మొగుడితో కాపురం కంటే దానిపైనే ఇంట్రెస్ట్: పూరీ జగన్నాథ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. అసలు ఏ హీరోతో చేస్తారనే స్పష్టత రావడం లేదు.
By: Tupaki Desk | 31 Dec 2024 11:16 AM GMTటాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంకా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించలేదు. అసలు ఏ హీరోతో చేస్తారనే స్పష్టత రావడం లేదు. అయితే 'పూరి మ్యూజింగ్స్' ద్వారా అభిమానులకు ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటున్నారు పూరీ. యూట్యూబ్ లో పాడ్ కాస్ట్ రూపంలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా 'న్యూ రిజల్యూషన్' టాపిక్ గురించి మాట్లాడారు. సోషల్ మీడియాకు దూరంగా ఉండే జీవితాలు మారిపోతాయని, విడాకులు తగ్గిపోతాయని పేర్కొన్నారు.
"సోషల్ మీడియా అనేది చాలా పవర్ ఫుల్ టూల్. అది వచ్చినప్పుడు కమ్యూనికేషన్ పెరిగిందనుకున్నాం. కానీ రానురానూ అది మన జీవితాల్లో దెయ్యంలా తయారైపోయింది. దీని వల్ల మనుషుల్లో కంపేరిజన్ పెరిగిపోయింది.. షోఆప్ ఎక్కువైపోయింది. మొగుడితో కాపురం కంటే, మొగుడితో అన్యోన్యంగా ఉన్నట్లు ఫోటోలు పోస్ట్ చేయడం మీద ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. కొత్త బట్టలు వేసుకుంటే ఒక ఫోటో తీయాలి.. అది విప్పితే ఇంకో ఫోటో తీయాలి. బాత్ రూమ్ లో ఫోటో.. బెడ్ రూమ్ లో ఫోటో.. తింటున్న ఫోటోని తీసి వీధిలో పెట్టాలి. డిజిటల్ ఎడిక్షన్ పెరిగిపోయింది. దీనికి తోడు ట్రోలర్స్"
"జాబ్ లెస్ పీపుల్ పుష్కలంగా ఉన్నారు మనకి. షోఅప్ వాళ్ళకి నచ్చదు. జలసీ ఫీల్ అవుతారు. వావ్.. ఐ లవ్ మాల్దీవ్స్ అని బికినీతో ఒక ఫోటో పెడతారు. అది చూసి ట్రోలర్స్ కు కాలుతుంది. ఎవడితో తిరుగుతున్నావే అని ఒకడు కామెంట్ పెడతాడు. ఇంకొకడు బూతులు తిడతాడు. అవన్నీ చదువుతూ పనులు మానేసి ఏడుస్తూ పడుకుంటారు. ఎందుకంటే వాళ్ళ లాగే మీరు కూడా జాబ్ లెస్. దీని వల్ల ప్రతి రోజూ మీరు కుంగిపోతూ బతుకుతారు. కేవలం ఈ సోషల్ మీడియా పోస్టుల వల్ల ఎంతోమంది మొగుడు పెళ్ళాల మధ్య గొడవలు అయిపోతున్నాయి. కపుల్స్ మధ్య రిలేషన్స్ దెబ్బ తింటున్నాయి"
"ఈ మధ్య చేసిన సర్వే ప్రకారం చూస్తే 10 డివోర్స్ లో మూడు విడాకులు కేవలం సోషల్ మీడియా మూలంగానే. రోజూ మీ ఇంట్లో జరిగే గొడవలకి సోషల్ మీడియానే కారణం. మీరు రిలేషన్ షిప్ లో ఉన్నా లేదా పెళ్ళై ఉన్నా దయచేసి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. నీ మొగుడే నీకు ప్రపంచం అనుకున్నప్పుడు, మిగతా ప్రపంచం నీకు ఎందుకు?. మీ కుటుంబం బాగుండాలని మీరు కోరుకుంటే, మీ రిలేషన్ బాగుండాలని మీరు అనుకుంటే వెంటనే వీటన్నిటికీ దూరంగా ఉండండి. ప్రతి క్షణం మీ జీవితంలో ఏం జరుగుతుందో లైవ్ టెలికాస్ట్ చేయడం మానేయండి. మీరు హ్యాపీగా ఉన్నా పోస్ట్ పెట్టొద్దు.. ఏడుస్తూ ఉన్నా పోస్ట్ పెట్టొద్దు"
"ముఖ్యంగా అమ్మాయిలు. వాళ్ల ఇన్స్టాగ్రామ్ చెక్ చేస్తే వాళ్లింట్లో ఏం జరుగుతుందో చెప్పేయొచ్చు. ఎవరితో ఏం గొడవ అవుతుందో ఊహించొచ్చు. అత్తతో గొడవైయితే ఒక పోస్టు, మొగుడితో గొడవ అయితే ఇంకో పోస్టు. అది చూసి వెంటనే ఇంకొకతి ఫోన్ చేస్తుంది. 'ఎందుకో తెలియదు అక్కా.. నువ్వు కలలోకి వచ్చావ్. ఇంట్లో అంతా ఓకేగా?' అని. మనకు కావాల్సింది అదేగా. ఏడుస్తూ అన్నీ చెప్పేస్తాం. దానికి కావాల్సింది కూడా అదే. మనకు బుద్ధి లేదు.. సిగ్గు లేదు. కుటుంబ విషయాలు దాచుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా లేదు"
"ఒకటి గుర్తుపెట్టుకోండి.. మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని అట్రాక్ట్ చేస్తున్నట్లే. మీ కుక్క ఫొటో పెడితే.. మీ కుక్క హాస్పిటల్‌లో అడ్మిట్ అవుద్ది. మీ భర్త ఫోటో పెడితే, వాడు మొహం తిరిగి పడిపోతాడు. డైనింగ్ టేబుల్ వద్ద గ్రూప్ ఫొటో పెడితే, ఫుడ్ పాయిజన్ అయి ఎవరో ఒకడు పోతాడు. ఎందుకంటే కొన్ని వేల లక్ష మంది నెగిటివ్ ఎనర్జీ మీకు చేరుతుంది. వాళ్ళ ఏడుపులన్నీ తగిలి మీకు అన్ని దారిద్రాలు చుట్టుకుంటాయి. దయచేసి నెగెటివిటీని అట్రాక్ట్ చేయొద్దు"
"ప్రపంచంలో 5 బిలియన్ పీపుల్ ఈ సోషల్ మీడియాలోనే ఏడుస్తున్నారు. అందులో మన ఇండియా నెం.1 స్థానంలో ఉంది. నా మాట విని ముఖ్యంగా పెళ్లైన వారందరూ ఈ కొత్త సంవత్సరంలో రిజల్యూషన్ తీసుకోండి.. సోషల్ మీడియాకు దూరంగా ఉండండి. మీ ఆలోచనలు మారితే మీ జీవితాలు మారుతాయి.. విడాకులు తగ్గుతాయి. ఈ రోజుల్లో డిజిటల్ డిటాక్స్ చాలా అవసరం. మీరు పెళ్ళి చేసుకున్నా చేసుకోకపోయినా కనీసం ఒక్క నెల అయినా ట్రై చేయండి. మనశ్శాంతి అంటే ఏంటో చూస్తారు" అని పూరీ జగన్నాథ్ చెప్పుకొచ్చారు.