యాఖ్యలు రాజకీయంగా మారిపోయి, సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీశాయి. ఇదే వేడుకలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ "ప్రజారాజ్యం జనసేనగా మారింది" అంటూ ఓ రాజకీయ కోణాన్ని స్పృశించారు. దీంతో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులలో నెగిటివ్ ఇంపాక్ట్ ను క్రియేట్ చేశాయి.

ఇప్పుడు ఈ పరిణామాలు చిత్రబృందానికి తలనొప్పిగా మారాయి. బాయ్‌కాట్ లైలా అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైసీపీ సోషల్ మీడియా వర్గాలు సినిమాను వ్యతిరేకించడం ప్రారంభించాయి. నిర్మాత సాహు గారి తలనొప్పి మొదలైంది. మేము ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా తీస్తే, ఇలాంటి వివాదాలు ఎందుకు? అని ఆందోళన చెందుతున్నారని తెలుస్తోంది. పృధ్వీ వ్యాఖ్యలకు పరిష్కారం కోసం యూనిట్ సీరియస్‌గా చర్చలు జరుపుతోంది.

హీరో విశ్వక్‌సేన్ లేదా దర్శకుడు రామ్ నారాయణ్ ద్వారా వివరణ ఇచ్చించాలా? లేక పృధ్వీ తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇవ్వాలా? అనే అంశంపై టీమ్ తీవ్రంగా ఆలోచిస్తోంది. సాధారణంగా ఇలాంటి వివాదాలను సెట్ చేసేందుకు క్షమాపణలు లేదా వివరణలే సరైన మార్గం. అయితే పృధ్వీ చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడం కష్టమే. ఆయన సాధారణంగా బలమైన అభిప్రాయాలను కలిగి ఉండే వ్యక్తి. అందుకే, యూనిట్ హీరోను రంగంలోకి దింపే అవకాశం కనిపిస్తోంది.

విశ్వక్‌సేన్ లేదా నిర్మాతల ద్వారా ఓ వివరణ వీడియో రిలీజ్ చేయించి, సినిమా అసలు ఉద్దేశ్యం ఏదో చెప్పించాలనే ఆలోచన చేస్తున్నారు. ఇంకా లైలా సినిమాను రాజకీయాలకు దూరంగా ఉంచాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. త్వరలో దీనిపై ఒక అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం యూనిట్ ఒక ప్రెస్‌మీట్ నిర్వహించనుంది. ఈ వివాదంపై క్లారిటీ ఇచ్చి, సినిమా ప్రమోషన్ దారితప్పకుండా చూసేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి, సినిమా విడుదలకు ముందు వచ్చిన ఈ వివాదం ఎలాంటి ప్రభావం చూపుతుందనేది వేచిచూడాల్సిందే.