Begin typing your search above and press return to search.

'పుష్ప 2'.. ఫస్ట్ డే RRR రికార్డ్ లేచిపోతుందా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ''పుష్ప 2: ది రూల్‌'' మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

By:  Tupaki Desk   |   5 Dec 2024 3:44 AM GMT
పుష్ప 2.. ఫస్ట్ డే RRR రికార్డ్ లేచిపోతుందా?
X

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ''పుష్ప 2: ది రూల్‌'' మూవీ భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పుష్పరాజ్ రాక కోసం మూడేళ్లుగా కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన అభిమానులు.. బిగ్ స్క్రీన్ మీద మాస్ జాతర చూసి ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్ కు ముందే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం.. రిలీజ్ తర్వాత సరికొత్త రికార్డులు నమోదు చేయబోతోంది. ఆల్రెడీ బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ రూల్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజే RRR రికార్డును బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

'పుష్ప 2: ది రూల్‌' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సంచనలం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రీసేల్స్ లోనే రూ.130 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ట్రెండ్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ పెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 223 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. హయ్యెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు సాధించిన ఇండియన్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. అయితే ఇప్పుడు 'పుష్ప 2' సినిమా దాన్ని బీట్ చేస్తుందని అంటున్నారు.

ప్రభాస్ నటించిన 'కల్కి 2898 AD' మూవీ ట్రిపుల్ ఆర్ ఓపెనింగ్ డే వసూళ్లను క్రాస్ చేస్తుందని అందరూ భావించారు. కానీ అది రూ.180 కోట్ల వరకే రాబట్టింది. అయితే ఇప్పుడు ''పుష్ప 2: ది రూల్‌" చిత్రం మొదటి రోజే రూ. 280 - 300 కోట్ల కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రూ. 250 కోట్లు చేసినా సరే అల్లు అర్జున్ సినిమా RRR ఓపెనింగ్ డే రికార్డును బ్రేక్ చేయడమే కాదు, భారతీయ చిత్ర పరిశ్రమలో కొన్నాళ్ళపాటు ఎవరూ టచ్ చేయని రికార్డ్ పెట్టినట్లే.

'పుష్ప 2' సినిమాకి రికార్డ్ బ్రేకింగ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ రావడానికి.. అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ చేయడం ఒక కారణమైతే, టికెట్ రేట్లు అధికంగా ఉండటం ఇంకో కారణమనే కామెంట్లు వస్తున్నాయి. అల్లు అర్జున్ సినిమాకి బాక్సాఫీస్ వద్ద ఇతర భాషల్లోనూ పోటీ లేకపోవడం అడ్వాంటేజ్ గా మారింది. అలానే మరో మూడు వారాల పాటు థియేటర్లలోకి ఇంకో కొత్త సినిమా వచ్చే పరిస్థితి లేదు. క్రిస్మస్ సీజన్ వరకూ పెద్దగా విడుదలలు కూడా లేవు. ఇది 'పుష్ప 2: ది రూల్‌'కి గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి.

"పుష్ప 2" చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనాలు వేస్తూ వచ్చాయి. ఈరోజుల్లో పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయగలవని నిరూపించాయి. కాబట్టి ఇప్పుడు ఈ చిత్రం కూడా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అభిమానులు నమ్ముతున్నారు. ఏదేమైనా 'పుష్ప 1'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన అల్లు అర్జున్.. దాని సీక్వెల్ ద్వారా తన బాక్సాఫీస్ సామర్థ్యాన్ని చూపించే సమయం వచ్చిందని చెప్పాలి.