పూరి మార్పుకి అవకాశం ఉందా? లేదా?
పూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన 'డబుల్ ఇస్మార్ట్' పై టాక్ ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇస్మార్ట్ శంకర్ నే మళ్లీ తిప్పి తీసినట్లు ఉందని పీడ్ బ్యాక్ వచ్చేసింది
By: Tupaki Desk | 17 Aug 2024 9:30 PM GMTపూరి జగన్నాధ్ దర్శకత్వం వహించిన 'డబుల్ ఇస్మార్ట్' పై టాక్ ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇస్మార్ట్ శంకర్ నే మళ్లీ తిప్పి తీసినట్లు ఉందని పీడ్ బ్యాక్ వచ్చేసింది. దీంతో పూరి మారాలి అంటూ విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. ఒకప్పుడు పూరి ఏమైయ్యాడు? ఇతను పాత పూరి కాదు..కొత్త పూరి అంటూ విమర్శకులు ఎక్కు పెడుతున్నారు. మాకు పాత పూరి కావాలని అభిమానుల నుంచి స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ వరకూ అంతా ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ కి ముందు కొరున్నారు.
అందుకు తగ్గట్టే పూరి కూడా ఈ సినిమాని మూడు నెలల్లో చుట్టకుండా చాలా సమయం తీసుకునే చేసాడు. హిట్ అనివార్యమైన సందర్భం కావడంతో ఇకపై కొత్త పూరిని చూస్తారని పూరి సైతం ఒకానొక సందర్భంలో ధీమా వ్యక్తం చేసాడు. దీంతో ఎదురైన వైఫల్యాలు....పరాభవాలు చూసి పూరి కూడా డబుల్ ఇస్మార్ట్ కి కసిగానే చేసాడని అంతా భావించారు. కానీ ఆ అంచనాలు తప్పు అయినట్లే కనిపిస్తుంది. సినిమాకొచ్చిన రివ్యూలు గానీ..ఫీడ్ బ్యాక్ గానీ చూస్తే సంగతేంటి? అన్నది అర్దం అవుతుంది. ఇదంతా తాజా గతం.
మరి ఇకపైనైనా పూరిలో మార్పు వస్తుందా? అందుకు అవకాశం ఉందా? అంటే ఓసారి వెనక్కి వెళ్లాల్సిందే. 'టెంపర్' తర్వాత పూరికి సరైన హిట్ పడలేదు. ఆ కథ కూడా పూరి సొంతది కాదు. వక్కంతం వంశీతో కలిసి పనిచేయడంతో ఆ హిట్ దక్కింది. ఇంకా చెప్పాలంటే పూరి 'బిజినెస్ మెన్' తర్వాత సరైన హిట్ ఒకటీ లేదనే చెప్పాలి.
'దేవుడు చేసిన మనుషులు', 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' ,' ఇద్దరమ్మాయిలతో', 'హార్ట్ ఎటాక్' ఇవేవి పూరి మార్క్ విజయాలు కాదు. ఒకటి రెండు యావరేజ్ తప్ప మిగిలినవి చతికిల పడ్డ సినిమాలే. 'టెంపర్' తర్వాత చేసిన 'లోఫర్', 'ఇజం',' రోగ్', 'పైసా వసూల్', 'మెహబూబా' చిత్రాలేవి సరిగ్గా ఆడలేదు. 'ఇస్మార్ట్ శంకర్' తో ఫాంలోకి వచ్చినా? 'లైగర్' సహా తాజా సినిమా పరిస్థితి తెలిసిందే. అయితే ఈ కథలేవి కొత్తవి కాదు. పూరి పాత ఆలోచనల్నే ఆవిష్కరించే ప్రయత్నమే జరిగింది. మరి వాటి ఫలితాలు ఆధారంగా చేసుకుని చూస్తే పూరి పూర్తిగా స్టోరీల పరంగా ట్రెండ్ మార్చాల్సిందే. పూరిదంతా ఓల్డ్ ట్రెండ్ అన్నది ప్రధానంగా వినిపిస్తోన్న విమర్శ.