Begin typing your search above and press return to search.

పుష్ప 2 సెన్సార్ రిపోర్ట్.. కత్తెర పడింది!

సెకండ్ హాఫ్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో కొన్ని షాట్స్ ను కట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 Nov 2024 4:54 PM GMT
పుష్ప 2 సెన్సార్ రిపోర్ట్.. కత్తెర పడింది!
X

ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టి పుష్ప 2: ది రూల్ మీదే ఉంది. డిసెంబర్ 5న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయబోతోంది. అల్లు అర్జున్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదలకు కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉండగా, ప్రచార కార్యక్రమాలు, ప్రీ-సేల్స్ దుమ్ము రేపుతున్నాయి. పుష్ప మేనియా మరింత పుంజుకుంటోంది.

రీసెంట్ గానే సినిమా షూటింగ్ కు ఫ్యాకప్ చెప్పారు. అలాగే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా షూటింగ్ తో పాటు ఫినిష్ చేస్తూ వచ్చారు. ఇక విడుదలకు సమయం దగ్గరపడుతున్న క్రమంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ లభించింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కలిసి చూసే విధంగా యాక్షన్ డ్రామా సినిమాను సెట్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే, సెన్సార్ బోర్డు సూచనల ప్రకారం కొన్ని సన్నివేశాలకు కత్తెర పడినట్లు సమాచారం. సెకండ్ హాఫ్ లో ఒక హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ లో కొన్ని షాట్స్ ను కట్ చేయాల్సిందిగా సెన్సార్ బోర్డు సూచించినట్లు తెలుస్తోంది. ఇక సినిమా మొత్తం నిడివి 3 గంటలు 21 నిమిషాలు ఉందట. అందులో టైటిల్ క్రెడిట్స్ కోసమే 5 నిమిషాల టైమ్ తీసుకున్నట్లు సమాచారం. ఇక పుష్ప: ది రైజ్ కూడా U/A సర్టిఫికేట్ తోనే విడుదలై, ఘన విజయం సాధించింది.

ఇక సినిమాకు సంబంధించిన ప్రీ బుకింగ్ వివరాలు మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. నవంబర్ 25 నాటికి నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోల కోసం $1.478 మిలియన్ డాలర్ల ఆదాయం మాత్రమే ప్రీ సేల్స్ ద్వారా సాధించింది. 3519 షోల ద్వారా ఈ మొత్తం సేకరించబడింది. వారాంతంలో నార్త్ అమెరికా ప్రీ సేల్స్ మొత్తం $2 మిలియన్‌కు పైగా ఉండే అవకాశం ఉంది. ఇది పుష్ప 2 మీద ఏ స్థాయిలో హైప్ ఉందో చూపిస్తోంది.

భారతదేశం లో ప్రీ బుకింగ్స్ నవంబర్ 30 నుండి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సిద్ధమవుతున్నారు. ట్రైలర్ ద్వారా భారీ అంచనాలను సెట్ చేసిన పుష్ప 2, అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేందుకు రెడీగా ఉంది. ఇప్పటికే యుఎస్ ప్రీమియర్స్ డిసెంబర్ 4న జరుగుతుండగా, అంతర్జాతీయ మార్కెట్‌లో సినిమా పెద్ద ఎత్తున కలెక్షన్లను నమోదు చేయబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సినిమా ప్రమోషన్స్ కూడా దుమ్ము రేపుతున్నాయి. పట్నాలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్, పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ చేసిన స్టైలిష్ ఎంట్రీ ఇప్పటికి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. సుకుమార్ డైరెక్షన్, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం, బన్నీ పెర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన బలం కానున్నాయి. గతంలో ఊ అంటావా పాట సంచలనంగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు "కిస్సిక్" పాట కూడా అంతకంటే పెద్ద హిట్ అవుతుందన్న హైప్ నెలకొంది.