Begin typing your search above and press return to search.

'గోలీమార్‌' కాంబో క్రేజీ అప్‌డేట్‌!

కానీ ఇద్దరి కాంబోలో సినిమాకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయింది.

By:  Tupaki Desk   |   24 Feb 2025 3:30 PM GMT
గోలీమార్‌ కాంబో క్రేజీ అప్‌డేట్‌!
X

పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఎన్ని ఫ్లాప్స్‌ తీసినా ఆయనకంటూ ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. ఆయన సినిమాలను ఇష్టపడే వారు ఉంటారు. అలాంటి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ ప్రస్తుతం చేయబోతున్న సినిమా ఏంటి అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. డబుల్ ఇస్మార్ట్‌ డిజాస్టర్‌తో పూరి జగన్నాధ్‌ తదుపరి సినిమా విషయంలో చాలా ఆలోచనలు చేసినట్లు తెలుస్తోంది. హిందీలోనూ పూరి సినిమా ఉంటుందనే వార్తలు వచ్చాయి. చివరకు గోపీచంద్‌ హీరోగా పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో సినిమా ఓకే అయింది. ఇప్పటి వరకు అధికారికంగా సినిమా ప్రకటన రాలేదు. కానీ ఇద్దరి కాంబోలో సినిమాకు సంబంధించిన గ్రౌండ్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయింది.

గోపీచంద్‌ సైతం చాలా కాలంగా సక్సెస్‌ కోసం వెయిట్‌ చేస్తున్నాడు. దశాబ్ద కాలంలో గోపీచంద్‌ సినిమాలు థియేటర్‌లో ఎన్నో విడుదల అయ్యాయి. కానీ వాటిల్లో మంచి వసూళ్లు రాబట్టిన సినిమాలు ఎన్ని అంటే మాత్రం చెప్పడం కష్టమే. అలాంటి పరిస్థితుల్లో ఉన్న గోపీచంద్ ప్రస్తుతం పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు కమిట్‌ కావడం చర్చనీయాంశంగా మారింది. వీరిద్దరి కాంబోలో గతంలో 'గోలీమార్‌' అనే సినిమా వచ్చింది. గుడ్డిలో మెల్ల అన్నట్టుగా ఆ సినిమా పర్వాలేదు అన్నట్లుగా నిలిచింది. సినిమా కమర్షియల్‌గా హిట్‌ కాలేదు. అయినా కూడా గోలీమార్ కాంబోకి మంచి డిమాండ్‌ ఉంది. ఇద్దరి కాంబోలో రాబోతున్న సినిమాపై అంచనాలు ఉన్నాయి.

ప్రముఖ నిర్మాత వీరి కాంబో సినిమాను నిర్మించేందుకు రెడీగా ఉన్నారు. త్వరలనే సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు గాను రెడీ అవుతున్నాయి. ఈ సినిమా నిర్మాణంలో పూరి జగన్నాధ్‌, ఛార్మి సైతం భాగస్వామ్యులు కానున్నారనే వార్తలు వస్తున్నాయి. పూరి జగన్నాధ్ తన మార్క్‌తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. గోపీచంద్‌ బాలీలాంగ్వేజ్‌కి తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. పూరి జగన్నాధ్ మార్క్‌ మూవీ మేకింగ్‌కి ఎంతో మంది అభిమానులు ఉంటారు. అలాంటి పూరి జగన్నాధ్‌ ప్రస్తుతం కెరీర్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయనకు ఒక హిట్‌ కావాలి.

లైగర్‌, డబుల్‌ ఇస్మార్ట్‌ సినిమాలు ఆయన స్థాయిని దిగజార్చాయి అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ పూరి అభిమానులు మాత్రం ఇంకా ప్రస్తుత తరం పూరి సినిమాను అర్థం చేసుకోవడం లేదని అంటారు. ఒకప్పుడు పూరి నుంచి వచ్చిన సినిమాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి నేపథ్యంతోనే సినిమాలు వచ్చినా ఇప్పటి ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించడం లేదు. కనుక పూరి తన మార్క్‌ మేకింగ్‌ మార్చుకోకుండా ఈతరం ప్రేక్షకులకు తగ్గట్లుగా సినిమాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.