పుష్ప-2 తెలంగాణ రేట్లు ఇలా.. బుకింగ్ యాప్స్ లో రచ్చ షురూ
అదే సమయంలో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 షో టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచుకునేందుకు మేకర్స్ కోరగా.. తెలంగాణ సర్కార్ ఓకే చెప్పేసింది.
By: Tupaki Desk | 30 Nov 2024 10:26 AM GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2: ది రూల్.. మరో ఐదు రోజుల్లో సందడి చేయనున్న విషయం తెలిసిందే. దీంతో ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీ సీక్వెల్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో ప్రీబుకింగ్స్.. స్టార్ట్ కానున్నాయి.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో టికెట్ల ధరలు పెంచుకోవడంతో పాటు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీన మూవీ రిలీజ్ కానుండగా.. 4వ తేదీన రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్ షో వేసుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంటకు, 4 గంటలకు షోలు వేసుకునేందుకు ఒప్పుకుంది.
అదే సమయంలో డిసెంబర్ 4వ తేదీ రాత్రి 9.30 షో టికెట్ ధరను అదనంగా రూ.800 పెంచుకునేందుకు మేకర్స్ కోరగా.. తెలంగాణ సర్కార్ ఓకే చెప్పేసింది. దీంతో రాష్ట్రంలో భారీగా టికెట్ల రేట్లు భారీగా పెరగనున్నాయి. డిసెంబర్ ఫోర్త్ స్పెషల్ షో సింగిల్ స్క్రీన్ టికెట్ కాస్ట్ సుమారు రూ.1000 ఉండనుంది. మల్టీప్లెక్స్ లో అయితే రూ.1200కు పైగా కచ్చితంగా ఉంటుంది!
దాంతోపాటు డిసెంబర్ 5వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ.150, మల్టీప్లెక్సుల్లో రూ.200 పెంచుకునేందుకు అంగీకరించింది. డిసెంబర్ 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సింగిల్ స్క్రీన్‌లో రూ.105, మల్టీఫ్లెక్స్‌లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.
మరోవైపు, టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో పుష్ప మ్యానియా కనిపిస్తోంది. Book My Showలో 1.4 మిలియన్లకు పైగా ప్రజలు పుష్ప 2పై ఆసక్తి కనబరిచారు. 2.3 మిలియన్ల మంది ప్రజలు PayTM, డిస్ట్రిక్ట్ యాప్‌లపై ఆసక్తి చూపారు. PayTMలో కల్కి (2.2 మిలియన్లు) నెలకొల్పిన రికార్డును పుష్ప 2 బద్దలు కొట్టింది.
బుక్ మై షోలో మొదటి గంటలోనే హిందీ వెర్షన్ కు దాదాపు 8వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. దీంతో అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందని చెప్పాలి. గంటకు 10K+ టిక్కెట్ల విక్రయాలను అతి తక్కువ సమయంలోనే పొందిన మూవీగా పుష్ప-2 నిలిచింది. మరి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్ లు ప్రారంభమైనప్పుడు ట్రెండ్ లు మరింత పెరుగుతాయని సినీ పండితులు అంచనా వేస్తున్నారు.