Begin typing your search above and press return to search.

ఇండస్ట్రీ 'పెద్ద' రంగంలోకి దిగాల్సిందేనా?

దాసరి నారాయణరావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి.. ఇప్పుడు కూడా ఆయనే రంగంలోకి దిగాలని అభిప్రాయపడుతున్నారు.

By:  Tupaki Desk   |   23 Dec 2024 10:50 AM GMT
ఇండస్ట్రీ పెద్ద రంగంలోకి దిగాల్సిందేనా?
X

సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటన.. దాని తదనంతర పరిణామాలు ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్‌ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడంతో, అక్కడికి వెళ్లిన హీరో అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. బన్నీ ఇప్పటికే అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి. ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలోనే ఈ కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేయడంతో, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నట్లు అర్థమైంది. ఇది ఇండస్ట్రీ మొత్తం మీద ప్రభావం చూపించేలా కనిపిస్తోంది.

ఒక్క రోజు పోలీస్ స్టేషన్ కు వెళ్లొచ్చిన వ్యక్తి ఇంటిముందు సినీ ప్రముఖులు అందరూ క్యూ కట్టారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆ హీరోకు కాళ్లు చేతులు పోయినట్టు కన్నీళ్లు కారుస్తూ, అతడిని పరామర్శిస్తున్నారు.. తనని తిడుతున్నారని అన్నారు. అతనికి కాలు పోయిందా? కన్ను పోయిందా? చేయి పోయిందా? కిడ్నీలు దెబ్బ తిన్నాయా?.. అసలు ఇంతమంది సినీ ప్రముఖులు ఎందుకు పరామర్శించారు? హాస్పిటల్ లో ఉన్న బాలుడిని ఎందుకు పరామర్శించలేదు? అని ప్రశ్నించారు. వ్యాపారాలు చేసుకోండి.. సినిమాలు తీసుకోండి.. డబ్బులు చేసుకోండి.. ప్రభుత్వం నుంచి ప్రత్యేక రాయతీలు తీసుకుండి.. కానీ ప్రాణాలు తీసే హక్కు ప్రభుత్వం ఇవ్వదని అన్నారు. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రకటించారు.

ఇదే క్రమంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి తాను బాధ్యతారాహిత్యంగా వ్యవహరించలేదని వివరణ ఇచ్చారు. అసత్య ఆరోపణలు చేస్తున్నారని, తన క్యారక్టర్ ను దెబ్బతీసేలా మాట్లాడటం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేసారు. దీంతో మంత్రులు, పోలీసు అధికారులు రంగంలోకి దిగిపోయారు. అల్లు అర్జున్ సీఎంకు వెంటనే క్షమాపణలు చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేసారు. సెలబ్రిటీల ప్రైవేట్ సెక్యూరిటీ, బౌన్సర్లు పబ్లిక్‌ను ఇబ్బంది పెడితే తాటతీస్తామని సీపీ సీవీ ఆనంద్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఆ వెంటనే ఓయూ జేఏసీ పేరుతో కొందరు వ్యక్తులు అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ళ దాడి చేశారు.

పైఅధికారుల అనుమతి తీసుకొని ప్రెస్ మీట్ పెట్టారో లేదో తెలియదు కానీ.. ప్రెస్ క్లబ్ లో ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఈ క్రమంలో ప్రజల్లోకి తీసుకెళ్లి సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేసారు. అప్పట్లో రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ది కావాలని మీకు భూములు ఇచ్చారని.. వాపు చూసి బలం అనుకోవద్దని, జూబ్లీహిల్స్ ఏరియాలో మీరు ఉన్నదే లీజు జాగాలో అంటూ మొత్తం సినీ ఇండస్ట్రీని లాగారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఏమైనా దేవుళ్లా? ప్రజల కోసం ఏం చేస్తున్నారు, సమాజం కోసం ఏం చేస్తున్నారు? అని సీఎం అనుచరుడు, 'తిక్క' నిర్మాత రోహిన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఇలా ఈ వ్యవహారం అటు తిరిగి, ఇటు తిరిగి టాలీవుడ్ మొత్తానికి చుట్టుకునేలా కనిపిస్తోంది. ఇదిలానే కొనసాగితే ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి నష్టమే. ఈ నేపథ్యంలో 'ఇండస్ట్రీ పెద్దలు' కలుగజేసుకొని వివాదం సర్దిమణిగేలా చేయాలనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి సంధి కుదిర్చే ప్రయత్నం చేయాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు. గతంలో ఇండస్ట్రీ అభివృద్ధి, టికెట్ రేట్ల కోసం ఏపీ ప్రభుత్వంతో మాట్లాడినట్లే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలని ఆశిస్తున్నారు. దాసరి నారాయణరావు తర్వాత మెగాస్టార్ చిరంజీవి చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో ముందుండి నడిపిస్తున్నారు కాబట్టి.. ఇప్పుడు కూడా ఆయనే రంగంలోకి దిగాలని అభిప్రాయపడుతున్నారు.

ఎలాగూ నిర్మాత దిల్ రాజు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌ గా ఉన్నారు కనుక, ఆయన ద్వారా సీఎంతో సమావేశమై సమస్యను పరిష్కరించుకుంటే అంతా సర్దుమణుగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే ఇండస్ట్రీ తరపున ముఖ్యమంత్రిని కలిసేందుకు సమాయత్తమవుతున్నారనే టాక్ వినిపిస్తోంది. 'గేమ్ ఛేంజర్' ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన దిల్ రాజు, తిరిగొచ్చిన వెంటనే ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.