విజయేంద్రుడి ఫోన్ కాల్‌తో పూరి జాగ్రత్త పడ్డాడట
పూరి మాట్లాడుతూ-''నా గత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి కాల్ వచ్చింది.
By: Tupaki Desk | 12 Aug 2024 6:12 AM GMTవిజయేంద్ర ప్రసాద్ పరిచయం అవసరం లేదు. ఆయన స్టార్ రైటర్. బాహుబలి- బాహుబలి 2, భజరంగి భాయిజాన్, మణికర్ణిక, తలైవి, ఆర్.ఆర్.ఆర్ వంటి చిత్రాలకు రచయితగా పని చేసారు. టాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్ హిట్స్ వెనక ఆయన పనితనం దాగి ఉంది. రాజమౌళి అన్ని సినిమాలకు ఆయనే కథలు అందిస్తున్నారు. తదుపరి మహేష్ బాబు- రాజమౌళి సినిమాకి స్క్రిప్టు అందించినది ఆయనే.
అయితే అంత గొప్ప రచయిత తనకు నేరుగా ఫోన్ చేసి సెట్స్ కెళ్లే ముందే స్క్రిప్టును తనకు వినిపించాల్సిందిగా పూరీని కోరారట. దర్శకుడు పూరి జగన్నాథ్ ఈ విషయాన్ని డబుల్ ఇస్మార్ట్ ప్రీరిలీజ్ ఈవెంట్లో చెప్పుకొచ్చారు. పూరి మాట్లాడుతూ-''నా గత సినిమా ఫ్లాప్ అయిన తర్వాత నాకు రచయిత విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి కాల్ వచ్చింది. ప్రాజెక్ట్ ప్రారంభించే ముందు నా తదుపరి కథను తనతో షేర్ చేయమని అడిగారు. మీలాంటి దర్శకులు విఫలమవడాన్ని నేను భరించలేను. మీరు చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు.. కాబట్టి మీరు ఏదైనా కథతో కొనసాగే ముందు నాకు తెలియజేయండి.. అని అన్నారు. ఇది విన్న నేను చాలా ఎమోషనల్ అయ్యాను'' అని అన్నారు. ఆ తర్వాత కథను ఆయనతో పంచుకోకపోయినా.. ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాను... అని పూరి జగన్నాథ్ అన్నారు. అయితే విజయేంద్రుడి కాల్ వచ్చాక.. పూరి అలెర్ట్ అయ్యి తీసారు గనుక డబుల్ ఇస్మార్ట్ నుంచి చాలా ఆశించవచ్చన్నమాట.
రామ్ పోతినేని- పూరీ జగన్నాధ్ ల డబుల్ ఇస్మార్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్‌లో ఘనంగా జరిగింది. ఇప్పటికే ట్రైలర్ చక్కని ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. రామ్ - సంజూ మధ్య సన్నివేశాల్లో హై ఎనర్జీతో అలరించనున్నాయి. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం అందించారు. పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 15న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.