పూరీని విమర్శించిన నెటిజన్‌పై ఫైర్ అయిన యాక్టర్
హిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే డైరెక్టర్లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు.
By: Tupaki Desk | 2 April 2025 9:38 AMహిట్టూ ఫ్లాపుతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళ్లే డైరెక్టర్లలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఒకరు. పూరీ డైరెక్షన్ కు, ఆయన టేకింగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన పూరీ జగన్నాథ్ గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్నారు. పూరీ ఆఖరిగా హిట్ చూసింది ఇస్మార్ట్ శంకర్ సినిమాతోనే.
ఆ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా స్థాయిలో లైగర్ సినిమా చేస్తే అది డిజాస్టర్ అయింది. తర్వాత కొంత గ్యాప్ తీసుకుని ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ చేస్తే అది ఇంకా ఘోరంగా ఫ్లాపైంది. దీంతో పూరీపై ఉన్న నమ్మకం పోయింది. ఇలాంటి టైమ్ లో పూరీ తన తర్వాతి సినిమాను ఎవరితో చేస్తాడా అనుకుంటున్న టైమ్ లో పూరీ అందరికీ షాకిస్తూ విజయ్ సేతుపతితో ప్రాజెక్టును అనౌన్స్ చేశారు.
గత కొన్నాళ్లుగా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వినిపిస్తున్నప్పటికీ అందులో నిజమెంత అని అందరూ లైట్ తీసుకున్నారు. అయితే పూరీ అందరికీ షాకిస్తూ ఉగాది రోజున ఈ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ లో ఛార్మీ, పూరీ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. విలన్ గా, హీరోగా, సపోర్టింగ్ ఆర్టిస్టు గా పలు భాషల్లో పేరు తెచ్చుకున్న విజయ్ సేతుపతి లాంటి నటుడితో పూరీ సినిమాను అనౌన్స్ చేసి అందరితో క్రేజీ కాంబినేషన్ అనిపించుకుంటున్నారు.
పూరీ తో విజయ్ సేతుపతి సినిమా చేస్తున్న విషయాన్ని పలువురు నెటిజన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. పూరీ అవుట్‌డేటెడ్ అయ్యారని, మహారాజా లాంటి సూపర్ హిట్ తర్వాత పూరీ డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఎలా ఒప్పుకున్నారని సేతుపతిని అడుగుతూ పూరీని విమర్శిస్తూ ఓ నెటిజన్ పోస్ట్ పెట్టగా, ఆ పోస్టుకు యాక్టర్ శాంతను భాగ్యరాజ్ స్పందించారు.
ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తుల గురించి అలా మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు సరైన పదాలు వాడటం నేర్చుకోవాలని, పూరీ ఓ ఫేమస్ డైరెక్టర్. ఆయనకు గౌరవం ఇవ్వడం నేర్చుకోమని శాంతను పోస్ట్ చేయడంతో ఆ నెటిజన్ సారీ చెప్పి పూరీని విమర్శిస్తూ చేసిన పోస్ట్ ను తన సోషల్ మీడియా నుంచి డిలీట్ చేశాడు. ఇదిలా ఉంటే పూరీ జగన్నాథ్- విజయ్ సేతుపతి కాంబినేషన్ లో రానున్న సినిమా ఈ ఏడాది జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని, ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది.