పుష్ప-2’ బీజీఎం.. ఇంకా అయోమయమే
రిలీజ్ ముంగిట పుష్ప-2 టీంతో పాటు సోషల్ మీడియాను కుదిపేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.
By: Tupaki Desk | 3 Dec 2024 8:30 PM GMTపుష్ప-2 సినిమా విడుదలకు మధ్యలో ఒక్క రోజే విరామం ఉంది. నిజానికి రిలీజ్ గురువారం అయినా.. బుధవారం రాత్రి 9.30కే స్పెషల్ ప్రిమియర్స్ పడిపోతున్నాయి. ఐతే రిలీజ్ ఇంత దగ్గర పడ్డా కూడా ఇంకా ఓ విషయంలో క్లారిటీ రావట్లేదు. రిలీజ్ ముంగిట పుష్ప-2 టీంతో పాటు సోషల్ మీడియాను కుదిపేసిన బ్యాగ్రౌండ్ స్కోర్ గొడవ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ పనితనం నచ్చక ఈ సినిమాలో కొన్ని ఎపిసోడ్లకు బ్యాగ్రౌండ్ స్కోర్ అందించే బాధ్యతను సుకుమార్ తమన్, అజనీష్ లోక్‌నాథ్, సామ్ సీఎస్‌లకు అప్పగించడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
ఈ విషయంలో దేవిశ్రీ ఎంత ఫీలయ్యాడో ఈ మధ్య చెన్నైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్లోనే స్పష్టమైంది. ఐతే సుక్కు తీసుకున్న నిర్ణయంతో దేవి చాలా కసిగా పని చేసి కొన్ని ఎపిసోడ్లను వేరే లెవెల్‌కు తీసుకెళ్లేలా బీజీఎం చేసి ఇచ్చాడన్నది టాక్.
మరోవైపు టీం ఎంచుకున్న ముగ్గురు సంగీత దర్శకులు కూడా వాళ్ల పని వాళ్లు చేశారు. ఐతే రిలీజ్ దగ్గర పడేసరికి తమన్, అజనీష్‌ల గురించి ఎక్కడా డిస్కషనే లేదు. తమన్ వర్క్‌ను పూర్తిగా పక్కన పెట్టేసినట్లు తెలుస్తోంది. అజనీష్ వర్క్ కొంత బాగానే ఉన్నా.. దాన్ని సినిమాలో వాడడం కొంచెం ఇబ్బందికరంగానే ఉందట. మెజారిటీ పోర్షన్లకు దేవి బీజీఎంనే వాడుకున్నట్లు తెలుస్తోంది.
ఐతే సామ్ సీఎస్ కూడా తనకు అప్పగించిన ఎపిసోడ్లకు అదిరిపోయే స్కోర్ ఇచ్చినట్లు సమాచారం. ఐతే సినిమాలో తన వర్క్ ఎంత మేర ఉంటుందో అతడికీ క్లారిటీ లేనట్లే కనిపిస్తోంది. రిలీజ్ ముంగిట అతను పెట్టిన ఒక పోస్టులో క్లైమాక్స్ ఎపిసోడ్‌కు తనే స్కోర్ అందించినట్లు పేర్కొన్నాడు.
కానీ సోమవారం రాత్రి జరిగిన ప్రి రిలీజ్ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ.. క్లైమాక్స్‌కు దేవి అదిరిపోయే స్కోర్ ఇచ్చాడని వ్యాఖ్యానించాడు. దీంతో సామ్ పాత పోస్టును డెలీట్ చేసి క్లైమాక్స్, ఫైట్ సీన్లకు పని చేయడం తనకెంతో ఆనందాన్నిచ్చిందంటూ మరో పోస్టు పెట్టాడు. దీంతో సుకుమార్ ఎవరి ఎక్కడ స్కోర్‌ను వాడాడు.. ఎవరికి ఏం చెప్పాడు.. అన్నది స్పష్టత లేకుండా ఉంది. రేప్పొద్దున సినిమా చూశాక కానీ ఈ సంగీత దర్శకులకు కూడా తమ వర్క్‌లో ఎంతమేర వాడుకున్నది క్లారిటీ రాదేమో.