Begin typing your search above and press return to search.

పూరీ జగన్నాథ్.. ఇక మారాల్సిందేనా?

కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న పూరీ.. కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Sep 2024 11:21 AM GMT
పూరీ జగన్నాథ్.. ఇక మారాల్సిందేనా?
X

టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కు ఎలాంటి గుర్తింపు ఉందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు తెలుగు స్టార్ హీరోలు అందరూ.. ఆయనతో కచ్చితంగా సినిమా చేయాలని అనుకునేవారు. బద్రీ, ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, పోకిరి, దేశముదురు, చిరుత, టెంపర్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ను ఆయన అందించారు. మూవీలో హీరోయిజాన్ని వేరే లెవెల్ లో చూపించే అతి తక్కువ మంది దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. స్క్రిప్ట్ వర్క్ స్పీడ్ గా పూర్తి చేసి.. జెట్ స్పీడ్ లో షూటింగ్ కంప్లీట్ చేయడంలో తన స్టైలే వేరని అనేక సార్లు ప్రూవ్ చేశారు.

కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకున్న పూరీ.. కొన్నేళ్లుగా వరుసగా ఫ్లాపులు ఎదుర్కొంటున్నారు. భారీ అంచనాల మధ్య మూవీస్ రిలీజ్ అవుతున్నా.. డిజాస్టర్లుగా మారుతున్నాయి. టెంపర్ తర్వాత పూరీ చేసిన సినిమాల్లో ఇస్మార్ట్ శంకర్ తప్ప మిగతావన్నీ కమర్షియల్ గా అస్సలు క్లిక్ అవ్వలేదు. ఇస్మార్ట్ తర్వాత లైగర్ మూవీ తీసిన ఆయన.. దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నారు. విపరీతమైన ట్రోల్స్ ఎదుర్కొన్నారు. దీంతో రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ మూవీతో ఆయన హిట్ ట్రాక్ ఎక్కుతారని అంతా అంచనా వేశారు.

భారీ అంచనాలతో విడుదలైన ఆ మూవీ.. బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. దీంతో పూరీకి మళ్లీ నిరాశే ఎదురైంది. మూవీలో పూరీ మార్క్ మిస్ అయిందని అనేక మంది రివ్యూస్ ఇచ్చారు. అయితే ఆయన నెక్స్ట్ మూవీ ఏంటన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. పలు రూమర్స్ వినిపిస్తున్నా.. ఎలాంటి అనౌన్స్మెంట్ రావడం లేదు. కింగ్ నాగార్జునతో సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి. స్క్రిప్ట్ రెడీ చేసి.. నాగ్ ను ఒప్పించాలని ఆయన ట్రై చేస్తున్నారట.

అయితే నేడు పూరీ బర్త్ డే.. దీంతో ఆయనకు అనేక మంది సెలబ్రిటీలు, అభిమానులు, వెల్ విషర్స్.. పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. మంచి హిట్ అందుకుని కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిస్తున్నారు. నేడు ఏదో ఒక మూవీ అప్డేట్ వస్తుందని ఎక్సపెక్ట్ చేశామని.. కానీ రాలేదని అంటున్నారు. ఆయనలో మంచి రైటర్ ఉన్నాడని.. ఒకప్పుడు పూరీని చూసి అనేక మంది కథలు రాసుకోవడం మొదలుపెట్టారని చెబుతున్నారు. కానీ ఇప్పుడు మూవీని సినీ ప్రియులు ఆదరించే తీరు మారిందని అంటున్నారు.

అందుకే ఇప్పుడు తన రైటింగ్ కు పదును పెట్టాలని.. సరికొత్త స్టోరీస్ రాసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు తన మార్క్ డైలాగ్స్ తో ఎలా మెప్పించారో.. ఇప్పుడు అంతకుమించి తన టాలెంట్ చూపించాలని కోరుతున్నారు. ఒక మంచి హిట్ పడితే చాలు.. పూరీ మళ్ళీ వరుస సినిమాలతో అలరిస్తారని చెబుతున్నారు. ఆయన నుంచి బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆశిస్తున్నట్లు కామెంట్స్ పెడుతున్నారు. కొత్తగా అలోచించి అప్ కమింగ్ చిత్రాలపై దృష్టి పెట్టాలని అంటున్నారు. ఏదేమైనా హ్యాపీ బర్త్ డే పూరీ జగన్నాథ్. సూపర్ హిట్ తో కమ్ బ్యాక్ ఇవ్వండి!!